ధాన్యం కొనుగోలుతో సంబంధం లేదు

ABN , First Publish Date - 2021-12-06T08:20:55+05:30 IST

ధాన్యం కొనుగోలుతో రాష్ట్రప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని మంత్రి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు.

ధాన్యం కొనుగోలుతో సంబంధం లేదు

  • రాష్ట్రానిది కేవలం పర్యవేక్షక పాత్రే.. గోయల్‌వి అబద్ధాలు
  • దేశాన్ని తప్పుదోవ పట్టించిన కేంద్ర మంత్రి
  • రైతులు యాసంగిలో వరి సాగు చేయొద్దు: నిరంజన్‌రెడ్డి
  • ‘ధాన్యం’పై కేంద్ర వైఖరిలో స్పష్టత లేదు: ప్రశాంత్‌రెడ్డి


హైదరాబాద్‌/నిజామాబాద్‌ అర్బన్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోలుతో రాష్ట్రప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని మంత్రి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. మిల్లర్లు, భారత ఆహార సంస్థ(ఎ్‌ఫసీఐ) మధ్య ఒప్పందాల మేరకే ధాన్యం కొనుగోళ్లు జరుగుతాయని, అందులో రాష్ట్ర ప్రభుత్వానిది పర్యవేక్షణ పాత్రేనని చెప్పారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. పార్లమెంట్‌ సాక్షిగా కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ పచ్చి అబద్ధాలు మాట్లాడారని, ఆయన దేశాన్ని తప్పుదోవపట్టించారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఇవ్వాల్సిన బియ్యం కోటానే ఇంకా పంపలేదని పీయూష్‌ గోయల్‌ వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రం నుంచి బియ్యం తీసుకుపోవాలని తెలంగాణ పౌరసరఫరాల శాఖ పలుమార్లు ఎఫ్‌సీఐకి లేఖలు రాసిన పట్టించుకోలేదని ఆరోపించారు. గత ఏడేళ్ల కాలంలో రాష్ట్రం నుంచి 85ు ఉప్పుడు బియ్యాన్ని కేంద్రం కొనుగోలు చేసి.. ఇక నుంచి కొనబోమని ప్రకటించడం దురదృష్టకరమన్నారు.


కేంద్ర విధానాలను గమనించే పంటల మార్పిడిని రాష్ట్ర ప్రభుత్వం పోత్సహిస్తోందన్నారు. యాసంగిలో రైతులు వరిసాగు చేయొద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు కేంద్రాలుండవని స్పష్టం చేశారు. వానాకాలంలో మొలకెత్తిన, తడిచిన ధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాత కొనుగోలు చేస్తున్నామని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. కాగా, ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర వైఖరిలో స్పష్టత లేదని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం నిజామాబాద్‌ జిలా ్లకేంద్రంలో మీడియాతో ఆయన మాట్లాడారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లపై  పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఆందోళన చేస్తుంటే బీజేపీ, కాంగ్రెస్‌ ఎంపీలు ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. ఇప్పుడు రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిపెట్టాలని ఆ పార్టీల నేతలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు.

Updated Date - 2021-12-06T08:20:55+05:30 IST