ఇది పాడి కాదు!

ABN , First Publish Date - 2022-01-23T08:53:37+05:30 IST

విజయ డెయిరీ వివాదాస్పద నిర్ణయాలు, ప్రభుత్వ ఉదాసీన వైఖరితో రాష్ట్రంలోని పాడి రైతులు సమస్యల సుడిగుండంలో కూరుకుపోతున్నారు.

ఇది పాడి కాదు!

  • ‘విజయ’ నిర్ణయాలతో పాడి రైతులకు ఇక్కట్లు.. 
  • రూ.4 ప్రోత్సాహకం ఏడాదిన్నరగా పెండింగ్‌
  • ప్రకటనలకే పరిమితమైన రూ.10 వేల సబ్సిడీ.. 
  • పాడి గేదెలు, ఆవులకు బీమా చేయలేని పరిస్థితి
  • అమ్మకపు ధర పెరిగినా సేకరణ ధర పెరగలేదు.. 
  • అధిక ధర చెల్లించి కర్ణాటక నుంచి పాల దిగుమతి


హైదరాబాద్‌, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): విజయ డెయిరీ వివాదాస్పద నిర్ణయాలు, ప్రభుత్వ ఉదాసీన వైఖరితో రాష్ట్రంలోని పాడి రైతులు సమస్యల సుడిగుండంలో కూరుకుపోతున్నారు. సబ్సిడీ పథకాలేవీ అమలు కాకపోవడం, లీటరుకు రూ.4చొప్పున ప్రోత్సాహకం కూడా ఏడాదిన్నరగా పెండింగ్‌లో ఉండడం రైతుల పాలిట శాపంగా పరిణమించింది. ప్రైవేట్‌ డెయిరీలకు ఎర్రతివాచీ పరుస్తున్న సర్కార్‌.. విజయ డెయిరీని పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో విజయ డెయిరీ రోజుకు 3.50 లక్షల లీటర్ల పాలను సేకరిస్తుండగా... అందులో 2 లక్షల లీటర్లు రాష్ట్రంలోని పాడి రైతుల నుంచి, మిగిలిన 1.50 లక్షల లీటర్లను కర్ణాటక నుంచి కొనుగోలు చేస్తోంది. ఇక్కడి రైతులకు సరాసరిన లీటరుకు రూ.32 చొప్పున చెల్లిస్తున్న విజయ డెయిరీ... కర్ణాటక నుంచి దిగుమతి చేసుకుంటున్న పాలకు లీటరుకు రూ. 42 చొప్పున చెల్లిస్తోంది. రాష్ట్రంలో పాల సేకరణ ధర పెంచకుండా, పొరుగింటి పుల్లకూర తియ్యన అన్నట్లు దిగుమతికి ఎందుకు తాపత్రయపడుతున్నారనే విమర్శలు పాడి రైతుల నుంచి వస్తున్నాయి. కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌ నుంచి విజయ డెయిరీ పెద్దలకు, పాడిపరిశ్రమాభివృద్ధి శాఖ బాధ్యులకు పెద్ద ఎత్తున కమీషన్లు అందుతుండడమే ఇందుకు కారణమన్న ప్రచారం జరుగుతోంది. ఇదిలాఉండగా.. విజయ డెయిరీ ‘ఈ- ల్యాబ్‌’లో పేరు నమోదై ఉన్న రైతు... పాడి గేదెను గానీ, ఆవును గానీ కొనుగోలు చేస్తే... సదరు రైతుకు రూ. 10వేలు చెల్లించాల్సి ఉంది. రాష్ట్రంలో ఏ ఒక్క పాడి రైతుకూ ఈ సబ్సిడీ పథకాన్ని ఇంతవరకు అమలు చేయలేదు. మార్కెట్లో పాడి గేదె ధర రూ. 80 వేల నుంచి రూ. 1.50లక్షలు, పాడి ఆవు ధర రూ.90వేల నుంచి రూ.1.20లక్షల వరకు పలుకుతోంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సబ్సిడీ అందకపోవడంతో రైతులే పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. మరోవైపు విజయ డెయిరీకి రెగ్యులర్‌ ఎండీ లేకపోవడంతో నిర్ణయాలు తీసుకోవడంలో తీవ్ర జాప్యం జరుగుతోందన్న వాదన వినిపిస్తోంది.


ప్రోత్సాహకం బకాయిలు రూ.70కోట్లు

పాడి రైతులకు లీటరుకు రూ.4 చొప్పున ప్రోత్సాహకం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం ఘనంగా ప్రకటించింది. కానీ, గత ఏడాదిన్నరగా ఈ ఇన్సెంటివ్‌ చెల్లించడం లేదు. ‘విజయ’కు పాలు పోసే రైతులకే రూ.55 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. విజయ డెయిరీతోపాటు కరీంనగర్‌ డెయిరీ, ముల్కనూరు డెయిరీ, మదర్‌ డెయిరీలకు పాలుపోసే రైతులను కలిపితే ఈ బకాయిలు రూ.70 కోట్లపైనే ఉన్నాయి. మరోవైపు ఇన్సెంటివ్‌ అమలు విషయంలో ప్రభుత్వం ఓ కొర్రీ పెట్టింది. నెలకు వెయ్యి లీటర్ల కంటే ఎక్కువ పాలుపోసే రైతులకు ప్రోత్సాహకం ఇవ్వడం లేదు. అదే క్రమంలో రైతులనుంచి లీటరుకు రూపాయి చొప్పున కట్‌ చేసిన డీఐఎ్‌ఫ(డైలీ ఇన్‌పుట్‌ ఫండ్‌), టీఐపీ(టెక్నికల్‌ ఇన్‌పుట్‌ ఫండ్‌) కూడా తిరిగి చెల్లించడం లేదు. ఒక్క జనగామ జిల్లాకే రూ.80 లక్షల బకాయిలు ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.


గేదెలు, ఆవులు చనిపోతే మునిగినట్టే

పాడి గేదెలు, ఆవులకు రాష్ట్రంలో ఎలాంటి బీమా పథకాన్ని ప్రభుత్వం అమలు చేయడం లేదు. రూ.10 వేల సబ్సిడీ పథకంలో భాగంగా గేదె/ఆవు కొనుగోలు చేస్తే... రూ.వెయ్యి చొప్పున బీమా ప్రీమియం చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ.. సబ్సిడీ పథకాన్నే అమలు చేయకపోవటం తో బీమా ప్రీమియం చెల్లించే పరిస్థితి లేకుండా పోయింది. సగటున రూ.లక్ష పెట్టుబడి పెట్టి కొనుగోలు చేసిన గేదె గానీ, ఆవు గానీ చనిపోతే.. ఆ రైతు నిండా మునగాల్సి వస్తోంది. రైతులు సొంతంగా బీమా చేయించాలంటే... ప్రీమియం ధరలు మండిపోతున్నాయి. రూ.80-90 వేల విలువ చేసే గేదె/ఆవుకు ప్రీమియం కింద రెండేళ్లకు రూ.7,200 చెల్లించాల్సి వస్తోంది. ఇప్పటికైనా బీమా పథకాన్ని ప్రభుత్వమే అమలు చేయాలన్న డిమాండ్‌ పాడి రైతుల నుంచి వ్యక్తమవుతోంది. 


మండుతున్న దాణా ధరలు

పాడి పశువులకు దాణా కొనుగోలు చేసేందుకు రైతులు భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటాల్‌ తౌడు రూ.2,400, పత్తి పిట్టు రూ.4 వేలు, ఎండు కొబ్బరి దాణా రూ.5 వేలు, మొక్కజొన్న దాణా రూ.2,500, గోధుమ పొట్టు రూ. 2,200, పెసర పొట్టు రూ.2వేల వరకు పలుకుతున్నాయి. మార్వాడీ వ్యాపారులు విక్రయించే సూపర్‌ గ్రాస్‌(గడ్డి) ధర కిలో రూ.3 వరకూ ఉంది. విజయ డెయిరీ కూడా కొంతమేరకు సబ్సిడీపై దాణా సరఫరా చేస్తున్నా... అది ఏమూలకూ సరిపోవడం లేదు. రూ.వెయ్యి విలువైన 50 కిలోల దాణా బస్తాను సబ్సిడీ కింద రూ.830 చొప్పున రైతులకు ఇస్తున్నారు. కనీసం 50శాతం సబ్సిడీతో దాణా సరఫరా చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. 


రైతులకు తక్కువ ధర చెల్లిస్తూ..

పాడి రైతులకు విజయ డెయిరీ చెల్లిస్తున్న ధరలు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు. బహిరంగ మార్కెట్‌లో కల్తీ లేని గేదె పాల ధర లీటరుకు రూ.70-80 వరకు ఉంది. కాసిన్ని నీళ్లు కలిపి లీటరుకు రూ.60 చొప్పున విక్రయిస్తున్నారు. కానీ.. విజయ డెయిరీ మాత్రం గేదె పాలకు రూ.32 నుంచి రూ.40వరకు(గరిష్ఠంగా) చెల్లిస్తోంది. ఆవు పాలకైతే లీటరుకు రూ.28 మాత్రమే అందిస్తోంది. గేదె పాలకు రూ.48, ఆవు పాలకు రూ.34 చొప్పున చెల్లించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు.  


మరోవైపు, దేశంలోనే దిగ్గజ డెయిరీగా పేరుగాంచిన ‘అమూల్‌’ తెలంగాణలో అడుగు పెడుతోంది. దక్షిణాదిలోనే తొలి ప్లాంటును సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలోని వర్గల్‌లో ఏర్పాటు చేయబోతోంది. రోజుకు 5 లక్షల లీటర్ల పాల సేకరణ సామర్థ్యంతో, రూ.500 కోట్ల పెట్టుబడితో రంగంలోకి దిగుతోంది. టీఎ్‌సఐఐసీ ఆధ్వర్యంలో వెయ్యి ఎకరాల భూమిని సేకరించి అప్పగిస్తే.. 3 లక్షల లీటర్ల పాలు తెలంగాణ పాడి రైతుల నుంచి సేకరించేలా రాష్ట్ర ప్రభుత్వంతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ డెయిరీ అయిన ‘విజయ’ భవిష్యత్తుపై సర్వత్రా ఆందోళన నెలకొంది. 


పాల సేకరణ ధర పెంచాలి

విజయ డెయిరీ పరిధిలో పాల సేకరణ ధర పెంచాలి. 50 శాతం సబ్సిడీపై దాణా సరఫరా చేయాలి. ఆవులు, గేదెలకు ఉచిత ఇన్సురెన్స్‌ పథకాన్ని అమలుచేయాలి. ఇన్సెంటివ్‌ పాతబకాయిలు చెల్లించాలి. ప్రైవేట్‌ డెయిరీలకు బదులుగా విజయ డెయిరీని బలోపేతం చేయాలి.

  • - సోమిరెడ్డి, జనగామ జిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు

Updated Date - 2022-01-23T08:53:37+05:30 IST