కొత్త ప్రైవసీ పాలసీపై వాట్సాప్‌‌కు కేంద్రం లేఖ

ABN , First Publish Date - 2021-01-19T20:52:06+05:30 IST

కొత్త ప్రైవసీ పాలసీని ప్రతిపాదించిన వాట్సాప్‌కు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రశ్నలను

కొత్త ప్రైవసీ పాలసీపై వాట్సాప్‌‌కు కేంద్రం లేఖ

న్యూఢిల్లీ : కొత్త ప్రైవసీ పాలసీని ప్రతిపాదించిన వాట్సాప్‌కు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రశ్నలను సంధించింది. ఈ పాలసీపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, దీనిని ఉపసంహరించుకోవాలని కోరింది. భారతీయ యూజర్ల సమాచార సంబంధిత గోప్యతను, డేటా సెక్యూరిటీని గౌరవించాలని కోరింది. ప్రైవసీ, డేటా ట్రాన్స్‌ఫర్, డేటా షేరింగ్ పాలసీలపై వివరణ ఇవ్వాలని కోరింది.


ప్రభుత్వ వర్గాలు ఓ వార్తా సంస్థకు తెలిపిన వివరాల ప్రకారం,  మెసేజింగ్ యాప్ వాట్సాప్ హెడ్ విల్ కాథ్‌కార్ట్‌కు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మంగళవారం ఓ లేఖ రాసింది. వాట్సాప్ డేటా షేరింగ్ ప్రోటోకాల్స్, బిజినెస్ ప్రాక్టీసెస్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను సమర్పించాలని కోరింది. ఇండియన్ యూజర్ల నుంచి సేకరిస్తున్న డేటాకు సంబంధించిన కచ్చితమైన వర్గీకరణల వివరాలను తెలియజేయాలని కోరింది. అనుమతుల వివరాలు, యూజర్ల సమ్మతిని కోరడం, కార్యకలాపాల నిర్వహణలో వీటిని ఉపయోగించే తీరు, అందజేసే నిర్దిష్ట సర్వీస్ మొదలైనవాటిని వివరించాలని తెలిపింది. ఈ యాప్‌ను వినియోగించే తీరు ఆధారంగా యూజర్లను వర్గీకరిస్తున్నారా? అని కూడా అడిగింది. భారత దేశంలో, ఇతర దేశాల్లో వాట్సాప్ అనుసరిస్తున్న ప్రైవసీ పాలసీల మధ్య తేడాలను వివరించాలని కోరింది. 


వాట్సాప్ ప్రతిపాదించిన నూతన ప్రైవసీ పాలసీపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. వాట్సాప్ తన యూజర్ల సమాచారాన్ని తన పేరెంట్ కంపెనీ అయిన ఫేస్‌బుక్‌కు షేర్ చేస్తోందని ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే వాట్సాప్ చెప్తున్నదాని ప్రకారం, వాట్సాప్ మెసేజ్‌లు పూర్తిగా గోప్యంగా ఉంటాయి, వీటిని ఫేస్‌బుక్ కానీ, వాట్సాప్ కానీ చూసే అవకాశం ఉండదు. 


Updated Date - 2021-01-19T20:52:06+05:30 IST