Abn logo
Sep 22 2021 @ 23:06PM

పండుగకు వేళాయే..!

సిరిమానోత్సవానికి నేడు పందిరి రాట 

ఏర్పాట్లు పూర్తి 

(విజయనగరం రూరల్‌) 

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం, సిరుల తల్లి పైడిమాంబ పండుగకు సమయం సమీపిస్తోంది. పైడిమాంబ పండుగ ఏటా అక్టోబరు నెలలో జరుగుతుంది. దసరా వెళ్లిన మరుసటి మంగళవారం వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. దీనికి నెల రోజుల ముందే ప్రక్రియ ప్రారంభమౌతుంది. పైడిమాంబ భక్తుల మండల దీక్ష, అర్ధమండల దీక్షలు మొదలవుతాయి. ఈ ఏడాది ఈ ప్రక్రియను గురువారం నుంచి ప్రారంభిస్తున్నారు. మూడులాంతర్ల రోడ్డులో ఉన్న చదురుగుడి, రైల్వే స్టేషనరోడ్డులో ఉన్న వనంగుడిలో పందిరి రాట వేసేందుకు పండితులు నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల లోపు సంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.  ఇప్పటికే మాన్సాస్‌ చైర్మన, ఆలయ అనువంశిక చైర్మన పూసపాటి అశోక్‌ గజపతిరాజుకు ఆహ్వానం పంపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. 

నేటినుంచి దీక్షలు

పైడిమాంబ భక్తులు మండల దీక్ష, అర్ధమండల దీక్షలు కూడా గురువారం నుంచే ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో గత ఏడాది సిరిమానోత్సవానికి భక్తులను అనుమతించలేదు. ఈ ఏడాది కూడా అనుమతించే అవకాశాలు లేవన్న అభిప్రాయం దేవదాయశాఖ అధికారుల నుంచి వ్యక్తమౌతోంది. దీనిపై తుది నిర్ణయం ఈ నెల 26న జరిగే ప్రత్యేక సమావేశంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు తీసుకోనున్నారు. సిరిమానోత్సవానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులను గత ఏడాది అనుమతించలేదు. ఈ విషయంలో ఈ ఏడాది వెసులుబాటు లభించనుంది. తొలేళ్లు, సిరిమానోత్సవం రోజున యథావిధిగా ఆర్టీసీ బస్సులు నడుస్తాయి. పండుగ నేపథ్యంలో చేయాల్సిన పనులు ఊపందుకున్నాయి. ఆలయ ఈవో కిషోర్‌కుమార్‌ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.