Sep 29 2021 @ 01:37AM

తెలుగు నటుల ఆత్మగౌరవ పోరాటమిది

‘‘మేమంతా ఓ కుటుంబం. అందులో ప్రతి ఒక్కరి ఆత్మగౌరవానికి సంబంధించిన ఎన్నికలివి. తెలుగు నటుల ఆత్మగౌరవ పోరాటమిది. ‘మా’లో 900మంది సభ్యుల మద్దతు నాకుంది. రెండు రోజుల్లో నా మేనిఫెస్టో విడుదల చేస్తా. అది చూశాక... చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ కూడా నాకే ఓటేస్తారు’’ అని విష్ణు మంచు అన్నారు. ‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ (మా) అధ్యక్ష పదవికి మంగళవారం ఆయన, ప్యానల్‌ సభ్యులు నామినేషన్‌ వేశారు. ఈ సందర్భంగా విష్ణు మంచు మాట్లాడుతూ ‘‘అక్టోబర్‌ 10న ‘మా’ ఎన్నికలు జరుగుతాయి. మేమంతా హుషారుగా, కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. మేమంతా గెలుస్తాం. ఎన్నికలు ఫలితాలు వెలువడిన సాయంత్రం మళ్లీ మీ ముందుకు వస్తాం. అందరం మాట్లాడతాం’’ అని చెప్పారు.


పవన్‌ వ్యాఖ్యలతో ఏకీభవించను! 

సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో అమ్మాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపైనా విష్ణు మంచు స్పందించారు. ఆయన మాట్లాడుతూ ‘‘నాన్న(మోహన్‌బాబు)గారిని ఉద్దేశించి పవన్‌గారు కొన్ని ప్రశ్నలు వేశారు. ‘మా’ ఎన్నికలు 10న పూర్తికాగానే, 11న నాన్నే సమాధానాలిస్తారు. ఇక, పవన్‌ ఇండస్ట్రీని ఉద్దేశించి మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలకు, మాకు ఎటువంటి సంబంధం లేదని తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ లేఖ విడుదల చేసింది. నేనూ ఈ విషయంలో పవన్‌కల్యాణ్‌గారితో ఏకీభవించడం లేదు. ఇండస్ట్రీ బిడ్డగా, నిర్మాతగా, నటుడిగా ఛాంబర్‌ లేఖతో ఏకీభవిస్తున్నా. మరి, ప్రకాశ్‌రాజ్‌గారు పవన్‌ వైపు ఉన్నారా? తెలుగు ఇండస్ట్రీ వైపు ఉన్నారా? చెప్పాలి. నిర్మాతలే ఆన్‌లైన్‌ టికెటింగ్‌ తీసుకురావాలని కోరినట్టు ఏపీ మంత్రి పేర్ని నాని చెప్పారు. ఆయన అబద్ధాలు చెప్పరు కదా! ఆయనతో సమావేశమైన పరిశ్రమ ప్రతినిధులు ఎవరూ అబద్ధమని చెప్పలేదు. చెబితే అప్పుడు మాట్లాడతా’’ అని అన్నారు. బండ్ల గణేశ్‌ ఆరోపించినట్టు ఎవరికీ గిఫ్ట్‌లు ఇవ్వడం లేదన్నారు.