వివక్షల జగత్తులో విదుషీమణులు

ABN , First Publish Date - 2020-03-28T08:58:58+05:30 IST

‘పుస్తక పఠనం ఎటువంటి బాదరబందీలేకుండా ప్రయాణించడమేనని’ ఇటాలియన్ రచయిత ఎమిలో సల్గారి (1862-–1911) వ్యాఖ్యానించారు.

వివక్షల జగత్తులో విదుషీమణులు

వర్గం, జాతి, జెండర్ వివక్షలను దృఢ సంకల్పంతో అధిగమించిన ధీమంతులు పాలీ ముర్రే, జానకి అమ్మాల్. పలు సంకుచితత్వాలను హుందాగా ఎదుర్కొని విద్వత్ వికాసానికి, విజ్ఞాన ప్రగతికి, మాజ పురోగతికి వారిరువురూ విశేషంగా దోహదం చేశారు. ఈ కరోనా కాలంలో వారి జీవితకథలను చదవడం ఒక స్ఫూర్తిదాయక అనుభవం.


‘పుస్తక పఠనం ఎటువంటి బాదరబందీలేకుండా ప్రయాణించడమేనని’ ఇటాలియన్ రచయిత ఎమిలో సల్గారి (1862-–1911) వ్యాఖ్యానించారు. గొప్ప మాట, సందేహం లేదు.-ముఖ్యంగా కొవిడ్-19 కాలంలో మంచి సలహా కూడా. ఇంటిపట్టునే వుండడం నిర్బంధంమైపోయినందున సుదూర దేశాలకు, గతించిన యుగాలలోకి ప్రయాణించేందుకు ఉత్తమ సాహిత్యకృతులు, ఉత్కృష్ట విద్వత్ రచనలు విశేషంగా తోడ్పడతాయి. అవి మేధకు కొత్త ప్రేరణనిస్తాయి, హృదయాన్ని ఉల్లాసపరిచి విశాలం చేస్తాయి.


మానవాళి ఒక కొత్త మహమ్మారి ముప్పులో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడానికి కొద్ది రోజులు ముందు పథనిర్దేశక స్త్రీ వాది, పౌర హక్కుల క్రియాశీలి పాలీ ముర్రే స్వీయ చరిత్రను చదవడం ప్రారంభించాను. 1910లో అమెరికా దక్షిణ ప్రాంతంలో పాలీ జన్మించారు. ఈ ప్రపంచంలోకి ప్రవేశించిన నాటి నుంచీ ఆమె మూడు రకాల వివక్షల- వర్గం, జాతి, జెండర్- నెదుర్కొన్నారు. చిరుప్రాయంలోనే తల్లిని కోల్పోయిన పాలీని మేనత్త పాలీన్ పెంచారు. పాలీన్ ఒక ఉదాత్త మహిళ. తోబుట్టువుల కోసం అవివాహితగా ఉండిపోయిన స్వార్థత్యాగి. ఉపాధ్యాయురాలైన మేనత్త గురించిన పాలీ జ్ఞాపకాలు స్ఫూర్తిదాయకమైనవి. 


పాలీన్ స్ఫూర్తితో ఉన్నత విద్యావంతురాలు కావడానికి పాలీ సంకల్పించుకుంది. అతి కష్టం మీద న్యూయార్క్‌లోని బెర్నార్డ్ కాలేజీలో ప్రవేశాన్ని పాలీ సాధించుకున్నారు. ఆ మహానగరంలో ఉన్నప్పుడే సృజనాత్మక రచనావ్యాసంగంలో ఆమె అమితాసక్తి చూపారు. కవితలు, కథలు రాశారు. రాయడమే కాదు, ఉద్యమాల్లో పాల్గొన్నారు. ప్రభవిస్తోన్న పౌర హక్కుల ఉద్యమంలో పాలీ కీలక పాత్ర వహించారు. 


ఉన్నత విద్యాభ్యాసాన్ని మరింతగా కొనసాగించేందుకు నిర్ణయించుకుని సొంత రాష్ట్రమైన నార్త్ కరోలినా లోని ఒక ప్రధాన విశ్వవిద్యాలయానికి పాలీ దరఖాస్తు చేశారు. అయితే నల్ల జాతీయురాలు కావడంతో ఆమెకు ప్రవేశం లభించలేదు. ఇలా జాతి వివక్షకు గురైన పాలీ ఆ దురాచారంపై పోరాడడానికి సంకల్పించుకున్నారు. న్యాయవాది కావడం ద్వారానే తాను పోరాడగలనని ఆమె భావించారు. వాషింగ్టన్ లోని హోవార్డ్ విశ్వవిద్యాలయం (ఆచార్యులు, అధ్యాపకులు, విద్యార్థులు అందరూ ఆఫ్రికన్- అమెరికన్లే కావడం ఈ వర్సిటీ విశేషం) లోని లా స్కూల్ లో చేరారు. నల్లవారిపై ఆంక్షలు తొలగించాలని సుప్రీంకోర్టులో పోరాడుతున్న కొంతమంది ఆచార్యులు ఆమెకు న్యాయశాస్త్రాన్ని బోధించారు. ఆమె ప్రథమ శ్రేణిలో పట్ట భద్రురాలయ్యారు. ఆ తరువాత హార్వర్డ్ లా స్కూల్ లో చేరడానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆమెకు అడ్మిషన్ ఇవ్వడానికి హార్వర్డ్ నిరాకరించింది! పాలీ కృంగిపోలేదు. న్యూయార్క్‌కు తిరిగి వెళ్ళి అక్కడ వర్గం, జాతి, జెండర్ సంబంధిత అసమానతలపై పోరాడారు. న్యాయవాదిగా సుప్రసిద్ధురాలు అయ్యారు. అప్పట్లో ఆఫ్రికా, ఆసియా దేశాలలో ముమ్మరమైన వలసపాలన వ్యతిరేకోద్యమాలలో శ్రద్ధాసక్తులు చూపారు (మహాత్మా గాంధీని ఆమె అమితంగా అభిమానించేవారు). వలసపాలన నుంచి కొత్తగా విముక్త మయిన ఘనాకు అధ్యాపకురాలుగా వెళ్ళారు. ఒక న్యాయ కళాశాలలో బోధించారు. యువ ఆఫ్రికన్లలో కొత్త ఆదర్శ భావాలను పాదుకొల్పారు. స్వదేశానికి తిరిగి వచ్చిన తరువాత యేల్‌లా స్కూల్‌లో డాక్టొరేట్ చేయడానికి పూనుకున్నారు. ప్రతిష్ఠాత్మక యేల్ డాక్టొరేట్ పొందారు. దరిమిలా ఆమె ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. క్రైస్తవ పూజారి కావడానికి ఆమె నిర్ణయించుకున్నారు. ఫలితంగా ఎపిస్కోపల్ చర్చి (బిషప్‌ల ఆధ్వర్యంలో వుండే చర్చి) ఆమెకు మత దీక్ష ఇచ్చింది. 


ఇదొక ఆశ్చర్యకరమైన జీవిత గాథ. పాలీ ముర్రే ఆ గాథను చాలా సుందరంగా, సొగసుగా చెప్పారు. నేను చాలా ఆత్మకథలు చదివాను. ఈ సాహిత్య ప్రక్రియ నాకు చాలా ఇష్టం. నేను చదివిన ఆత్మకథలలో మూడు లేదా నాలుగు గొప్ప స్వీయ చరిత్రలలో పాలీ ముర్రేది ఒకటి. ప్రేమానురాగాలు, కరుణాత్మక భావాలతో ఆమె తన జీవిత కథను రాశారు. స్నేహితులు, ఉపాధ్యాయులు, సహచరుల గురించిన ఆమె పద చిత్రాలు హృద్యంగా వున్నాయి. అవి అపురూపమైనవి. జాత్యహంకారం, జెండర్ వివక్షల గురించి ఆమె నిస్సంకోచంగా రాశారు. అమెరికన్ సమాజంలోని అన్యాయాలను నాగరీకంగా గర్హించారు. 


పాలీ ముర్రే ఆత్మకథ చదవడం ముగించిన కొద్దిరోజులకు పథ నిర్దేశక మహిళా శాస్త్రవేత్త ఇ.కె. జానకి అమ్మాల్ జీవిత చరిత్ర రాత ప్రతిని చదవడం ప్రారంభించాను. రచయిత్రి సావిత్రి ప్రీతా నాయర్. ఈ జీవిత చరిత్ర వచ్చే సంవత్సరం ప్రచురితమవనున్నది. పాలీ కంటే జానకి కొంచెం అదృష్టవంతురాలు. జెండర్, చర్మం రంగు కారణంగా వివక్షకు గురయ్యారు. వలసపాలనాయుగంలో, పితృస్వామ్య ధోరణులు ప్రబలంగా ఉన్న ఆ కాలంలో సహజంగానే ఆమె కు పలు అవరోధాలు ఎదురయ్యాయి. అవమానాలు సంభవించాయి. అయినప్పటికీ ధైర్యం, దృఢ సంకల్పంతో జానకి వాటిని అధిగమించారు. 


1897లో మలబార్‌లో జన్మించిన జానకి అమ్మాల్ మద్రాసులో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. ఒక భారతీయ మహిళ అలా ఉన్నత విద్యాభ్యాసం చేయడం అప్పట్లో ఒక అసాధారణ విషయం. సైన్స్ ఆమె అభిమాన విషయం. పట్ట భద్రురాలు అయిన తరువాత మద్రాసులోనే ఒక కళాశాలలో అధ్యాపకురాలుగా చేరారు. వృక్ష శాస్త్రాన్ని బోధించారు. మిచిగాన్ విశ్వవిద్యాలయం ఉపకార వేతనం లభించడంతో 1924లో ఆమె అమెరికాకు పయనమయ్యారు. ఆ విశ్వవిద్యాలయంలోనే ఆమె ఎమ్ఎస్సి, పిహెచ్.డి చేశారు. మిచిగాన్ వర్సిటీలో సైన్స్ లో డాక్టొరేట్ చేసిన ప్రపథమ భారతీయ మహిళ జానకి అమ్మాల్ (అమెరికా విశ్వవిద్యాలయంలో బోటనీలో డాక్టొరేట్ పొందిన తొలి మహిళ కూడా ఈమే కావడం విశేషం). జానకి తొలి పరిశోధనలలో అధిక భాగం తృణాల (గ్రాసెస్) పై జరిగాయి. మిచిగాన్‌లో పిహెచ్ డి పొందిన అనంతరం బ్రిటన్ లోని జాన్ ఇన్స్ హార్టికల్చరల్ ఇన్ స్టిట్యూట్ లో చేరారు. అక్కడ ఆమె గొప్ప జన్యుశాస్త్రవేత్త సిరిల్ డార్లింగ్టన్ తో కలిసి పరిశోధనలు కొనసాగించారు. జానకి సహకారంతోనే ఆయన తన సుప్రసిద్ధ పరిశోధనా గ్రంథం ‘ఎ క్రోమోజోమ్ అట్లాస్ ఆఫ్ కల్టివేషనల్ ప్లాంట్స్’ను పూర్తి చేశారు. వృక్ష జన్యుశాస్త్రాన్ని నిర్ణయాత్మకంగా మార్చివేసిన గ్రంథమిది. 

భారత్ స్వాతంత్ర్యం పొందిన తరువాత జవహర్ లాల్ నెహ్రూ సూచన మేరకు జానకి స్వదేశానికి తిరిగివచ్చారు. భారతీయ విజ్ఞానశాస్త్ర పరిశోధనల పురోగతికి ఆమె సమున్నతసేవల నందించారు. పరిశోధనా రంగంలోకి ప్రవేశించేందుకు యువ మహిళా శాస్త్రవేత్తలకు ఆమె స్ఫూర్తిగా నిలిచారు. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాను పునర్వ్యవస్థీకరించారు. పాలనా బాధ్యతలు నిర్వహిస్తూనే పరిశోధనా రంగంలో ఆమె చురుగ్గా వుండడం కొనసాగించారు. తన పరిశోధనా ఫలితాలను ప్రతిష్ఠాత్మక సైన్స్ జర్నల్స్‌లో ప్రచురించారు. భారత్‌లో ‘ఎథ్నో బోటనీ’ అధ్యయనాలను ప్రారంభించారు. జానకి అమ్మాల్ నిరంతర జ్ఞానాన్వేషి. ఏడు పదుల వయస్సులో కూడా ఆమె లడఖ్ లోని వృక్ష జాలంపై పరిశోధనలు నిర్వహించారు.


జానకి అమ్మాల్ జీవితం ఆదర్శప్రాయమైనది. ఆమె వైజ్ఞానిక పరిశోధనలను ప్రీతా నాయర్ విపులంగా వివరించారు. అమెరికా, బ్రిటన్‌లలో కూడా జానకి కార్యకలాపాల గురించి ఆమె విస్తృతంగా పరిశోధించారు. వివిధ సంక్లిష్ట అంశాలను సమగ్ర అవగాహనతో సామాన్య పాఠకులకు సైతం సుబోధకమయ్యేలా ప్రీతా అత్యంత నైపుణ్యంతో రాశారు. ఇటువంటి జీవిత చరిత్రకారణి లభించడం జానకి అమ్మాల్ అదృష్టమని చెప్పవచ్చు. భారతీయ వైజ్ఞానిక ధ్రువతారలైన సివి రామన్, హోమీ భాభా, మేఘనాథ్ సాహాల ప్రస్తుత జీవితచరిత్రలకంటే రాబోయే జానకి అమ్మాల్ జీవితచరిత్ర ఉత్కృష్టమైనదని నిస్సందేహంగా చెప్పగలను. 


పాలీ ముర్రే ఆత్మకథ, జానకి అమ్మాల్ జీవితచరిత్రను శ్రద్ధాసక్తులతో చదివాను. ఆ ఇరువురూ తమ జీవితం పొడుగునా ఎదుర్కొన్న వివక్షలు, అడ్డంకులను హుందాగా అధిగమించి విద్వత్ వికాసానికి, విజ్ఞాన ప్రగతికి, సమాజ పురోగతికి విశేషంగా దోహదం చేశారు. కొవిడ్-19 కాలంలో వారి జీవితకథలను చదవడం ఒక స్ఫూర్తిదాయక అనుభవం. పాలీ ముర్రే, జానకి అమ్మాల్ తమ జీవితకాలంలో చూపిన ధైర్యం, హుందాతనంలో పదోవంతునైనా ఈ క్లిష్ట కాలంలో మానవాళి చూపగలిగితే ఉజ్వల, భద్రమైన భవిష్యత్తుపై ఆశ వదులుకోనవసరం లేదు.



(వ్యాసకర్త చరిత్రకారుడు)

Updated Date - 2020-03-28T08:58:58+05:30 IST