జరగరానిది జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత: టీడీపీ మాజీ మంత్రి

ABN , First Publish Date - 2020-02-14T15:57:21+05:30 IST

ఏజెన్సీలో తెలుగుదేశం పార్టీకి చెంది ఇద్దరు మాజీ మంత్రులకు రాష్ట్ర ప్రభుత్వం గన్‌మెన్‌ను..

జరగరానిది జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత: టీడీపీ మాజీ మంత్రి

మాజీ మంత్రులకు భద్రత బంద్‌

కిడారి శ్రావణ్‌, మణికుమారిలకు గన్‌మెన్‌ను తొలగించిన ప్రభుత్వం

మవోయిస్టుల నుంచి ముప్పు లేదని నిఘా వర్గాల నివేదిక?

శ్రావణ్‌ తండ్రిని, మణికుమారి భర్తను గతంలో కాల్చిచంపిన మావోలు

గన్‌మెన్‌ను పునరుద్ధరించాలని ఎస్పీకి లేఖ: మణికుమారి

జరగరానిది జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత: శ్రావణ్‌కుమార్‌


పాడేరు(విశాఖపట్నం): ఏజెన్సీలో తెలుగుదేశం పార్టీకి చెంది ఇద్దరు మాజీ మంత్రులకు రాష్ట్ర ప్రభుత్వం గన్‌మెన్‌ను పూర్తిగా తొలగించింది. మన్యంలో మావోయిస్టుల ప్రభావం, ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యేలకే గన్‌మన్‌లతో భద్రత కల్పించాల్సిన పరిస్థితి వుండగా, ప్రభుత్వం అందుకు భిన్నంగా మాజీ మంత్రులు కిడారి శ్రావణ్‌కుమార్‌, మత్స్యరాస మణికుమారిలకు గన్‌మెన్‌ భద్రతను తొలగించింది. వీరిద్దరూ మావోయిస్టు బాధితులే! శ్రావణ్‌కుమార్‌ తండ్రి కిడారి సర్వేశ్వరరావును 2018 సెప్టెంబరులో డుంబ్రిగుడ మండలం లివిటిపుట్టు వద్ద, మణికుమారి భర్త వెంటకరాజును 2004 ఎన్నికల ముందు పాడేరులో మావోయిస్టులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. గన్‌మెన్‌ తొలగింపుపై మాజీ మంత్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తమ భద్రతను తొలగించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గన్‌మెన్‌ను పునరుద్ధరించాంటూ మణికుమారి జిల్లా ఎస్పీకి లేఖ రాయగా, తమకు ఏదైనా జరిగితే  ప్రభుత్వానిదే బాధ్యత అని శ్రావణ్‌కుమార్‌ స్పష్టం చేశారు.


సుమారు 20 ఏళ్ల క్రితం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పని చేసిన మత్స్యరాస మణికుమారి భర్త వెంకటరాజును 2004 సాధారణ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పాడేరులో పట్టణంలో మావోయిస్టు యాక్షన్‌ టీమ్‌ అతి సమీపం నుంచి పిస్టల్‌తో కాల్చి చంపారు. తరువాత టీడీపీ అధికారాన్ని కోల్పోయింది. అయినప్పటికీ నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం  ఆమె రక్షణ కోసం ఆరుగురు గన్‌మన్‌లను కేటాయించింది. తనకు అంతమంది గన్‌మన్‌లు అవసరం లేదని, నలుగురు చాలని మణికుమారి చెప్పడంతో అప్పటి నుంచి 2018 వరకు నలుగురు గన్‌మన్‌లతో భద్రత కల్పించారు. తరువాత ఇద్దరికి తగ్గించారు. ఇదిలాఉండగా నిఘా విభాగం చేపట్టిన సర్వేలో మణికుమారికి మావోల నుంచి ముప్పులేదని, అందువల్ల గన్‌మన్‌లతో భద్రత కల్పించాల్సిన అవసరం లేదని నిర్ధారించారు. ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి మణికుమారికి భద్రతను పూర్తిగా తొలగించారు.


గన్‌మెన్‌ను పునరుద్ధరించాలని ఎస్పీకి లేఖ: మణికుమారి

సుమారు 20ఏళ్ల నుంచి వున్న భద్రతను తొలగించడంతో అభ్రతకు లోనయ్యాను. వెంటనే గన్‌మన్‌లతో భద్రతను పునరుద్ధించాలని జిల్లా ఎస్‌పీకి లేఖ రాశాను. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతోపాటు, ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమాలు, పోరాటాల నేపథ్యంలో నాకు భద్రత అవసరమని పేర్కొన్నాను. 


మావోల చేతిలో తండ్రిని కోల్పోయిన శ్రావణ్‌ 

టీడీపీ హయాంలో ప్రభుత్వ విప్‌గా ఉన్న అరకులోయ ఎమ్మెల్మే కిడారి సర్వేశ్వరరావుతోపాటు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను 2018 సెప్టెంబరులో మావోయిస్టులు హతమార్చారు. తరువాత ఆయన పెద్ద కుమారుడు శ్రావణ్‌కుమార్‌కు మంత్రివర్గంలో స్థానం కల్పించడంతోపాటు ఐదుగురు గన్‌మన్‌లతో భద్రత కల్పించారు. ఆరు నెలల తర్వాత ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయడంతో ఇద్దరు గన్‌మన్‌లను కొనసాగించారు. అయితే ఇటీవల నిఘా విభాగం చేపట్టిన సర్వేలో శ్రావణ్‌కుమార్‌కు ఎటువంటి భద్రత అవసరం లేదని నిర్ధారించారని పేర్కొంటూ ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి గన్‌మన్‌లను పూర్తిగా తొలగించారు.


జరగరానిది జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత: శ్రావణ్‌

మావోయిస్టుల కారణంగా మా పెద్దదిక్కును కోల్పోయి ఎన్ని ఇబ్బందులు పడ్డామో అందరికీ తెలుసు. అయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం మాకు భద్రత అవసరం లేదంటూ గన్‌మన్‌లను తొలగించింది. భవిష్యత్తులో జరగరానిది ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వుంటుంది. 

Updated Date - 2020-02-14T15:57:21+05:30 IST