పీహెచ్‌సీలపై నజర్‌

ABN , First Publish Date - 2020-05-24T10:27:19+05:30 IST

భద్రాచలం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆశ్రయించే రోగులకు, గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు

పీహెచ్‌సీలపై నజర్‌

ఇకపై ప్రాథమిక వైద్యశాలల్లో గర్భిణులకు వైద్య పరీక్షలు 

త్వరలో మణుగూరు, అశ్వారావుపేటల్లో డెంగ్యూ సెంటర్లు

మణుగూరులో గంబూషియా చేపల పెంపకానికి ప్రతిపాదనలు

వివరాలు సేకరించాలని ఐటీడీఏ పీవో ఆదేశం


భద్రాచలం, మే 23: భద్రాచలం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆశ్రయించే రోగులకు, గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కావాల్సిన మౌళిక సదుపాయాలపై అధికారులు దృష్టిసారించారు. భద్రాచలం ఐటీడీఏ పీవో పి.గౌతమ్‌  వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన సమయంలో తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు ప్రారంభించారు. ఇటీవల మంగపేట, బూర్గంపాడు వైద్యశాలలను తనిఖీ చేసిన సమయంలో స్థానిక వైద్య సిబ్బంది పలు సమస్యలను పీవో దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సానుకూలంగా స్పందించిన పీవో వాటిని పరిష్కరించే క్రమంలో పీహెచ్‌సీల్లో సమస్యలపై తనకు వెంటనే నివేదిక సమర్పించమన్నట్లు తెలిసింది. 

 

ఇప్పటికీ కొన్ని పరీక్షలు జరగడం లేదు 

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని ల్యాబుల్లో ఇప్పటి వరకు కొన్ని రకాల వైద్య పరీక్షలు జరగడం లేదని వైద్యాధికారులే అంగీకరిస్తున్నారు. దీనికి కారణం 22 పీహెచ్‌సీల పరిధిలో చాలా చోట్ల అవసరమైన వైద్య పరికరాలు రసాయనాలు లేకపోవడంతో పాటు బడ్జెట్‌ సమస్య ప్రధాన కారణమని సమాచారం. అలాగే ఉల్వనూరు, పర్ణశాల పీహెచ్‌సీలతో పాటు మరికొన్ని చోట్ల ల్యాబ్‌టెక్నీషియన్‌లు లేకపోవడం కూడా సమస్యగా మారిందని తెలుస్తోంది.


అదేవిధంగా కొత్తగా ఏర్పాటు చేసిన రెండు పీహెచ్‌సీల్లో మహిళల ప్రసవాలకు అవసరమైన టేబుళ్లు లేవని అధికారుల దృష్టికి వచ్చినట్లు వినికిడి. ఈ సమస్యల ఫలితంగా గర్బిణీలకు పీహెచ్‌సీల పరిధిలో పలు చోట్ల అవసరమైన వైద్య పరీక్షలు, ప్రసవాలు చేయలేని పరిస్థితి ఉంది. గతంలోనే ఈ సమస్యలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వివరాలు సేకరించి నివేదికను అప్పటి జిల్లా కలెక్టరుకు గతంలో సమర్పించగా ఆయన బదిలీ కావడంతో ఆ ప్రతిపాదన ఆచరణకు నోచుకోలేదు.  


ఇకపై పీహెచ్‌సీల్లోనే గర్బిణీలకు వైద్య పరీక్షలు 

ఇకపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోనే గర్బిణీలకు వైద్యపరీక్షలు చేయనున్నారు. షుగర్‌ టెస్టులు, ప్రెగ్నసీ టెస్టులతో పాటు గర్భిణులకు అవసరమైన ఇతర రకాల వైద్య పరీక్షలు చేసేందుకు పరిస్థితులు అనుకూలించనున్నాయి.  


త్వరలో మణుగూరు, అశ్వారావుపేటల్లో డెంగ్యూ సెంటర్లు

ఇప్పటివరకు భద్రాచలం ఏజెన్సీలో భద్రాచలంలోనే డెంగ్యూ నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే త్వరలో మణుగూరు, అశ్వారావుపేట వైద్యశాలల్లో డెంగ్యూ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఐటీడీఏ పీవో పి.గౌతమ్‌ ప్రత్యేక చొరవతో ఈ కేంద్రాల ఏర్పాటుపై వైద్య అధికారులు చర్యలు చేపట్టారు.


బూర్గంపాడులోని వైద్యశాల మార్చురీలో రెండు మృతదేహాలను భద్రపరిచేందుకు ఫ్రీజర్‌ను సైతం కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. అదేవిధంగా దోమల నివారణకు గంబూషియా చేపలపెంపకం కేంద్రాన్ని మణుగూరులో ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయ ప్రాంగణంలో ఒకటి ఉండగా మరో కేంద్రం మణుగూరులో ఏర్పాటు చేయాలని ఐటీడీఏ పీవో సూచించినట్లు తెలిసింది.  

Updated Date - 2020-05-24T10:27:19+05:30 IST