ఇది పరీక్షల కాలం

ABN , First Publish Date - 2022-05-06T06:18:45+05:30 IST

పరీక్ష కాలం మొదలైంది.. ఇంటర్మీడియేట్‌, పదో తరగతి, ఓపెన్‌ స్కూల్‌, నీట్‌, ఇతర పరీక్షలు మొదలవుతున్నాయి.

ఇది పరీక్షల కాలం

- నేటి నుంచి ఇంటర్మీడియేట్‌ పరీక్షలు

- ఏర్పాట్లు పూర్తి

- ఈ నెల 23 నుంచి ‘పది’ విద్యార్థులకు..  

- పరీక్షల నిర్వహణపై కలెక్టర్‌ మార్గనిర్దేశం

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

పరీక్ష కాలం మొదలైంది.. ఇంటర్మీడియేట్‌, పదో తరగతి, ఓపెన్‌ స్కూల్‌, నీట్‌, ఇతర పరీక్షలు మొదలవుతున్నాయి. ప్రధానంగా ఇంటర్మీడీయేట్‌, పదో తరగతి పరీక్షలు విదార్థులకు ఎంతో కీలకమైనవి. ఇందుకోసం విద్యార్థులు సన్నద్ధం అవుతున్నారు. రెండేళ్ల తరువాత మళ్లీ వార్షిక పరీక్ష ప్రక్రియ మొదలైంది. పదోతరగతిలో ఉత్తమ ఫలితాల కోసం ప్రత్యేక తరగతులు ప్రారంభించారు. ఇప్పుడు అందరి దృష్టి పరీక్షల వైపు మళ్లింది. శుక్రవారం నుంచి ఇంటర్మీడియేట్‌ పరీక్షలు ప్రారంభం అవుతుండగా 23 నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి పరీక్షల ఏర్పాట్లపై మార్గనిర్దేశం చేశారు. దానికి అనుగుణంగా ఇంటర్‌ పరీక్షల ఏర్పాట్లను పూర్తి చేశారు. సెల్‌ఫోన్‌లు, ఎలక్ర్టానిక్‌ వస్తువులు పరీక్ష కేంద్రలోకి అనుమతించరు. ఈ సారి కూడా ఒక్క నిముషం నిబంధన ఉంది.

- నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ.. 

జిల్లాలో ఇంటర్మీడీయేట్‌ పరీక్షల కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 8 వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించారు. మే 6 నుంచి 24వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ సారి కూడా ఒక నిముషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించరు. ఇంటర్మీడియేట్‌ పరీక్షల కోసం జిల్లాలో 17 కేంద్రాలను ఏర్పాటు చేశారు. సిరిసిల్లలో ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల, సెస్‌ బాలికల ప్రభుత్వ జూనియర్‌కళాశాల, పద్మశ్రీ, సహస్త్ర, సాయిశ్రీ, జూనియర్‌ కళాశాలలతో పాటు వేములవాడలో విద్యాకళ, వివేకానంద, పవిత్ర మరియు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల కోనరావుపేట, ఇల్లంతకుంట, గంభీరావుపేట, ముస్తాబాద్‌ చందుర్తి,  తంగళ్లపల్లిలో టీఎస్‌ వెల్ఫేర్‌ జూనియర్‌ కళాశాలలో, ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలతో పాటు రాచర్ల జూనియర్‌ కళాశాలలో సెంటర్లను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంది. పరీక్ష కేంద్రాల వద్ద నిరంతరం కరెంట్‌ సరఫరా ఉండేలా చర్యలు చేపట్టారు. ఫ్యాన్లు, ఏఎన్‌ఎంను అందుబాటులో ఉంచుతున్నారు. తాగునీరు సౌకర్యం, ఓఆర్‌ఎస్‌ ప్యాకేట్లు అందుబాటులో ఉంచుతున్నారు. పరీక్షకు గంట ముందు నుంచే పరీక్ష కేంద్రాలకు అనుమతించనున్నారు. మాస్క్‌ ధరించాలని, వాటర్‌ బాటిల్‌ శానిటైజర్‌ వెంట తెచ్చుకోవాలని సూచనలు చేశారు. షూలకు అనుమతి నిరాకరించారు. చెప్పులతోనే కేంద్రాలకు రావాల్సి ఉంటుంది. 

- ఇంటర్‌ విద్యార్థులు 8,936 మంది 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ఇంటర్‌ పరీక్షల్లో 8,936 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. బాలురు 3,864 మంది, బాలికలు 5,072 మంది ఉన్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులు 4,474 మంది ఉండగా బాలురు 1,983మంది, బాలికలు 2,491 మంది, ఉన్నారు. రెండవ సంవత్సరం పరీక్షలు 4,462 మంది హాజరు కానుండగా బాలురు 1,881 మంది, బాలికలు 2,581 మంది ఉన్నారు. విద్యార్థులు ఒక నిముషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోని అనుమతించరు. సెల్‌ పోన్లు, ఎలక్ర్టానిక్‌ వస్తువులకు అనుమతి లేదు. పరీక్ష కేంద్రాల వద్ద నలుగురు చొప్పున ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, డిప్యూటీ తహసీల్దార్లు, సిట్టింగ్‌ స్క్వాడ్‌లు, నలుగురు చొప్పున పోలీసు, మానిటరింగ్‌ చేసేందుకు హైపవర్‌ కమిటీ ఉంది. పరీక్ష కేంద్రాల్లో 20 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్‌ను నియమించారు.

- పదో తరగతి విద్యార్థులు 6,379 మంది..

కరోనా కాలంలో వార్షిక పరీక్షలు లేకుండా గడిచిపోగా ఈ సారి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించనున్నారు. ఎలక్ర్టానిక్‌ పరికరాలపై నిషేధం విధించారు. ఈ నెల 23 నుంచి జూన్‌ 1 వరకు పది పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లాలో ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. 6,379 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. ఇందులో 3,013 మంది బాలురు, 3,366 మంది బాలికలు ఉన్నారు. ప్రైవేటు పాఠశాలలు, ఎయిడెడ్‌ పాఠశాలకు సంబంధించి 1,429 మంది ఉండగా బాలురు 767 మంది, బాలికలు 662 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 2,794 మంది విద్యార్థులు ఉండగా బాలురు 1,513 మంది, బాలికలు 1,281 మంది, రెసిడెన్షియల్‌ పాఠశాలలో 958 మంది ఉండగా బాలురు 299 మంది, బాలికలు 699 మంది, మోడల్‌ స్కూల్‌లో 663 మంది ఉండగా బాలురు 357 మంది, బాలికలు 306 మంది, కేజీబీవీలో 330 మంది, జీహెచ్‌ఎస్‌లో 146మంది ఉండగా 75 మంది బాలురు, 71 మంది బాలికలు ఉన్నారు. 


Read more