ఐటీడీఏ పీవో సుడిగాలి పర్యటన

ABN , First Publish Date - 2021-12-08T05:45:07+05:30 IST

ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రోణంకి గోపాలక్రిష్ణ మంగళవారం పెదబయలు మండలంలోని సుడిగాలి పర్యటన చేశారు.

ఐటీడీఏ పీవో సుడిగాలి పర్యటన
కిముడుపల్లి సచివాలయ సిబ్బందితో మాట్లాడుతున్న పీవో గోపాలక్రిష్ణ

పాఠశాలలు, సచివాలయాల్లో తనిఖీలు

భనవ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశం


పాడేరు,(పెదబయలు) డిసెంబరు 7: ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రోణంకి గోపాలక్రిష్ణ మంగళవారం పెదబయలు మండలంలోని సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా పలు పాఠశాలలను తనిఖీ చేశారు. వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. తొలుత కిముడుపల్లి పంచాయతీ చీడిమానుగురువులో ప్రాఽథమిక పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులతో ముచ్చటించి, మఽధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు స్వయంగా భోజనాలు వడ్డించారు. తర్వాత గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణాలను పరిశీలించి, పనులు త్వరగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులకు సూచించారు. తర్వాత కిముడుపల్లి, పెదకోడాపల్లి, బంగారుమామిడి, గడుగుబిల్లి గ్రామాల్లో పర్యటించారు. పెదకోడాపల్లిలో రైతు భరోసా కేంద్రం, వన్‌ధన్‌ వికాస కేంద్రం భవన నిర్మాణాలు పరిశీలించి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. కిముడుపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో నాడు-నేడు పనులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.  పాఠశాలకు సీసీ రోడ్డు మంజూరు చేయాలని ఉపాధ్యాయులు కోరగా, పీవో సానుకూలంగా స్పందించారు. అక్కడ జరుగుతున్న గ్రామ సచివాలయం భవన నిర్మాణ పనులను పరిశీలించారు. సిబ్బంది హాజరుని తనిఖీ చేశారు. కిముడుపల్లికి  బస్సు సదుపాయం కల్పించాలని స్థానికులు కోరగా, పీటీడీ అధికారులతో చర్చిస్తామన్నారు. బంగారుమామిడి నుంచి గడుగుపల్లి గ్రామానికి నిర్మించిన తారురోడ్డుని పరిశీలించారు. సీతగుంట బాలికల ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని హెచ్‌ఎంను ఆదేశించారు. ఆయన వెంట పంచాయతీరాజ్‌ డీఈఈ కొండయ్యపడాల్‌, ఎంపీడీవో పూర్ణయ్య, తదితరులు వున్నారు.


Updated Date - 2021-12-08T05:45:07+05:30 IST