దీపావళికి ఖమ్మంలో ఐటీ వెలుగులు

ABN , First Publish Date - 2020-10-21T06:07:17+05:30 IST

వచ్చేనెల దీపావళి నాటికి ఖమ్మంలో ఐటీ హబ్‌ కాంతులీనబోతోంది. దీపావళి పండుగకు ఐటీహబ్‌ ప్రారంభించేందుకు కసరత్తు సాగుతోంది

దీపావళికి ఖమ్మంలో ఐటీ వెలుగులు

ఖమ్మంలో పూర్తి కావస్తున్న ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ హబ్‌ నిర్మాణం

ఐదు ఫ్లోర్లు, 50వేల చదరపు అడుగుల విస్తీర్ణం..

కార్యకలాపాలకు ఎనిమిది కంపెనీల అంగీకారం


ఖమ్మం, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వచ్చేనెల దీపావళి నాటికి ఖమ్మంలో ఐటీ హబ్‌ కాంతులీనబోతోంది. దీపావళి పండుగకు ఐటీహబ్‌ ప్రారంభించేందుకు కసరత్తు సాగుతోంది. రూ.25కోట్లతో చేపట్టిన ఖమ్మం ఐటీహబ్‌ పనులు  చురుగ్గా సాగుతున్నాయి. టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఐటీహబ్‌ పనులు దసరాకు పూర్తిచేసి ప్రారంభించాలనుకున్నా సాధ్యంకాలేదు. చివరి దశ పనులు నెలరోజుల్లోగా పూర్తిచేసి ఐటీ హబ్‌ను ప్రారంభిస్తే ఖమ్మం నగరానికి మంరిత గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. 


2017లో ఐటీహబ్‌ మంజూరు

హైదరాబాదు తర్వాత తెలంగాణలోని జిల్లా కేంద్రాల్లో కూడా ఐటీ రంగాన్ని విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు జిల్లాలకు ఐటీహబ్‌లు మంజూరుచేసింది. ఖమ్మం ఎమ్మెల్యే, ప్రస్తుత రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌  2017లో ఐటీహబ్‌ను మంజూరు చేయించారు. రూ.25కోట్లతో ఐటీహబ్‌ ప్రాజెక్టు లక్ష్యంగా ఐదు ఫ్లోర్లతో భవన నిర్మాణ పనులకు అప్పటి రాష్ట్ర మంత్రులు కె.తారకరామారావు, తుమ్మల నాగేశ్వరరావు, పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేగా ప్రస్తుత మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ శంకుస్థాపన చేశారు. ఆతర్వాత పనులు నత్తనకడగా సాగగా రవాణశాఖమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మంత్రి పువ్వాడ ఐటీహబ్‌ పనులపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఉన్నతాధికారులతో మాట్లాడి నిధులు మంజూరుచేయించి పనులు వేగవంతం చేశారు. ఐటీహబ్‌లో కార్యకలాపాలు నిర్వహించేందుకు ఎనిమిది ఐటీ కంపెనీలు ఇప్పటికే ముందుకు వచ్చి అంగీకార పత్రాలు ఇచ్చాయి. తెలంగాణ, ఆంధ్రా ప్రాంతానికి ఖమ్మం గుమ్మంగా ఉండడంతో  రెండు రాష్ట్రాలకు చెందిన ఐటీ సంస్థల ప్రతినిధులు ఖమ్మం కేంద్రంగా ఐటీ వ్యాపారాలను నిర్వహించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. 


ఫినిషింగ్‌ దశలో పనులు

ఐదు ఫ్లోర్లతో ఎకరన్నర భూమిలో 50వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొనుసాగుతున్న నిర్మాణం తుది దశకు చేరింది. ప్రస్తుతం ఫినిషింగ్‌ పనులు నడుస్తున్నాయి. ఇక్కడ ఐటీహబ్‌ నిర్మాణం ద్వారా 300మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని, ఆశిస్తున్నారు. వచ్చే దీపావళి నాటికి పనులు పూర్తిచేసి ప్రారంభిస్తామని  మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు.  

Updated Date - 2020-10-21T06:07:17+05:30 IST