తాలిబన్లు మారిపోయారేమో.. వారికి ఓ అవకాశం ఇవ్వాలి: బ్రిటన్ ఆర్మీ అధిపతి

ABN , First Publish Date - 2021-08-18T21:02:36+05:30 IST

అఫ్ఘానిస్థాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని తాలిబన్లకు ప్రపంచదేశాలు ఇచ్చి చూడాలని బ్రిటన్ ఆర్మీ చీఫ్ సర్ నిక్ కార్టర్ బుధవారం నాడు సూచించారు.

తాలిబన్లు మారిపోయారేమో.. వారికి ఓ అవకాశం ఇవ్వాలి: బ్రిటన్ ఆర్మీ అధిపతి

లండన్: అఫ్ఘానిస్థాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని తాలిబన్లకు ఇచ్చి చూడాలని బ్రిటన్ ఆర్మీ చీఫ్ సర్ నిక్ కార్టర్ ప్రపంచదేశాలకు తాజాగా సూచించారు. బాధ్యతాయుతంగా మారిన తాలిబన్లను ప్రపంచం చూసే అవకాశం ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ‘‘మనం కొంచెం ఓర్పు వహించాలి. మన ఆందోళనను నియంత్రించుకోవాలి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని తాలిబన్లకు ఇవ్వాలి. మనకు గుర్తున్న 1990ల నాటి తాలిబన్ల కంటే వీరు భిన్నమైన వారు అయి ఉండొచ్చు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇస్తే.. కాస్తంత బాధ్యతాయుతంగా మారిన తాలిబన్లను మనం చూసే అవకాశం లేకపోలేదు. అయితే.. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తాలిబన్లందరూ ఒకే తీరుగా ఉండరు. వారిలోనూ భిన్న అభిప్రాయాలున్న వర్గాలు ఉన్నాయి. గ్రామీణ అఫ్ఘానిస్థాన్‌లోని వివిధ తెగల సమూహమే తాలిబన్లు’’ అని ప్రముఖ వారా సంస్థకు బీబీసీకి బుధవారం ఇచ్చిన ఇంటర్వూలో బ్రిటన్ ఆర్మీ చీఫ్ కార్టర్ పేర్కొన్నారు. సంప్రదాయిక పాష్తూన్‌వాలీ జీవన విధానాన్ని అవలంబించే వారే తాలిబన్లు అని ఆయన తెలిపారు. ‘‘కాబూల్‌ను పాలిస్తున్న తీరు చూస్తే..తాలిబన్లు మారారనే సంకేతాలు కనిపిస్తున్నాయి’’ అని కార్టర్ వ్యాఖ్యానించారు.  


అయితే..ఈ విషయంలో తొందర పడొద్దని కొందరు బ్రిటన్ మాజీ సైనికాధికారులు హెచ్చరిస్తున్నారు. ‘‘తమ పాలనకు అంతర్జాతీయ గుర్తింపు కావాలని తాలిబన్లు కోరుకుంటున్నారు. బలప్రయోగం ద్వారా వారు అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. ఇప్పుడు.. చైనా, రష్యా, పాశ్చాత్య దేశాల గుర్తింపు కోసం వారు తహతహలాడుతున్నారు. కాబట్టి..సహజంగానే తాలిబన్లు వినసొంపైన వ్యాఖ్యలు చేస్తారు. కానీ.. ఈ మాటలకు ప్రపంచం ఆకర్షితమవ్వకూడదు.’’ అని బ్రిటన్ ఆర్మీ మాజీ జనరల్ హెర్బర్ట్ అభిప్రాయపడ్డారు. ‘‘వారు తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. మనం అఫ్ఘానిస్థాన్‌ను పూర్తిగా వదిలిపెట్టేంత వరకూ ఓపిక పడతారు. ఆ తరువాత...అంతర్జాతీయ సమాజం, జర్నలిస్టుల దృష్టి అఫ్ఘాన్‌పై లేని సమయంలో.. రక్తపుటేరులను పారిస్తారు’’ అని హెర్బర్ట్ హెచ్చరించారు. 

Updated Date - 2021-08-18T21:02:36+05:30 IST