Advertisement
Advertisement
Abn logo
Advertisement

టీసీఎస్‌ డబుల్‌ బొనాంజా

  • రూ.18,000 కోట్ల షేర్ల బైబ్యాక్‌ ..
  • ఒక్కో షేరుకు రూ.7 మధ్యంతర డివిడెండ్‌
  • క్యూ3లో లాభం రూ.9,769 కోట్లు  


న్యూఢిల్లీ:  ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్‌ మరో షేర్ల బైబ్యాక్‌ ప్రకటించింది. ఈ సారి రూ.18,000 కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు చేసేందుకు బోర్డు ఆమో దం తెలిపిందని త్రైమాసిక ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా కంపెనీ సీఈఓ రాజేష్‌ గోపీనా థన్‌  వెల్లడించారు. ఇందులో భాగంగా పెయిడప్‌ క్యాపిటల్‌లో 1.08 శాతం వాటాకు సమానమైన 4 కోట్ల షేర్లను, ఒక్కొక్కటీ రూ.4,500 చొప్పున కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. బీఎ్‌సఈలో బుధవారం టీసీఎస్‌ షేరు ధర  రూ.3,857.25తో పోలిస్తే బైబ్యాక్‌ ధర రూ.642.75 (16.67 శాతం) అధికంగా ఉంది. టీసీఎస్‌ షేర్ల బైబ్యాక్‌ ప్రకటించడం ఇది నాలుగోసారి. టీసీఎస్‌ 2020, 2018, 2017లోనూ రూ.16,000 కోట్ల చొప్పున షేర్లను మార్కెట్‌ నుంచి తిరిగి కొనుగోలు చేసింది. బైబ్యాక్‌తో పాటు కంపెనీ డివిడెండ్‌ కూడా ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.7 మధ్యంతర డివిడెండ్‌ పంచనున్నట్లు తెలిపింది. ఈనెల 20 నాటికి కంపెనీ షేర్లు కలిగి ఉన్నవారికిది వర్తించనుందని, వచ్చేనెల 7న డివిడెండ్‌ చెల్లించనున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. 


ఉద్యోగుల వలసల రేటు 15.3 శాతం 

గత త్రైమాసికంలో నికరంగా 28,238 మంది ని ఉద్యోగాల్లో చేర్చుకున్నామని, డిసెంబరు 31 నాటికి మొత్తం సిబ్బంది సంఖ్య 5,56,986కి చేరిందని టీసీఎస్‌ తెలిపింది. గడిచిన మూడు నెలల్లో ఉద్యోగుల వలసల రేటు 15.3 శాతంగా నమోదైంది. వలసలకు అడ్డుకట్ట వేసేందుకు కంపెనీ గడిచిన 9 నెలల్లో 1.10 లక్షల మంది ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చిం ది. మార్చిలోగా మరో 40,000 మందికి ప్రమోషన్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. 


ఫ్రెషర్ల నియామకం 

ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో 43,000 మంది, డిసెంబరు త్రైమాసికంలో మరో 34,000 మంది ఫ్రెషర్లను చేర్చుకోవడం జరిగిందని టీసీఎస్‌ చీఫ్‌ హెచ్‌ఆర్‌ ఆఫీసర్‌ మిలింద్‌ లక్కడ్‌ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరాల్లో నియామకాల కన్నా ఇది అధికమన్నారు. అంతేకాదు, ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రాంగణ నియామకాల ప్రణాళికను మూడు నెలల ముందే పూర్తి చేసింది. అయినప్పటికీ, క్యు4లోనూ నియామకాలు కొనసాగించనున్నట్లు తెలిపింది. 


2,500 కోట్ల డాలర్ల మైలురాయికి వార్షికాదాయం 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికానికి టీసీఎస్‌ కన్సాలిడేటెడ్‌ లాభం రూ.9,769 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి ఆర్జించిన రూ.8,701 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 12.2 శాతం అధికం. ఆదాయం వార్షిక ప్రాతిపదికన 16.3 శాతం పెరిగి రూ.48,885 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి రూ.42,015 కోట్లుగా నమోదైంది. 2021 సంవత్సరంలో కంపెనీ ఆదాయం 2,500 కోట్ల డాలర్ల కీలక  మైలురాయికి చేరుకుందని టీసీఎస్‌ సీఓఓ, ఈడీ ఎన్‌ గణపతి సుబ్రమణియమ్‌ తెలిపారు. 

Advertisement
Advertisement