Aug 1 2021 @ 11:26AM

తాప్సీ కెరీర్‌ని మలుపు తిప్పిన సినిమా అదే

మంచు మనోజ్ హీరోగా దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు తెరకెక్కించిన 'ఝుమ్మందినాదం' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచమయింది ఢిల్లీ డాల్ తాప్సీ. మోడలింగ్ రంగం నుంచి సినిమా ఇండస్ట్రీకొచ్చిన ఈమె మొదటి సినిమాతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు అందుకుంది. ప్రభాస్‌తో 'మిస్టర్ పర్‌ఫెక్ట్', వెంకటేశ్‌తో 'షాడో', గోపీచంద్‌తో 'మొగుడు', 'సాహసం', మంచి విష్ణుతో 'వస్తాడు నా రాజు', మాస్ మహారాజ రవితేజతో 'వీర', 'దరువు' అలాగే 'గుండెల్లో గోదారి', 'నీవెవరో' 'ఆనందో బ్రహ్మ' లాంటి చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.

ఇదే క్రమంలో తమిళంలో కూడా కొన్ని చిత్రాలు చేసి అక్కడ కూడా బాగానే పాపులరయింది. తెలుగులో 'నీవెవరో' తర్వాత మళ్లీ కనిపించలేదు. బాలీవుడ్‌లో 'ఛస్మే బద్దుర్' మూవీతో అడుగు పెట్టిన తాప్సీ అక్కడ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో అవకాశాలు అందుకిని స్టార్ హీరోయిన్‌గా మారింది.  కొత్తల్లో జుడ్వా2 లాంటి చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేసింది. అయితే బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో చేసిన 'పింక్' సినిమా తాప్సీ కెరీర్‌ని మలుపు తిప్పింది. ఈ సినిమా తర్వాత తాప్సీకి కథాబలమున్న చిత్రాలలోనే ఎక్కువగా అవకాశాలు వచ్చాయి.

'పింక్' తర్వాత 'బద్లా', 'నామ్ షభానా', 'గేమ్ ఓవర్', 'మన్ మర్జియాన్', 'సూర్మా', 'ముల్క్', 'మిషన్ మంగళ్', 'సాండ్ కి ఆంఖ్', 'తప్పడ్' వంటి చిత్రాలలో నటించి హిందీ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ సాధించింది. తెలుగు కంటే హిందీలోనే తాప్సీ నటనకి ఆస్కారం ఉన్న పాత్రల్లో నటించింది. కొన్ని కథలు ఆమెని దృష్టిలో పెట్టుకొనే దర్శక, రచయితలు సిద్దం చేస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా వెలుగుతున్న తాప్సీ ఇటీవల నిర్మాతగాను మారారు. 'బ్లర్' అనే సినిమాను ఇర్మిస్తూ, ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. 

అంతేకాదు చాలాకాలానికి మళ్ళీ టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తున్న తాప్సీ 'మిషన్ ఇంపాజిబుల్' అనే చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.  'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ' సినిమాకు దర్శకత్వం వహించిన స్వరూప్ దీనిని తెరకెక్కిస్తున్నాడు. మాట్నీ ఎంటర్‏టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత కూడా అవకాశాలు వస్తే తాప్సీ తెలుగులో వరుసగా సినిమాలు చేయాలనుకుంటున్నారు. కాగా నేడు ( ఆగస్టు 1 ) తాప్సీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకి సోషల్ మీడియాలో అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.