దొంగ ఓట్లకు కాలం చెల్లినట్టే..

ABN , First Publish Date - 2022-01-07T05:05:09+05:30 IST

దొంగ ఓట్లకు ఇక కాలం చెల్లినట్టేనా అంతా సవ్యంగా జరిగితే వచ్చే ఎన్నికల నాటికి దొంగ ఓట్ల బెడద తప్పుతుందనే భావన వినిపిస్తోంది.

దొంగ ఓట్లకు కాలం చెల్లినట్టే..

ఓటరుకార్డుకు ఆధార్‌కార్డు అనుసంధానానికి కేంద్రం నిర్ణయం

ఇటీవల పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం

జిల్లాలో మొత్తం ఓటర్లు 6,28,128


కామారెడ్డి: దొంగ ఓట్లకు ఇక కాలం చెల్లినట్టేనా అంతా సవ్యంగా జరిగితే వచ్చే ఎన్నికల నాటికి దొంగ ఓట్ల బెడద తప్పుతుందనే భావన వినిపిస్తోంది. ఓటుతో ఆధార్‌కార్డు అనుసంధానం బిల్లుకు పార్లమెంట్‌లో ఇటీవల ఆమోదముద్ర పడడంతో సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే బోగస్‌ ఓట్లలను ప్రతీయేట తొలగించడం సిబ్బందికి తలకు మించిన భారంగా ఉండేది. దీంతో గతంలో ఆధార్‌తో అనుసంధానం చేసే ప్రక్రియ చేపట్టినా కోర్టు ఆదేశాలతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌లో ఓటుకు ఆధార్‌కార్డు అనుసంధానం బిల్లు ఆమోదించడంతో అధికారులు త్వరలోనే ఓటర్ల నుంచి ఆధార్‌కార్డుల సేకరణకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. కాగా జిల్లాలో మొత్తం 6,28,128 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 3,05,861, మహిళలు 3,22,215 ఉన్నారు.


పాత ఓటు రద్దు చేయకపోవడంతో ఇక్కట్లు

సాఽధారణంగా భారత ఎన్నికల సంఘం ఆదేశాలతో తరచూ ప్రత్యేక ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో వేరే నియోజకవర్గం నుంచి మారిన వారు కొత్తకార్డు కోసం దరఖాస్తు చేస్తుంటారు. అంతా బాగానే ఉన్నా పాత ఓటు రద్దు చేయనందున ఆ ఓటు అలానే కొనసాగుతోంది. అధికారులు గుర్తించే వరకు కూడా సదరు వ్యక్తి రెండు చోట్ల ఓటు వేసేవాడు. ఇలా ప్రతీ సంవత్సరం కొన్ని వందల ఓట్లు రెండు చోట్ల నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తం అవుతోంది. గతంలో జరిగిన అనేక ఎన్నికలలో ఇదే తరహాలో ఓట్లు వేసిన వారు ఉన్నారు. ముఖ్యంగా అద్దెకు ఉండేవారు, ఉపాధి నిమిత్తం ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశంలోకి వెళ్లేవారు, మోసపూరితంగా తమ అభ్యర్థిని గెలిపించుకోవాలని కొందరు తమ అనుకూల వర్గాల ఓట్లు రద్దు కాకుండా చూసేవారనే ఆరోపణలు ఉన్నాయి.


ఒకే ఇంటిలో అనేక ఓట్లు

ఒకే ఇంటి నెంబర్‌లో అనేక ఓట్లు నమోదు చేసి అనధికారికంగా కొన్ని ప్రాంతాలలో దొంగ ఓట్లు వేయించుకుని కొంత మంది విజయం సాధించేవారనే ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఓటుకు నోటు, మందు, విందు అందేలా చూడడంతో తమ వద్ద ఇన్ని ఓట్లు ఉన్నాయని తనకు పలుచోట్ల మూడు, నాలుగు ఓటరు కార్డులు ఉన్నాయని చెబుతూ దొంగ ఓట్లు వేసిన వారు అనేకం ఉన్నారని విమర్శలు లేకపోలేదు. ఇప్పటి వరకు జరిగిన పలు ఎన్నికల్లో ఈ తరహ సంఘటనలు కూడా బయటపడ్డాయి. చాలా ప్రాంతాల్లో జరిగిన ఎన్నికలలో ఓడిన వారు న్యాయస్థానాలను సైతం ఆశ్రయించిన వారున్నారు. ఓటుకు ఆధార్‌ అనుసంధానంతో ఇలాంటి ఓట్ల బెడద కూడా తొలిగే అవకాశం ఉంది. 


త్వరలోనే ఆధార్‌ సేవలు

ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా అధికారులు ఇంటింటికీ వెళ్లి ఆధార్‌ నెంబర్లు సేకరించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అలా సేకరించిన ఆఽధార్‌కార్డులను ఓటర్ల నమోదు విభాగం అధికారులు ఓటుతో అనుసంధానం చేసే ప్రక్రియ త్వరలోనే మొదలయ్యే అవకాశం ఉంది. ఇక కొత్త ఓట్లకు నమోదు చేసుకునే వారు ఆధార్‌కార్డు జిరాక్స్‌ కూడా జత చేయాల్సి ఉంటుంది.

Updated Date - 2022-01-07T05:05:09+05:30 IST