అతిగా వాడితే అనర్థమే

ABN , First Publish Date - 2022-01-23T04:35:55+05:30 IST

అతిగా వాడితే అనర్థమే

అతిగా వాడితే అనర్థమే

కొవిడ్‌ భయంతో పెరిగిన యాంటీబయోటిక్స్‌ వినియోగం

కొత్తగా పుట్టుకొస్తున్న మల్టీడ్రగ్‌ రెసిస్టెంట్‌ క్రిములు

ప్రమాదకరమని హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు

(ఇచ్ఛాపురం రూరల్‌)

ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కరోనా భయంతో చాలామంది ప్రైవేటు వైద్యుల వద్దకు పరుగులు తీస్తున్నారు. కొంతమంది బాధితులు ఆర్‌ఎంపీ, పీఎంపీలను ఆశ్రయిస్తున్నారు. సత్వర పరిష్కారం లభిస్తుందంటూ కొందరు వైద్యులు అవసరం లేకున్నా, యాంటీబయోటిక్స్‌ మందులను రాసిచ్చేస్తున్నారు. మెడికల్‌ షాపుల్లో కూడా యాంటీబయోటిక్స్‌ విచ్చలవిడిగా లభ్యమవుతున్నాయి. దీంతో వైద్యుల పర్యవేక్షణ లేకుండానే చాలామంది యాంటీబయోటిక్స్‌ను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. దీనివల్ల మేలు కన్నా కీడే ఎక్కువని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. కొత్తగా మల్లీడ్రగ్‌ రెసిస్టెంట్‌ క్రిములు పుట్టుకొస్తున్నాయని, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మన దేశంలో కొన్నిరకాల యాంటీబయోటిక్స్‌ వినియోగం దుష్ప్రరిణామాలతో ఏటా దాదాపు 10 లక్షల మంది వరకు మరణిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. యాంటీబయోటిక్స్‌ వినియోగం పెరిగిపోవడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సైతం ఆందోళన వ్యక్తం చేస్తోంది. వీటిపై అత్యవసర నియంత్రణ అవసరమని హెచ్చరికలు కూడా జారీ చేసింది.


ఆక్వా, ఫౌలీ్ట్ర ఉత్పత్తుల ద్వారా వ్యాప్తి :

కోళ్లు, చేపలు, రొయ్యల పెంపకందారులు తమ ఉత్పత్తులను పెంచుకోవడానికి యాంటీబయోటిక్స్‌ను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. వాటి మాంసం తిన్న కొంతమందిలో ఎంఆర్‌ఎస్‌ఏ క్రిమి వ్యాప్తి చెందుతోందని నిపుణుల పరిశోధనలో తేలింది. ఈ సమస్యను అధిగమించేందుకు, యాంటీబయోటిక్స్‌ వినియోగాన్ని నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూడేళ్ల కిందటే చర్యలు చేపట్టాయి. నెదర్లాండ్స్‌ స్ఫూర్తితో జిల్లాల వారీగా యాంటీబయోటిక్స్‌ వినియోగం ఎంత?, నివారణకు తీసుకోవాల్సిన చర్యలు ఏమిటీ? వీటిని ఏ సందర్భంగా ఎంత మోతాదులో వాడాలి? తదితర అంశాలపై సమగ్ర అధ్యయనం చేసి, ఒక పాలసీని రూపొందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కానీ అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఇంతవరకు ఆ పాలసీకి అతీగతీ లేకుండా పోయింది. 

అవసరం మేరకే..

యాంటీబయోటిక్స్‌ వైద్యరంగంలో కీలకమైన అస్త్రాలు. వాటిని అవసరం మేరకే వినియోగించుకోవాలి. వైద్యుల సూచనలు లేకుండా వీటిని వాడడం మంచిది కాదు. గ్రామాల్లో ఆర్‌ఎంపీలు అతిగా సరఫరా చేస్తున్నారు. వాటిని తగ్గించాలని పలు సమావేశాల్లో సూచించాం. వైద్యులు రాసిచ్చిన చీటీ లేకుండా మెడికల్‌షాపుల్లో యాంటీబయోటిక్స్‌ను విక్రయించకూడదు. 

- డాక్టర్‌ బగాది.జగన్నాధరావు, డీఎంహెచ్‌వో, శ్రీకాకుళం

Updated Date - 2022-01-23T04:35:55+05:30 IST