15 ఏళ్లుగా ఉద్యోగానికి డుమ్మా.. అయినా ఠంచన్‌గా జీతం!

ABN , First Publish Date - 2021-04-22T22:30:41+05:30 IST

సంవత్సరాల తరబడి చేస్తున్న ఉద్యోగానికి వారం రోజులు డుమ్మా కొడితే ఆ తర్వాత ఆ జాబ్ ఉంటుందో, ఊడుతుందో

15 ఏళ్లుగా ఉద్యోగానికి డుమ్మా.. అయినా ఠంచన్‌గా జీతం!

రోమ్: సంవత్సరాల తరబడి చేస్తున్న ఉద్యోగానికి వారం రోజులు డుమ్మా కొడితే ఆ తర్వాత ఆ జాబ్ ఉంటుందో, ఊడుతుందో గ్యారెంటీ లేదు. అలాంటిది 15 ఏళ్లుగా ఉద్యోగానికి వెళ్లకపోతే.. ఇంకెక్కడి ఉద్యోగం అంటారేమో! కానీ ఇటలీలో ఓ ఆసుపత్రి ఉద్యోగి గత 15 ఏళ్లలో ఒక్క రోజు కూడా విధులకు హాజరు కాకున్నా వేతనాన్ని మాత్రం ఫస్ట్ తారీఖున ఠంచన్‌గా తీసుకుంటున్నాడు.


తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సంచలనమైంది. కెటాంజారో నగరంలోని పుగ్లీస్ సియాసియో ఆసుపత్రిలో సాల్వెటోర్ స్కుమాస్ (66) పనిచేస్తున్నాడు. విధుల్లో అతడు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, విధులకు సరిగా హాజరు కాకపోడంతో అతడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి యాజమాన్యం భావించింది. విషయం తెలిసిన స్కుమాస్ నేరుగా ఆసుపత్రి డైరెక్టర్‌ను కలిసి తనకు వ్యతిరేకంగా రిపోర్టును ఆపాలని బెదిరించి వెళ్లిపోయాడు. 


ఆ తర్వాత కొన్ని రోజులకే ఆ డైరెక్టర్ రిటైరయ్యారు. స్కుమాస్ కూడా విధులకు హాజరు కావడం మానేశాడు. అయితే, ఈ విషయాన్ని తర్వాత వచ్చిన డైరెక్టర్ కానీ, ఆసుపత్రి హెచ్ఆర్ కానీ గమనించలేదు. మరోవైపు స్కుమాస్ మాత్రం విధులకు రాకున్నా గత 15 ఏళ్లుగా ప్రతి నెలా క్రమం తప్పకుండా వేతనం డ్రా చేసుకుంటూనే ఉన్నాడు. ఇలా ఇప్పటి వరకు  ఏకంగా 5,38,000 యూరోలు డ్రా చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. విషయం బయటపడడంతో పోలీసులు అతడిపై దర్యాప్తు ప్రారంభించారు. అంతేకాదు, స్కుమాస్ విధులకు హాజరు కాకున్నా గమనించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ మరో ఐదుగురు మేనేజర్లపైనా దర్యాప్తు ప్రారంభమైంది.

Updated Date - 2021-04-22T22:30:41+05:30 IST