మరో 2 రోజులు వర్షాలు

ABN , First Publish Date - 2020-10-13T09:38:44+05:30 IST

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రరూపం దాల్చింది. మంగళవారం తెల్లవారుజామున విశాఖపట్నం-నరసాపురం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే

మరో 2 రోజులు వర్షాలు

తీవ్ర రూపం దాల్చిన వాయుగుండం

నేడు కాకినాడ వద్ద తీరం దాటే చాన్స్‌

15న బంగాళాఖాతంలో అల్పపీడనం 

శిథిల భవనాలను ఖాళీ చేయించండి

అధికారులను ఆదేశించిన కేటీఆర్‌

వాగు దాటుతూ ఇద్దరు గల్లంతు

శ్రీశైలం, సాగర్‌, ఎస్సారెస్పీకి వరద


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రరూపం దాల్చింది.  మంగళవారం తెల్లవారుజామున విశాఖపట్నం-నరసాపురం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ఆ ప్రభావంతో బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. తీవ్ర వాయుగుండం తీరం దాటుతున్న నేపథ్యంలో తెలంగాణలో రాబోయే రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. కొన్ని చోట్ల భారీ, అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. బంగాళాఖాతంలో ఈనెల 15న మరో అల్పపీడనం ఏర్పడనుందని తెలిపింది. ఆ తర్వాత అది వాయుగుండంగా మారుతుందని పేర్కొంది.


కాగా, సోమవారం మెదక్‌, కామారెడ్డి, జగిత్యాల, సిద్దిపేట, సంగారెడ్డి, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌, యాదాద్రి, నల్లగొండ జిల్లాల్లో మోస్తరు వానలు పడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లో తీరం దాటనున్న వాయుగుండం మంగళవారం తెల్లవారుజామున తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి ప్రయాణించనుంది. ఈ క్రమంలో హైదరాబాద్‌ వ్యాప్తంగా 7 నుంచి 16 సెం.మీ వరకు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.


అప్రమత్తంగా ఉండండి: కేటీఆర్‌ 

గ్రేటర్‌ హైదరాబాద్‌లో భారీ వర్షాల వల్ల శిథిల భవనాలు కూలుతుండటం, ఇతర ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఎడతెరిపిలేని వానల దృష్ట్యా హై అలర్ట్‌ ప్రకటించారు. జీహెచ్‌ఎంసీతోపాటు ఇతర ప్రభుత్వ విభాగాలు అప్రమత్తంగా ఉండాలని సోమవారం ఆదేశించారు. శిథిల భవనాల్లో ఉంటున్న వారికి నోటీసులు జారీ చేసి ఖాళీ చేయించాలని జీహెచ్‌ఎంసీ యంత్రాంగానికి సూచించారు. కాగా, వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.


ధాన్యం.. వర్షార్పణం 

ఉమ్మడి నిజామాబాద్‌ వ్యాప్తంగా సోమవారం కురిసిన భారీ వర్షానికి మోపాల్‌, ఆర్మూర్‌, మోర్తాడ్‌, డిచ్‌పల్లి, ఏర్గట్ల ప్రాంతాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాల్లో సైతం ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది.


వాగులో ఇద్దరి గల్లంతు..

వనపర్తి జిల్లా రేవల్లి మండలంలోని మాసుపల్లి-చెన్నారం మధ్యలో ఉన్న గొర్రెమంత వాగులో ఓ వ్యక్తి బైక్‌తో సహా చిక్కుకుపోయాడు. దీంతో చెన్నారం గ్రామస్థులు, అధికారులు జేసీబీ, తాళ్ల సాయంతో మూడు గంటలపాటు శ్రమించి అతడిని ఒడ్డుకు చేర్చారు. వనపర్తి మండలంలోని జేరిపోతుల వాగు ఉప్పొంగడంతో నడుచుకుంటూ వెళ్తున్న గోపాల్‌పేట మండలం ఏదుల గ్రామానికి చెందిన ఇద్దరు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు జరుగుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్‌ మండలాల సరిహద్దు గ్రామాలైన పదిర, రామలక్ష్మణపల్లి శివారులోని మానేరు వాగులో ఓ వ్యక్తి చిక్కుకుని 12 గంటలపాటు బిక్కుబిక్కుమంటూ గడిపాడు. విషయం తెలుసుకున్న తహసీల్దార్‌, రెస్క్యూ టీం ఘటన స్థలానికి చేరుకుని, స్థానికుల సహాయంతో అతడిని ఒడ్డుకు చేర్చారు.


ఎస్సారెస్పీకి పెరుగుతున్న వరద

నాగార్జునసాగర్‌/మెండోర, అక్టోబరు 12: భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద ప్రవాహం పెరుగుతోంది. సోమవారం నాగార్జునసాగర్‌కు లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో నాలుగు గేట్లు ఎత్తారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 1,34,152 క్యూసెక్కుల నీరు వచ్చింది. నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరామసాగర్‌ ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. దీంతో ప్రాజెక్టు 24 గేట్ల ద్వారా లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటి మట్టానికి (1,091అడుగులు) చేరుకుంది.

Updated Date - 2020-10-13T09:38:44+05:30 IST