రాయచోటిని జిల్లా కేంద్రం చేయడం హర్షణీయం

ABN , First Publish Date - 2022-01-29T05:13:46+05:30 IST

శ్రీవెంకటేశ్వరస్వామి ప్రియ భక్తుడు, పదకవితా పితామహుడు అన్నమయ్య పేరుపై జిల్లా ప్రకటించటమే కాకుండా రాయచోటిని జిల్లా కేంద్రంగా చేసిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి భారతీయ జనతా పార్టీ రాష్ట్రకార్యవర్గ సభ్యుడు డాక్టర్‌ పాలగిరి శ్రీనివాసరాజు కృతజ్ఞతలు తెలియజేశారు.

రాయచోటిని జిల్లా కేంద్రం చేయడం హర్షణీయం
లక్కిరెడ్డిపల్లెలో దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్న దృశ్యం

రాయచోటి, జనవరి 28: శ్రీవెంకటేశ్వరస్వామి ప్రియ భక్తుడు, పదకవితా పితామహుడు అన్నమయ్య పేరుపై జిల్లా ప్రకటించటమే కాకుండా రాయచోటిని జిల్లా కేంద్రంగా చేసిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి భారతీయ జనతా పార్టీ రాష్ట్రకార్యవర్గ సభ్యుడు డాక్టర్‌ పాలగిరి శ్రీనివాసరాజు కృతజ్ఞతలు తెలియజేశారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అత్యంత వెనుకబడిన ప్రాంతమైన రాయచోటిని జిల్లా కేంద్రంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పార్టీలకు అతీతంగా స్వాగతిస్తున్నామన్నారు. అన్ని నియోజకవర్గాలకు రాయచోటి కేంద్ర బిందువుగా ఉందని, ఇక్కడ జిల్లా కేంద్రానికి కావాల్సిన అన్ని మౌలిక వసతులు ఇక్కడ ఉండడమే కాకుండా అన్ని ప్రాంతాల వారికి సమాన దూరంలో ఉందని గుర్తు చేశారు. 


జగన్‌, శ్రీకాంత్‌రెడ్డిలకు పాలాభిషేకం

లక్కిరెడ్డిపల్లె, జనవరి 28: రాయచోటిని అన్నమయ్య జిల్లాగా ప్రకటించడం పట్ల దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డిలకు క్షీరాభిషేకం నిర్వహించారు. శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఎంపీపీ మద్దిరేవుల సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ నేతలు రెడ్డెయ్య, ఎంపీటీసీలు నరసింహారెడ్డి, దస్తగిరి, లక్ష్మినారాయణ, వైస్‌ ప్రెసిడెంట్‌ రాజారెడ్డి, రవిరాజు, నన్నేసాహెబ్‌ తదితరులు పాల్గొన్నారు. 

రామాపురంలో...: రాయచోటిని అన్నమయ్య జిల్లాగా ప్రకటించడం పట్ల మండల కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, పార్లమెంట్‌ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డిల చిత్రపటానికి మాజీ ఎంపీపీ, వైసీపీ మండల కన్వీనర్‌ గడికోట జనార్థన్‌రెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. అంతకుముందు మండల ప్రజాపరిషత్‌ కార్యాలయం నుంచి వైఎ్‌సఆర్‌ సర్కిల్‌ వరకు సంఘీభావంగా ర్యాలీ నిర్వహించారు. జెడ్పీటీసీ మానస వెంకట్రమణ, వైస్‌ ఎంపీపీ రవిశంకర్‌రెడ్డి,  పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 

చిన్నమండెంలో...: రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించడంపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ఈ ప్రాంత ప్రజలు రుణపడి ఉంటారని మాజీ జెడ్పీ వైస్‌ చైర్మెన్‌ దేవనాధరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని వైఎ్‌సఆర్‌ విగ్రహం వద్ద రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించేందుకు కృషి చేసిన చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నేతలు పాల్గొన్నారు.  

Updated Date - 2022-01-29T05:13:46+05:30 IST