ఆడపిల్లలను రక్షించడం అందరి బాధ్యత

ABN , First Publish Date - 2022-01-25T04:32:28+05:30 IST

పుట్టబోయే బిడ్డ ఆడ అయినా మగ అయినా అంతా సమానమే అని, ఇప్పటికీ వివక్షతో భ్రూణహత్యలకు పాల్పడుతున్నారని, ఆడపిల్లలను రక్షించుకోవడం అందరి బాధ్యత అని మొదటి అదనపు మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ (ఫస్ట్‌ ఏడీఎం) ఇ.ప్రతిభ తెలిపారు.

ఆడపిల్లలను రక్షించడం అందరి బాధ్యత
సమావేశంలో మాట్లాడుతున్న ఫస్ట్‌ ఏడీఎం ప్రతిభ

ప్రొద్దుటూరు క్రైం, జనవరి 24 : పుట్టబోయే బిడ్డ ఆడ అయినా మగ అయినా అంతా సమానమే అని, ఇప్పటికీ వివక్షతో భ్రూణహత్యలకు పాల్పడుతున్నారని, ఆడపిల్లలను రక్షించుకోవడం అందరి బాధ్యత అని మొదటి అదనపు మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ (ఫస్ట్‌ ఏడీఎం) ఇ.ప్రతిభ తెలిపారు. సోమవారం స్థానిక పురపాలక పరిధిలో రెండో వార్డు పురపాలకోన్నత పాఠశాలలో బాలికా సదస్సు జరిగింది. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆడపిల్ల పుట్టిందంటే, అడుగడుగునా అంక్షలు విధిస్తున్నారని దీంతో ప్రభుత్వం ఆడపిల్లల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. తల్లిదండ్రులు ఆడపిల్లలకు విద్యాబుద్దులు చెప్పించి ఉజ్వల భవిష్యత్తును ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ అడ్వకేట్‌ ముడిమెల కొండారెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు గీత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 


హక్కులపై అవగాహన 

మైలవరం, జనవరి 24 : బాలికలు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని జమ్మలమడుగు జూనియర్‌ సివిల్‌ జడ్జి బాబా ఫకృద్దీన్‌ తెలిపారు. సోమవారం మండల పరిధిలోని వేపరాల జడ్పీ హైస్కూల్‌ ఆవరణంలో ప్రపంచ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలుర కంటే బాలికలే ముందు స్థానంలో నిలుస్తుండటం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు మురళీధర్‌రెడ్డి, సుబ్బారావు, జాకీర్‌హుస్సేన్‌, జయన్న, ఏఎ్‌సఐ గుర్రప్ప, ఉపాఽధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-25T04:32:28+05:30 IST