అమెరికాలో కేవలం 17 రోజుల్లోనే పది లక్షల కేసులు

ABN , First Publish Date - 2020-08-11T03:34:26+05:30 IST

అమెరికాలో ఆదివారం కరోనా కేసుల సంఖ్య 50 లక్షలు దాటిన విషయం తెలిసిందే.

అమెరికాలో కేవలం 17 రోజుల్లోనే పది లక్షల కేసులు

వాషింగ్టన్: అమెరికాలో ఆదివారం కరోనా కేసుల సంఖ్య 50 లక్షలు దాటిన విషయం తెలిసిందే. నిజానికి ఈ కేసుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండొచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు, మరణాలు అమెరికాలోనే నమోదయ్యాయి. ఇక మార్చి నెల నుంచి అమెరికాలో కరోనా కేసుల్లో పెరుగుదల తప్పితే ఎక్కడా తగ్గుదల అనేది కనిపించలేదు. అమెరికాలో 10 లక్షల నుంచి 50 లక్షల కేసులు నమోదు కావడానికి ఎన్ని రోజుల సమయం పట్టిందంటే..  పది లక్షల కేసులు నమోదుకావడానికి 99 రోజుల సమయం పట్టింది. ఇక అక్కడి నుంచి 43 రోజుల తరువాత కేసుల సంఖ్య 20 లక్షలు దాటింది. సరిగ్గా 28 రోజుల తర్వాత కేసులు 30 లక్షలకు చేరుకున్నాయి. ఆ తర్వాత కేవలం 15 రోజుల్లోనే కేసుల సంఖ్య 40 లక్షలు దాటేయగా.. ఇప్పుడు 17 రోజుల తర్వాత మొత్తం కేసులు 50 లక్షలకు చేరుకున్నాయి. ఈ లెక్కన అమెరికాలో నిత్యం 60 నుంచి 70 వేల కేసులు నమోదవుతున్నాయి. అంతేకాకుండా అమెరికాలో నిత్యం వెయ్యికి తగ్గకుండా మరణాలు నమోదవుతున్నాయి. జూలై 21 నుంచి ఇప్పటివరకు అమెరికాలో ఒక్కరోజు కూడా వెయ్యికి తక్కువగా మరణాలు నమోదుకాలేదు. ఈ కేసులను చూస్తోంటే ఆవేదన కలుగుతోందని వాండర్‌బిట్ యూనివర్శిటికి చెందిన ఇన్‌ఫెక్షస్ డిసీజ్ ప్రొఫెసర్ డాక్టర్ విలియమ్ స్కాఫ్‌నర్ అన్నారు. కాగా.. ప్రపంచం మొత్తం కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోంది. అమెరికాలోని బయోటెక్ సంస్థ మోడెర్నా ఈ ఏడాది చివరికల్లా విజయవంతమైన వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.

Updated Date - 2020-08-11T03:34:26+05:30 IST