పనిచేస్తేనే ప్రాధాన్యం

ABN , First Publish Date - 2022-09-03T06:01:42+05:30 IST

‘పార్టీ అభ్యున్నతి కోసం పనిచేస్తేనే ప్రాధాన్యం ఉంటుంది. కాదూ... కూడదు మేమే మోనార్కులమనుకుంటే ఎవరినీ ఉపేక్షించేది లేదు’ అని టీడీపీ అధినేత నారాచంద్రబాబునాయుడు ఆ పార్టీ ముఖ్య నేతలకు స్పష్టం చేశారు.

పనిచేస్తేనే ప్రాధాన్యం

మోనార్కులమంటే ఉపేక్షించేది లేదు

అందరూ కలిసిమెలిసి పనిచేయాలి

లేదంటే రాష్ట్రస్థాయి నుంచి పర్యవేక్షణ

నెలలో పదిరోజులు ప్రజల్లో ఉండాలి

వైసీపీ విధ్వంసకర పాలనను చాటండి

టీడీపీ అధినేత చంద్రబాబు దిశానిర్దేశం

ఇనచార్జ్‌లు, రాష్ట్ర కమిటీ నాయకులతో సమావేశం

అనంతపురం, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): ‘పార్టీ అభ్యున్నతి కోసం పనిచేస్తేనే ప్రాధాన్యం ఉంటుంది. కాదూ... కూడదు మేమే మోనార్కులమనుకుంటే ఎవరినీ ఉపేక్షించేది లేదు’ అని టీడీపీ అధినేత నారాచంద్రబాబునాయుడు ఆ పార్టీ ముఖ్య నేతలకు  స్పష్టం చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నియోజకవర్గ ఇనచార్జ్‌లు, పార్టీ రాష్ట్ర కమిటీ నాయకులతో చంద్రబాబునాయుడు శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఉమ్మడి అనంత నుంచి ముఖ్య నాయకులు హాజరయ్యారు. పార్టీని క్షేత్రస్థాయిలో ఏ విధంగా బలోపేతం చేయా లి, ప్రజలకు ఎలా దగ్గరవ్వాలి, పార్టీ సభ్యత్వ నమోదు, బాదుడే బాదుడు కార్యక్రమ నిర్వహణ, వైసీపీ విధ్వంసకర పాలనను ప్రజల్లో ఎలుగెత్తి చాటడం తదితర అంశాలపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రతి నియోజకవర్గంలో కమిటీలపే ఏర్పాటు చేయాల్సిన బాధ్యత నియోజకవర్గ ఇనచార్జ్‌లదే అని అన్నారు. పార్టీ సభ్యత్వ నమో దు విషయంలో నియోజవర్గ ఇనచార్జ్‌లు కీలకంగా వ్యవహరించాలని సూచించారు. క్షేత్రస్థాయికి వెళ్లి పార్టీ సభ్యత్వ నమోదు చేయాలని సూచించారు. అందుకే ఓటీపీ విధానాన్ని అమల్లోకి తెచ్చామని అన్నారు. నియోజకవర్గ ఇనచార్జ్‌లు ఈ రెండు అంశాలపై పూర్తిస్థాయిలో దృష్టిసారించాలని ఆదేశించారు. 


పాలనను ఎండగట్టండి

పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూనే.. వైసీపీ విధ్వంసకర పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు. వైసీపీ మూడున్నరేళ్ల ప్రజావ్యతిరేక పాలనను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని సూచించారు. నియోజకవర్గాల వారీగా వైసీపీ పాలనలో ఒరిగిందేమిటో ప్రజలకు తెలిసే విధంగా, అంశాల వారీగా వివరించాలని అన్నారు.  అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎప్పటికప్పుడు గొంతెత్తాలని, ప్రభుత్వ ఒంటెద్దు పోకడను తిప్పికొట్టాలని నియోజకవర్గ ఇనచార్జ్‌లు, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులకు  సూచించారు.



కలిసి పనిచేయండి..

పార్టీ రాష్ట్రస్థాయి నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా నియోజకవర్గ ఇనచార్జ్‌లు కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. ప్రతి కార్యక్రమంలోనూ ఇనచార్జ్‌లు కీలకంగా వ్యవహరించాలని అన్నారు. వర్గవిభేదాలు వీడి అందర్నీ కలుపుకొనిపోవాలని సూచించారు. నియోజకవర్గ ఇనచార్జ్‌లు విభేదిస్తే, ఆ నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలను రాష్ట్ర కార్యాలయమే పర్యవేక్షిస్తుందని అన్నారు. నియోజకవర్గ ఇనచార్జ్‌లు నెలలో పదిరోజులు తప్పనిసరిగా ప్రజల మధ్యన తిరగాల్సిందేనని అన్నారు. అలా తిరగనివారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పనిచేయకపోతే తోక కట్‌ చేస్తామని అన్నారు. పార్టీలో తామే మోనార్కులమనే భావనను వీడాలని సూచించారు. 



కార్యాలయం ఉండాలి..

- ప్రతి నియోజకవర్గంలో పార్టీ నియోజకవర్గ కార్యాలయం, సిబ్బంది తప్పనిసరిగా ఉండాలని, చంద్రబాబు సూచించారు. నియోజకవర్గ ఇనచార్జ్‌లు ఆ బాధ్యత తీసుకోవాలని అన్నారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తను జాగ్రత్తగా కాపాడుకోవాలని ఇనచార్జ్‌లకు సూచించారు. పార్టీకి పట్టుకొమ్మలు కార్యకర్తలేనని అన్నారు. వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీలో పనిచేసే ప్రతి నాయకుడిపై ఉందని అన్నారు. 

- నియోజకవర్గాల్లో ఓటరు నమోదుపై ఇనచార్జ్‌లు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఓటరు నమోదులో అక్రమాలకు తావులేకుండా నిఘా ఉంచాలని సూచించారు. ఓటరు జాబితాలో లోపాలను  ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సవరించేలా చూడాలని ఆదేశించారు. ఈ విషయంలో ఏ మాత్రం ఏమరపాటు తగదని అన్నారు. 



హాజరైన ముఖ్య నాయకులు

ఉమ్మడి జిల్లా నుంచి పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు, పీఏసీ చైర్మన, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, రాయలసీమ జోన మీడియా కో-ఆర్డినేటర్‌ బీవీ వెంకటరాముడు, ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు, నియోజకవర్గ ఇనచార్జ్‌లు వైకుంఠం ప్రభాకర్‌చౌదరి, మాదినేని ఉమామహేశ్వరనాయుడు, కందికుంట వెంకటప్రసాద్‌, జితేంద్రగౌడ్‌, ఈరన్న, బండారు శ్రావణిశ్రీ, శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు, ముంటిముడుగు కేశవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతురాయచౌదరి, గడ్డం సుబ్రహ్మణ్యం, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు వెంకటశివుడు యాదవ్‌, ఆదినారాయణ, జేఎల్‌ మురళి, బుగ్గయ్య చౌదరి, సవితమ్మ, దేవళ్ల మురళి, రామ్మోహన చౌదరి, అంజినప్ప, రామాంజినమ్మ, రాయల్‌ మురళి, కమతం కాటమయ్య, నరసింహమూర్తి, స్వామిదాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-03T06:01:42+05:30 IST