సుభాస్ చంద్రబోస్ చుట్టూ రాజకీయాలను తిప్పుతున్న బీజేపీ, మమత

ABN , First Publish Date - 2021-01-20T21:56:30+05:30 IST

ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు నేతాజీ సుభాస్ చంద్రబోస్ 125వ జయంతి ప్రస్తుతం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారిపోయింది.

సుభాస్ చంద్రబోస్ చుట్టూ రాజకీయాలను తిప్పుతున్న బీజేపీ, మమత

కోల్‌కతా : ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు నేతాజీ సుభాస్ చంద్రబోస్ 125వ జయంతి ప్రస్తుతం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఈ జయంత్యుత్సవాలను వేదికగా చేసుకొని ఇటు తృణమూల్, అటు బీజేపీ పావులు కదుపుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఈ జయంత్యుత్సవాన్ని తమకు అనుగుణంగా వాడుకోవాలని ఇరు పక్షాలూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అధికార పక్షమైన తృణమూల్ ఈ జయంత్యుత్సవాలను ‘దేశ్ నాయక్ దివస్’ పేరుతో నిర్వహించాలని ప్రయత్నిస్తుండగా... కేంద్ర ప్రభుత్వం ఈ ఉత్సవాలకు ‘పరాక్రమ దివస్’ అన్న పేరు పెట్టి... ఈ పేరుతో ఉత్సవాలను జరపాలని నిర్ణయించింది. ఓ బహిరంగ సభలో సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ... ‘‘జనవరి 23 నేతాజీ జయంత్యుత్సవాన్ని ‘దేశ్ నాయక్ దివస్’ గా జరపాలని నిర్ణయించుకున్నాం. ‘పరాక్రమ్’ అన్న పదానికి సరైన అర్థం ఇప్పటికీ తెలియదు. ఈ పదానికి నాలుగర్థాలు ఉండొచ్చు.’’ అంటూ పరోక్షంగా కేంద్రంపై విరుచుకుపడ్డారు.


నేతాజీ ఉత్సవాలను ‘దేశ్ నాయక్ దివస్’ పేరుతో చేస్తామని ప్రకటించిన కొన్ని గంటలకే కేంద్రం స్పందించింది. తాము ‘‘పరాక్రమ దివస్’ పేరుతో ఆయన జయంత్యుత్సవాలను జరుపుతామని కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ ప్రకటించింది. నేతాజీ శౌర్యానికి, దేశ భక్తికీ చిహ్నమని అందుకే పరాక్రమ దివస్ పేరుతో జరపాలని నిర్ణయించుకున్నామని కేంద్రం ప్రకటించింది. అంతేకాకుండా జనవరి 23 న బెంగాల్ లో జరిగే పరాక్రమ దివస్‌ వేడుకలకు ప్రధాని మోదీ హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా నేతాజీ ఫొటోలతో ఉన్న ఎగ్జిబిషన్‌ను కూడా ప్రారంభించనున్నారు. అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై తృణమూల్ భగ్గుమంది. 


తృణమూల్ ఎంపీ సౌగతా రాయ్ మాట్లాడుతూ... ‘‘జనవరి 23 తేదీనీ జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని ఎప్పటి నుంచో సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేస్తున్నారు. ‘దేశ్ నాయక్ దివస్’ గా జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే రవీంద్ర నాథ్ ఠాగూర్ నేతాజీని హీరో ఆఫ్ ది నేషన్ అని సంబోధించేవారు. మోదీ ప్రభుత్వం అన్ని నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుంటోంది’’ అని సౌగతా రాయ్ మండిపడ్డారు. ఇక... ఈ జయంత్యుత్సవాల విషయంలో అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్రం వేర్వేరుగా కమిటీలను ఏర్పాటు చేశాయి. ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన కమిటీకి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నేతృత్వం వహిస్తుండగా, సీఎం మమత వేసిన కమిటీకి రాష్ట్ర మంత్రులు బాధ్యులుగా ఉన్నారు.  

Updated Date - 2021-01-20T21:56:30+05:30 IST