ఇది ధర్మక్షేత్రమే

ABN , First Publish Date - 2021-06-12T05:59:32+05:30 IST

బల్లచెక్క ఉయ్యాలకూ వధ్యశిలకూ సామ్యమేంటి? ఎప్పుడో రూసో అన్నట్టు మనిషి స్వేచ్ఛతో పుడతాడు ....

ఇది ధర్మక్షేత్రమే

బల్లచెక్క ఉయ్యాలకూ

వధ్యశిలకూ సామ్యమేంటి?

ఎప్పుడో రూసో అన్నట్టు

మనిషి స్వేచ్ఛతో పుడతాడు 

కానీ అంతటా సంకెళ్లతో ఉంటాడు.

ఆ సంకెళ్ల గొలుసులేనా ఇవి?

ఆ చివర్లో తీసివేసే బల్లచెక్కేనా 

ఈ ఉయ్యాలపీట?


పుట్టుకతోబాటూ 

బంధిపబడటమూ 

బంధనాలను తెంచుకోజూడటమూ 

పరస్పర అవినాభావ చర్యలేమో!

స్వేచ్ఛను కాంక్షించడం 

స్వేచ్ఛను గాలిని పీల్చుకునేంత 

సహజంగా పొందగోరటం 

స్వేచ్ఛను హరింపజూసే

శక్తులపై అలుపెరుగని నిరంతర

పోరాటం జరపాలనుకోవడమూ

అంతే సహజమేమో! 


ఇప్పుడు

సూదిమొన మోపినంత

స్వేచ్ఛను కూడా

నిరాకరిస్తున్నారు.

ఇటు పదహారు మంది

స్వేచ్ఛను కోరే రాజ్యనేరారోపణ 

మేధావి నిందితులు

అటు తమ కష్టాల 

పంట ఫలితాలను కోరే

పదహారువేల కర్షక సైన్యం.


ఊహలకూ ఊపాలకూ 

సంకెళ్లకూ కటకటాలకూ

ఉయ్యాలలకూ ఉరికొయ్యలకూ

సామ్యం తెలిసివస్తుందిప్పుడే!


ఇది ధర్మక్షేత్రమే

ఇది మరో కురుక్షేత్రమే

ఇక మహాజన రణక్షేత్రమే!



-ఎమ్. శ్రీధర్

Updated Date - 2021-06-12T05:59:32+05:30 IST