పదేళ్లలో ఐదు సినిమాలు చేసినా చాలు

‘చూసి చూడంగానే’ నచ్చేసిన కుర్రాడు శివ కందుకూరి. తొలి సినిమాతోనే చక్కటి అభినయం ప్రదర్శించాడు. ఇప్పుడు తన చేతిలో మూడు సినిమాలున్నాయి. మరో రెండు కథలు రెడీ అవుతున్నాయి. శివ కందుకూరి నటించిన ‘గమనం’. శ్రియ ప్రదాన పాత్ర పోషించారు. సంజనారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా శివ కందుకూరి ‘గమనం’ విశేషాలను పంచుకున్నారు.


‘‘ఓ కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా సంజన పరిచయం. ‘నా దగ్గర ఓ కథ ఉంది వింటారా’ అని అడిగారు. అప్పుడు నేను వరంగల్‌ లో ఉన్నా. నాకోసం హైదరాబాద్‌ నుంచి వరంగల్‌  అప్పటికప్పుడు వచ్చారు. కథ చెప్పగానే బాగా నచ్చింది. ‘నేను చేస్తా’ అని మాటిచ్చా. ఆ తరవాతే... ఈచిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తారని, జ్ఞానవేల్‌ ఛాయాగ్రహకుడని తెలిసింది. ఇళయరాజా గారు పని చేసిన సినిమాలో నేనూ ఓ భాగం అవుతానని కలలో కూడా అనుకోలేదు. నిజంగా ఇది నా జీవిత కాల స్వప్నం. మళ్లీ నాకు ఇలాంటి అరుదైన అవకాశం రాదేమో అనిపించింది’’


‘‘ఇందులో నేను ఓ క్రికెటర్‌గా కనిపించాలి. చిన్నప్పుడు క్రికెట్‌ ఆడాను. కానీ.. ఆ తరవాత టచ్‌లో లేదు. ఈ సినిమా ఒప్పుకోగానే క్రికెట్‌ పై ఫోకస్‌ పెట్టా. ఓ కోచ్‌ని నియమించుకుని ట్రైనింగ్‌ తీసుకున్నా. నాకు చారుహాసన్‌ తాతయ్యలా నటించారు. నా నిజ జీవితంలోనూ మా తాతగారితో మంచి అనుబంధం ఉంది. అందుకే ఈ కథకు మరింతగా కనెక్ట్‌ అయ్యాను. కథలో ఎమోషన్లు ప్రేక్షకుల్ని కట్టి పడేస్తాయి. ఈ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేస్తుంది? ఎంత పెద్ద హిట్‌ అవుతుంది? అనేది ఇప్పుడు చెప్పలేను గానీ, చూసిన ప్రతి ఒక్కరూ ‘ఒక గొప్ప సినిమా చూశాం’ అనే అనుభూతి పొందుతారు’’


‘‘ఈమధ్య నాకు చాలా అవకాశాలు వచ్చాయి. కొన్ని కథల్ని నేను తిరస్కరించా. ఎందుకంటే... కథతో కనెక్ట్‌ అవ్వకపోతే, అలాంటి సినిమాలు నేను చేయలేను. హిట్లు, సూపర్‌ హిట్లు పరిశ్రమకు రావొచ్చు. కాకపోతే.. హిట్‌ అయిన ప్రతి సినిమా ప్రేక్షకులకు గుర్తు ఉండకపోవొచ్చు. ఓ కథ ఎమోషన్‌గా కనెక్ట్‌ అయితే... ఎప్పటికీ మర్చిపోలేను. అలాంటి కథల కోసం అన్వేషిస్తున్నా. ఆ ప్రయాణంలోనే ‘గమనం’ వచ్చింది. సినిమాల సంఖ్య పెంచుకోవాలన్న ఉద్దేశ్యం లేదు. పదేళ్లలో ఐదు సినిమాలు చేసినా గుర్తుండిపోయేలా ఉండాలి. ప్రస్తుతం ‘మను చరిత్ర’ అనే ఓ సినిమా పూర్తి చేశా. కచ్చితంగా ఓ కొత్త అనుభూతి కలిగించే సినిమా అది. నాని నిర్మాతగా రూపొందిన ‘మీట్‌ - క్యూట్‌’లోనూ నటించా. మరో రెండు కొత్త సినిమాలకు సంతకాలు చేశా’’. 

Advertisement