వచ్చే ఐదేళ్లలో 75% విడి భాగాల తయారీ ఇక్కడే

ABN , First Publish Date - 2021-04-16T05:56:29+05:30 IST

గృహోపకరణాల తయారీలో వినియోగించే విడి భాగాల్లో ప్రస్తుతం 75 శాతం

వచ్చే ఐదేళ్లలో 75% విడి భాగాల తయారీ ఇక్కడే

పీఎల్‌ఐతో గృహోపకరణాల పరిశ్రమకు మేలు


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): గృహోపకరణాల తయారీలో వినియోగించే విడి భాగాల్లో ప్రస్తుతం 75% శాతం దిగుమతి చేసుకుంటున్నాం. ఉత్పత్తితో ముడిపడిన ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) కారణంగా వచ్చే ఐదేళ్లలో ఈ పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని.. ఇదే స్థాయిలో విడి భాగాలను భారత్‌లో తయారు చేయగలరని గోద్రేజ్‌ అప్లయెన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, బిజినెస్‌ అధిపతి కమల్‌ నంది తెలిపారు. గత రెండు సంవత్సరాల్లో దేశీయ గృహోపకరణాల తయారీ రంగంలోకి భారీగా పెట్టుబడులు వచ్చాయని, మరిన్ని కంపెనీలు కూడా అడుగు పెట్టనున్నాయని వివరించారు.


తయారీ, విడిభాగాల్లో పెట్టుబడుల కారణంగా సమీప భవిష్యత్తులోనే దేశీయ గృహోపకరణాల ముఖచిత్రం సమూలంగా మరిపోనుందని చెప్పారు. ప్రస్తుతం గృహోపకరణాల ధరలు పెరగడానికి సెమీ కండక్టర్ల వంటి విడి భాగాల కొరత ఒక కారణమని చెప్పారు. పూర్తిగా దేశంలోనే తయారు చేసిన పర్యావరణ అనుకూల ఎయిర్‌ కండీషనర్లను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. నానో కోటెడ్‌ యాంటీ వైరల్‌ ఫిల్టరేషన్‌ సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని రూపొందించామని వైరస్‌, బ్యాక్టీరియాను ఇవి నిరోధిస్తాయని చెప్పారు. ప్రస్తుతం ఏసీలను కొనుగోలు చేసే వినియోగదారులు చల్లదనంతో పాటు శుద్ధమైన గాలిని ఇచ్చే ఏసీలను కోరుకుంటున్నారని వివరించారు.



2020-21లో 12% క్షీణత: కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌ పరిశ్రమ గత ఆర్థిక సంవత్సరానికి 12-15 శాతం క్షీణతను నమోదు చేసే వీలుందని నంది అభిప్రాయపడ్డారు. జూన్‌ త్రైమాసికంలోని నష్టాలు, ఏసీల విక్రయాలు ఆశాజనకంగా లేకపోవడం క్షీణతకు కారణమని తెలిపారు. 2020-21 ఏడాదికి ఏసీల విక్రయాలు దాదాపు 30-35 శాతం క్షీణతను నమోదు చేసే వీలుందన్నారు.


Updated Date - 2021-04-16T05:56:29+05:30 IST