గాలిలోనూ కరోనాను అడ్డుకోవచ్చు!

ABN , First Publish Date - 2020-07-14T07:20:27+05:30 IST

‘‘గాలి ద్వారా కరోనా వ్యాపిస్తోంది’’ అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. పీల్చే గాలిలోనూ వైరస్‌ ఉంటే ఎలా ? అనే భయం అందరినీ చుట్టుముట్టింది...

గాలిలోనూ కరోనాను అడ్డుకోవచ్చు!

  • ప్రజల అప్రమత్తత, బహిరంగ ప్రదేశాల నిర్వహణే మార్గం
  • డబ్ల్యూహెచ్‌వో సలహాదారు లిడియా మోర్వాస్కాతో  
  • ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక ఇంటర్వ్యూ

‘‘గాలి ద్వారా కరోనా వ్యాపిస్తోంది’’ అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. పీల్చే గాలిలోనూ వైరస్‌ ఉంటే ఎలా ? అనే భయం అందరినీ చుట్టుముట్టింది. దీంతో గాలి ముసుగులో మానవాళిపై దండయాత్ర చేస్తున్న కొవిడ్‌ మహమ్మారిని అడ్డుకునేందుకు ఉన్న మార్గాలపై మేథోమథనం జరుగుతోంది. ఈనేపథ్యంలో గాలి ద్వారా వైరస్‌ వ్యాప్తిపై డబ్ల్యూహెచ్‌వో ప్రకటన చేయడానికి కారణమైన శాస్త్రవేత్తల్లో ఒకరైన డబ్ల్యూహెచ్‌వో సలహాదారు లిడియా మోర్వాస్కా ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆమె ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని డబ్ల్యూహెచ్‌వో అనుబంధ పరిశోధనాశాలల్లో ఒకటైన ఇంటర్నేషనల్‌ లేబొరేటరీ ఫర్‌ ఎయిర్‌ క్వాలిటీ అండ్‌ హెల్త్‌(ఐఎల్‌ఏక్యూహెచ్‌)కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. కొవిడ్‌ వ్యాపిస్తున్న తీరుపై అనేక పరిశోధనలు చేస్తున్నారు. ‘లిడియా’తో ఇంటర్వ్యూ పూర్తి వివరాలివీ.. 


గాలి ద్వారా కరోనా వ్యాప్తి ప్రభావం ప్రపంచదేశాలపై ఎలా ఉంటుంది ? 

ఈ ప్రకటన ప్రభావం ప్రపంచదేశాలపై కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే.. ఇకపై వారు ఈ కొత్త కోణం నుంచి కూడా నివారణ చర్యలు తీసుకోవాల్సి ఉం టుంది. నాకు తెలిసినంత వరకు ఏ దేశంలోనూ దీన్ని నివారించడానికి కచ్చితమైన ప్రమాణాలు లేవు. మనం కనీసం వాటి గురించి ఆలోచించలేదు కూడా! 


 గాలి ద్వారా వ్యాప్తిని విస్మరించడమే కేసుల పెరుగుదలకు కారణమా ? 

కేసుల సంఖ్య బాగా పెరగడానికి ఈ కోణాన్ని పట్టించుకోకపోవడమూ ఒక కారణమే. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల ద్వారా సంక్రమించే కరోనా తరహా మహమ్మారులను ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఏ దేశానికీ జాతీయ స్థాయి ఆరోగ్య ప్రణాళిక లేదు. అందుకే కరోనాను నియంత్రించే విషయంలో అన్ని దేశాలు తడబడుతున్నాయి. సాధారణంగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు గాలి, నీరు, మనుషుల ద్వారా వ్యాపిస్తాయి. వీటిపై ప్రజల్లోనూ అవగాహన పెరగాలి. కొవిడ్‌ వ్యాప్తికి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు కూడా ఒక ముఖ్య కారణమని ఇప్పటికైనా ప్రపంచదేశాల ప్రభుత్వాలు గ్రహించాలి.  


గాలి ముసుగులో కరోనా చేస్తున్న దండయాత్రను తిప్పికొట్టేదెలా ? 

బహిరంగ ప్రదేశాల్లో ఇన్ఫెక్షన్ల వ్యాప్తి నివారణను లక్ష్యంగా పెట్టుకోవాలి. నివాస ప్రాంతాల్లో ఎక్కువగా గాలి, వెలుతురు ప్రసరించేలా చూసుకోవాలి. వైరస్‌ 45 నిమిషాలు మాత్రమే గాలిలో ఉండి..నిర్వీర్యమవుతుంది. మాస్క్‌లు ధరించడం, తరుచూ చేతులను కడుక్కోవడం, భౌతికదూరం పాటించేలా ప్రజలను ప్రోత్సహిస్తే మంచిది.  


మీ అధ్యయనంలో తేలిన వివరాలేంటి ? 

చైనాలోని అనేక ప్రాంతాల్లో కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తికి గాలే కారణమని నేను, నా బృందం సభ్యులు చేసిన అధ్యయనాల్లో తేలింది. లండన్‌లోని ఒక రెస్టారెంట్‌లో తిని వెళ్లిన పలువురికి.. ఒక చర్చిలో ప్రదర్శన ఇచ్చిన సంగీతకారులలో ఎక్కువ శాతం మందికి గాలి ద్వారానే వైరస్‌ సోకిందని మేం గుర్తించాం.  - స్పెషల్‌ డెస్క్‌


Updated Date - 2020-07-14T07:20:27+05:30 IST