మరింత పక్కాగా ఐటీఆర్‌ ఫారాలు

ABN , First Publish Date - 2020-06-01T05:51:18+05:30 IST

ఆదాయ పన్ను (ఐటీ) శాఖ పట్టు బిగిస్తోంది. బ్యాంకుల్లో పెద్ద ఎత్తున డిపాజిట్లు లేదా భారీగా కరెంటు బిల్లు కడుతూ మాకేం ఆదాయం లేదు. రిటర్న్‌లు ఫైల్‌ చేయమంటే ఇక కుదరదు. ఇలాంటి పెద్ద మనుషులంతా ఇకపై తప్పనిసరిగా ఐటీ రిటర్న్‌లు ఫైల్‌ చేయాల్సిందే...

మరింత పక్కాగా ఐటీఆర్‌ ఫారాలు

  • కరెంటు బిల్లు రూ.లక్ష దాటితే చెప్పాల్సిందే
  • నోటిఫై చేసిన ఆదాయ పన్ను శాఖ

న్యూఢిల్లీ: ఆదాయ పన్ను (ఐటీ) శాఖ పట్టు బిగిస్తోంది. బ్యాంకుల్లో పెద్ద ఎత్తున డిపాజిట్లు లేదా భారీగా కరెంటు బిల్లు కడుతూ మాకేం ఆదాయం లేదు. రిటర్న్‌లు ఫైల్‌ చేయమంటే ఇక కుదరదు. ఇలాంటి పెద్ద మనుషులంతా ఇకపై తప్పనిసరిగా ఐటీ రిటర్న్‌లు ఫైల్‌ చేయాల్సిందే. 2020 మార్చితో ముగిసిన 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 2020-21 అసె్‌సమెంట్‌ ఇయర్‌ (ఎఫ్‌వై) నుంచే ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) మొత్తం ఎనిమిది కొత్త ఐటీఆర్‌ ఫారాలు విడుదల చేసింది. ఇందులో ఐటీఆర్‌-1, ఐటీఆర్‌-2, ఐటీఆర్‌-3, ఐటీఆర్‌-4ల్లో రూ.కోటి లేదా అంతకు మించిన కరెంట్‌ ఖాతా డిపాజిట్ల వివరాలు, రూ.లక్ష లేదా అంతకు మించిన కరెంట్‌ బిల్లుల వివరాలు, రూ.2 లక్షలు లేదా అంతకు మించిన విదేశీ ప్రయాణ ఖర్చుల వివరాలు సమర్పించాలి. 



కొత్త నిబంధనలివే..

సీబీడీటీ జారీ చేసిన నిబంధనల ప్రకారం ఇక ఈ కింది వ్యక్తులు అందరూ ఆదాయం ఉన్నా లేక పోయినా ఏటా తప్పనిసరిగా ఐటీ రిటర్న్‌లు ఫైల్‌ చేయాలి.

  1. ఏదైనా బ్యాంకు కరెంట్‌ ఖాతాలో డిపాజిట్లు రూ.కోటి దాటితే
  2. వార్షిక కరెంటు బిల్లు రూ.లక్ష లేదా అంతకు మించిన వ్యక్తులు
  3. ఒక ఆర్థిక సంవత్సరంలో విదేశీ ప్రయాణాలపై రూ.2 లక్షలు లేదా అంతకు మించి ఖర్చు చేసే వ్యక్తులు


కొత్త షెడ్యూల్‌

కరోనా నేపథ్యంలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను మినహాయింపు పెట్టుబడుల గడువును ఈ సంవత్సరం జూన్‌ నెలాఖరు వరకు పొడిగించారు. పొడిగించిన ఈ పన్ను మినహాయింపు పెట్టుబడులు, విరాళాల వివరాలనూ ఈ రిటర్న్స్‌లో పొందుపరిచేందుకు వీలుగా అన్ని ఐటీఆర్‌ల్లో డీ1 పేరుతో న్యూ షెడ్యూల్‌ చేర్చారు.


ఎవరెవరికి ఏ ఐటీఆర్‌ ?

ఐటీఆర్‌-1 (సహజ్‌): వార్షిక ఆదాయం రూ.50 లక్షలు మించని వ్యక్తులు, గృహ ఆస్తుల ఉమ్మడి యజమానులు

ఐటీఆర్‌-2 : రెసిడెన్షియల్‌ ప్రాపర్టీ ఆదాయం ఉన్న వ్యక్తులు 

ఐటీఆర్‌-3: వ్యాపార ఆదాయం ఉన్న వ్యక్తులు

ఐటీఆర్‌-4 సుగమ్‌: వృత్తి లేదా వ్యాపారం ద్వారా రూ.50 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తులు, అవిభక్త హిందూ కుటుంబాలు (హెచ్‌యూఎఫ్‌), సంస్థలు.

ఐటీఆర్‌-5: పరిమిత భాగస్వామ్య సంస్థలు (ఎల్‌ఎల్‌పీ), అసోసియేషన్‌ ఆఫ్‌ పర్సన్స్‌ (ఏఓపీ)

ఐటీఆర్‌-6: సెక్షన్‌ 11 కింద మినహాయింపు కోరని కంపెనీలు

ఐటీఆర్‌-7: ట్రస్టులు, ధార్మిక సంస్థల ఆస్తులపై ఆదాయం పొందే వ్యక్తులు

ఐటీఆర్‌-వీ: వెరిఫికేషన్‌ కోసం


Updated Date - 2020-06-01T05:51:18+05:30 IST