Abn logo
Oct 23 2021 @ 00:20AM

అదరం... బెదరం.. మా నాయకుడిని తిట్టినప్పుడేమైంది ఈ నీతి...?

చంద్రబాబు దీక్షకు సంఘీబావం తెలుపుతున్న మాజీ మంత్రులు కాలవ, సునీత

  • అధికారం చేతిలో ఉంది కదా 
  • అని విర్రవీగితే మూల్యం తప్పదు
  • చంద్రన్న చేపట్టిన ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’లో అనంత నేతల ఆక్రోశం


అనంతపురం, అక్టోబరు22(ఆంధ్రజ్యోతి): వైసీపీ అరాచకాలు.. దాడులకు అదిరేది లేదు... బెదిరేది లేదని టీడీపీ అనంత ముఖ్య నేతలు.. అధికార పార్టీని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంతో పాటు వివిధ జిల్లాల్లోని ఆ పార్టీ కార్యాలయాలు, నాయకులు, కార్యకర్తలపై వైసీపీ అరాచకవాదుల దాడులను నిరసిస్తూ... టీడీపీ జాతీయ కార్యాలయంలో అధినేత నారా చంద్రబాబునాయుడు చేపట్టిన ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’తో చేపట్టిన 36 గంటల దీక్షకు జిల్లా నుంచి ఆ పార్టీ నేతలు పెద్దఎత్తున మంగళగిరికి వెళ్లారు. దీక్షలో ఉన్న అధినేత నారాచంద్రబాబునాయుడుకు సంఘీబావం తెలిపారు. ఆ వేదిక ద్వారా పలువురు నాయకులు.. ప్రభుత్వ అరాచక పాలనపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో ఆక్రోశం వ్యక్తం చేశారు.


తమ పార్టీ నాయకుడు పట్టాభి వ్యాఖ్యల్లో తప్పేముందని సీఎంను నిలదీశారు. ‘ఆ మాటకే మీ అభిమానులు, కార్యకర్తలకు బీపీ వస్తే... మా నాయకుడు చంద్రబాబునాయుడును మీ మంత్రులు అసభ్య పదజాలంతో మాట్లాడినప్పుడు మాకు బీపీ రాదా..’ అంటూ సీఎంను ఏకిపారేశారు. తమ నేత చంద్రబాబునాయుడు ప్రజాస్వామ్యయుతంగా రాజకీయాలు చేస్తున్నారు కాబట్టే తాము సంయమనం పాటిస్తున్నామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని వైసీపీ నాయకులకు హితవు పలికారు. ఒక పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న తమ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును మంత్రులు బూతులు తిడుతుంటే... శ్రవణానందం పొందినపుడు ఏమైంది ఈ నీతి అని సీఎంను ప్రశ్నించారు. తమ నాయకుడు ఒక్క గంట సమయమిస్తే... తామేంటో చూపుతామని మాజీ మంత్రి పరిటాల సునీత.. ప్రభుత్వ పెద్దలు, ఆ పార్టీ నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు. ఒక్క చాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎన్నో వేధింపులు, ఇబ్బందులు భరిస్తూనే వస్తున్నామన్నారు. ఇక భరించే ఓపిక తమకు లేదని ఆమె తనదైన శైలిలో నిప్పులు చెరిగారు. ఇలా ఎవరికి వారు ప్రభుత్వ అరాచకాలను ఎండగట్టారు. రాష్ర్టాన్ని డ్రగ్స్‌ ఆంద్రాగా మారుస్తున్నారనీ, యువతను నిర్వీర్యం చేస్తున్నారని తమ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంటే... వాటిని సూచనలుగా తీసుకుని, ప్రభుత్వం పనిచేయాల్సిందిపోయి... ఎదురుదాడికి దిగడం ఏ మేరకు సమంజసమని ప్రశ్నించారు.


అన్నివర్గాల ప్రజలకు మోసం చేస్తూ కాలం గడుపుతున్నారే తప్పా.. ఏ ఒక్కరికైనా న్యాయం చేశారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అమ్మఒడి ఎగ్గొట్టారు... పింఛన్లు పీకేశారు.. కానుకలనూ అటకెక్కించారు... ఏ ఒక్క పథకంతోనూ ఆదుకోవడం లేదు.. ఏ ఒక్క అభివృద్ధి పనికీ శంకుస్థాపన చేసింది లేదు.. రోడ్లకు పడిన గుంతలు పూడ్చే పరిస్థితి కనిపించలేదు.. జీతాలివ్వలేని స్థితిలో ఉన్నారు... ఇలాంటి వైఫల్యాలను ఎండగట్టి ప్రజలకు జవాబుదారీగా ప్రతిపక్ష నాయకులుగా పనిచేస్తుంటే... దాడులు చేస్తారా అని ముఖ్యమంత్రిని దుయ్యబట్టారు. వైసీపీ అరాచక పాలనను ప్రజల్లో ఎండగట్టేందుకు ఎందాకైనా వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దీక్షకు సంఘీబావం తెలిపిన నాయకుల్లో... మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, జడ్పీ మాజీ చైర్మన పూల నాగరాజు, మాజీ ఎమ్మెల్యేలు ప్రభాకర్‌ చౌదరి, ఉన్నం హనుమంతురాయచౌదరి, జితేంద్రగౌడ్‌, నియోజకవర్గ ఇనచార్జ్‌ ఉమామహేశ్వరనాయుడు, ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు, రాష్ట్ర కార్యదర్శులు ఆదినారాయణ, వెంకటశివుడు యాదవ్‌, ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి, కంబదూరు రామ్మోహన చౌదరి, దేవళ్ల మురళి, అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌ చౌదరి, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి సుధాకర్‌ యాదవ్‌, పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

సంఘీబావ దీక్షలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి, వేదికపై మాజీ ఎంపీ నిమ్మల, జడ్పీ మాజీ చైర్మన పూల నాగరాజు


మాజీ మంత్రి పల్లె సంఘీభావం


దీక్షా వేదికపై వెంకటశివుడు యాదవ్‌


సుధాకర్‌ యాదవ్‌సంఘీభావం


సంఘీభావం చంద్రబాబుతో ఉన్నం


చంద్రబాబుతో ఉమామహేశ్వరనాయుడు


ఆలం, ముంటిమడుగు కేశవరెడ్డి, శ్రీధర్‌ చౌదరి సంఘీభావం