జి.మాడుగుల మండలంలో ఐటీడీఏ పీవో పర్యటన

ABN , First Publish Date - 2021-06-23T05:46:25+05:30 IST

జి.మాడుగుల మండలంలో ఐటీడీఏ పీవో రోణంకి గోపాలకృష్ణ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా గెమ్మెలి పీహెచ్‌సీలో ఫార్మసిస్టు, నలుగురు సచివాలయ సిబ్బందికి పీవో షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

జి.మాడుగుల మండలంలో ఐటీడీఏ పీవో పర్యటన
వి.కోడాపల్లి వంతెన నిర్మాణ పనులపై ఇంజనీర్లతో మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ


నాడు- నేడు, పలు అభివృద్ధి పనులు పరిశీలన

పనితీరు బాగాలేని ఐదుగురు ఉద్యోగులకు షోకాజ్‌లు 


పాడేరు/జి.మాడుగుల, జూన్‌ 22: జి.మాడుగుల మండలంలో ఐటీడీఏ పీవో రోణంకి గోపాలకృష్ణ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా గెమ్మెలి పీహెచ్‌సీలో ఫార్మసిస్టు, నలుగురు సచివాలయ సిబ్బందికి పీవో షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. తొలుత బందవీధి బాలికల ఆశ్రమ పాఠశాలలో నాడు- నేడు పనులు పరిశీలించారు. ఆ పనులను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. తర్వాత బొక్కెళ్లు మెయిన్‌ రోడ్డు నుంచి కె.కోడాపల్లి రూ.3.8 కోట్లతో చేపడుతున్న రోడ్డు పనులు, మత్స్యపురం-వి.కోడాపల్లి గ్రామాల మధ్య రూ.1.8 కోట్లతో నిర్మిస్తున్న వంతెన పనులను పీవో పరిశీలించి, ఇంజనీర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మారుమూలనున్న గెమ్మెలి పీహెచ్‌సీని సందర్శించారు. రికార్డుల పరిశీలించి, మందుల గదిని తనిఖీ చేశారు. మందుల నిల్వలు, పంపిణీ చేస్తున్న వివరాలను ఫార్మసిస్టు సక్రమంగా తెలపకపోవడంతో షోకాజ్‌ నోటీసు జారీ చేస్తామన్నారు. అలాగే అక్కడ ఆశ్రమ పాఠశాలలో నాడు-నేడు పనులను పరిశీలించారు. అలాగే గెమ్మెలి సచివాలయాన్ని సందర్శించి రికార్డులు తనిఖీ చేసి నలుగురు సిబ్బంది విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని గుర్తించి, వారికి షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని ఎంపీడీవో వెంకన్నబాబును ఆదేశించారు. ఆ తర్వాత మండల కేంద్రంలోని పీహెచ్‌సీని సందర్శించి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఐటీడీఏ పీవో పర్యటించిన ప్రాంతాల్లోని ఆర్‌బీకే, సచివాలయాల నిర్మాణాలను పరిశీలించి, జూలై 31 నాటికి పూర్తి చేయాలని ఇంజనీర్ల ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ ఆదేశించారు. ఈకార్యక్రమంలో గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ శాఖ ఈఈ కేవీఎన్‌ఎన్‌.కుమార్‌, టీడబ్ల్యూ డీడీ జి.విజయకుమార్‌, పంచాయతీరాజ్‌ ఈఈ కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-06-23T05:46:25+05:30 IST