స్వేచ్ఛా ఘంటారావం

ABN , First Publish Date - 2021-02-27T06:26:04+05:30 IST

ప్రముఖ కవి వరవరరావుకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దిశారవికి బెయిల్‌ ఇస్తూ, అసమ్మతి, ధిక్కారం సైతం రాజ్య విధానాలలో నిష్పాక్షికతను నింపేందుకు న్యాయబద్ధమైన సాధనాలని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు...

స్వేచ్ఛా ఘంటారావం

ప్రముఖ కవి వరవరరావుకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దిశారవికి బెయిల్‌ ఇస్తూ, అసమ్మతి, ధిక్కారం సైతం రాజ్య విధానాలలో నిష్పాక్షికతను నింపేందుకు న్యాయబద్ధమైన సాధనాలని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను న్యాయస్థానాలు సమర్థిస్తున్నాయి. ద్వితీయ స్వాతంత్ర్య సంగ్రామం ప్రారంభమయినట్టుగా నేను భావిస్తున్నాను. విచారణ లేకుండా కారాగారాల్లో కునారిల్లుతున్న అసంఖ్యాక ఖైదీలు స్వేచ్ఛావాయువులను పీల్చుకునే శుభతరుణం తప్పక వస్తుంది.


స్వేచ్ఛఅజేయం. న్యాయస్థానాల తీర్పులు ఈ సత్యాన్నే ఉద్ఘోషిస్తున్నాయి. మనిషి అస్తిత్వం, వ్యక్తిగత స్వేచ్ఛ అవిభాజ్యమైనవి. దురదృష్ట వశాత్తు పౌరుల వైయక్తిక స్వేచ్ఛను అణచివేసే మూర్ఖత్వాన్ని ఆధునిక రాజ్యవ్యవస్థ ఇంకా విడనాడలేదు. అయితే నవీన పౌరసమాజం వ్యక్తిగత స్వేచ్ఛను సంరక్షించడంలో విఫలమవలేదు, విఫలమవబోదు.

మరి మన ప్రస్తుత పాలకులు ఈ తిరుగులేని వాస్తవాన్ని ఎందుకు విస్మరిస్తున్నారు? స్వతంత్ర భారతదేశ చరిత్రలో మున్నెన్నడూ సంభవించని రీతిలో అసమ్మతి, ధిక్కారం, నిరసనలను కఠినంగా అణచివేసేందుకు రాజ్యాధికారాలను సమీకరిస్తున్నారు. అత్యవసర పరిస్థితి కాలం (1975–-77)లో రాజకీయ వ్యతిరేకతను మాత్రమే రూపుమాపేందుకు రాజ్యవ్యవస్థ ప్రయత్నించింది. ఇప్పుడలా కాదు. ప్రతి అసమ్మతి స్వరాన్ని, ప్రతి ధిక్కార వాణిని నొక్కివేసేందుకు రాజ్యవ్యవస్థ అనుచితంగా వ్యవహరిస్తోంది. రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, కళాసృజన, విద్వత్ రంగాలలో కించిత్ నిరసనను, సహేతుకమైన భిన్నాభిప్రాయాన్ని పాలకులు సహించలేకపోతున్నారు. కొత్త వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా న్యూఢిల్లీ పొలిమేర ప్రాంతాలు సింఘు, టిక్రిలో రైతుల నిరసన జరుగుతోంది. ఆ చట్టాలను తక్షణమే రద్దుచేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


ఒక రాజకీయపార్టీగా భారతీయ జనతాపార్టీని వారేమీ వ్యతిరేకించడం లేదు అయినప్పటికీ దర్యాప్తు సంస్థలు వారిని వేధిస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్య వైపరీత్యమా? లేక ప్రజాస్వామ్య వినాశనమా? దళితులపై అడ్డూ అదుపూ లేకుండా నిర్భయంగా దాడులు సాగుతున్నాయి. వారిపై వివక్ష ముమ్మరమవుతోంది. ధరల పెరుగుల సామాన్యులను కుంగదీస్తోంది. మరి వారు ఆగ్రహావేశాలతో చెలరేగిపోకుండా ఎలా ఉంటారు? పోలీసుల ఆగడాలను ప్రశ్నిస్తున్నారు. కార్మిక హక్కుల అణచివేతను నిరసిస్తున్నారు. సరే విధ్వంసక, వినాశనకర ఆర్థిక విధానాలను నిలదీస్తున్నారు. ప్రజల్లో ఈ వినూత్న చైతన్యాన్ని పాలకులు సహించలేక పోతున్నారు. ప్రతి అసమ్మతిని, ప్రతి ధిక్కారాన్ని మొగ్గ దశలోనే తుంచివేయడానికి సంసిద్ధమవుతున్నారు.


దిశా రవి రైతుల నిరసనలకు మద్దతునిస్తున్నారు. ఏ విధంగా చూసినా ఆమె ఒక రాజకీయ పక్షపాతి కాదు. అయినప్పటికీ ఆమెను రాజ్యవ్యవస్థ శత్రువుగా పాలకులు పరిగణిస్తున్నారు. అంతకుముందు జర్నలిస్టు సిద్దీఖ్ కప్పాన్‌ను కూడా అలానే పరిగణించారు. అతడు చేసిన నేరం ఏమిటంటే, హాథ్రాస్‌లో అత్యాచారానికి గురైన ఒక బాధితురాలి గురించి విపుల వార్తావ్యాఖ్య రాయడానికి పూనుకోవడమే! ప్రభుత్వాన్ని కూలదోయడానికి పూనుకున్న ఒక కుట్రదారుగా కప్పాన్‌పై అభియోగం మోపారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపిన విద్యార్థులు, మహిళలు కూడా మన పాలకుల దృష్టిలో దేశద్రోహులే. భారత్ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్న తుక్డే తుక్డే గ్యాంగ్‌గా వారిని తూలనాడారు. శ్రామికుల హక్కుల కోసం పోరాడుతున్న నొదీప్ కౌర్ సైతం నేరస్థురాలే. అల్లర్లను రెచ్చగొట్టి ఒకరి హత్యాకాండకు పాల్పడేందుకు ప్రయత్నించిందన్న ఆరోపణను ఆమెపై మోపారు. పరిహాసం కూడ తగదు కాక తగదు. ఒక జోక్‌ను తన అద్భుత మూకాభినయంతో వ్యక్తం చేసిన కమెడియన్ మునావర్ ఫరూఖీని జైలుకు పంపించారు! మతపరమైన మనోభావాలను దెబ్బతీశాడనే నింద ఆయనపై మోపారు. వ్యక్తిగత స్వేచ్ఛపై ఇది సంపూర్ణ దాడి కాదా? కనికరం లేని అఘాయిత్యం. మరి మనం నాగరిక సమాజంలోనే ఉన్నామా?


న్యాయవ్యవస్థ ముఖ్యంగా కిందిస్థాయి న్యాయస్థానాలు నిష్క్రియాత్మక ప్రేక్షకుల వలే ఉండిపోతున్నాయి. అరెస్ట్‌లను సమర్థిస్తున్నాయి. ఆలోచనారహితంగా ప్రజలను పోలీసు కస్టడీకి లేదా జుడీషియల్ కస్టడీకి పంపుతున్నాయి. సువ్యవస్థిత చట్టాన్ని అనుసరించడం లేదు. రాజస్థాన్ వర్సెస్ బాల్‌చంద్ కేసులో, ‘జైల్‌కు పంపడం కాదు, బెయిల్ ఇవ్వడమే ప్రాథమిక న్యాయసూత్రం...’ అని జస్టిస్‌ కృష్ణయ్యర్‌ పేర్కొన్నారు. మనూభాయి రతీలాల్ పటేల్ కేసులో మెజిస్ట్రేట్ విధ్యుక్త ధర్మం గురించి సుప్రీంకోర్టు ఇలా నొక్కి చెప్పింది: పోలీస్ రిమాండ్‌కు వారంట్ ఉన్నదా, జుడీషియల్ రిమాండ్‌కు పంపడం సమర్థనీయమేనా లేదా అసలు ఏ రిమాండ్‌నూ విధించవలసిన అవసరం లేదా అనే విషయాలపై సొంతంగా ఒక స్పష్టమైన నిర్ణయానికి రావాలి’. న్యాయసూక్షాలను ఇంతగా స్పష్టం చేసినా న్యాయస్థానాలు నిస్సంకోచంగా ప్రజలను జైళ్ళకు పంపుతూనే ఉన్నాయి. 


రిమాండ్‌లో ఉన్న, విచారణలో ఉన్న ఖైదీల కథలు గర్హనీయమైన స్వేచ్ఛా ఉల్లంఘనలే. ప్రతి నెలా లేదా రెండు నెలలకు ఒకసారి ప్రతి ఖైదీని కోర్టులో హాజరుపరచవలసి ఉంటుంది. అలా జరుగుతోందా? సమాధానం స్పష్టమే. దర్యాప్తు అధికారి సెలవులో ఉంటాడు. ప్రాసిక్యూటర్ అందుబాటులో ఉండడు. ప్రాసిక్యూషన్ సాక్షులు కోర్టుకు హాజరుకారు. ఖైదీ మెడికల్ రిపోర్ట్ సిద్ధంగా ఉండదు. జడ్జి గారికి సమయం ఉండదు లేదా సెలవులో ఉంటారు. ఖైదీ మళ్ళీ కోర్టుకు రావాల్సిన ‘తేదీ’తో జైలుకు తిరిగివస్తాడు. ఆశాభావంతో ఉండాలి. ఎంతకాలం? అది అడుగంటిపోవడానికి ఎంతోకాలం పట్టదు. ఉన్నత న్యాయస్థానాలలోనైనా పరిస్థితులు ఇంతకంటే మెరుగ్గా ఉన్నాయా? హైకోర్టులు, సుప్రీంకోర్టులో బెయిల్ కోసం చేసుకున్న దరఖాస్తులు వేల సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయి. ఒకే ఒక్క పర్యాయం విచారణతో వాటిలో ఏ ఒక్కదానిపైనా నిర్ణయం తీసుకోవడం అనేది జరగనిపని. దర్యాప్తు సంస్థలు (పోలీసు, సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, జాతీయ దర్యాప్తు సంస్థ మొదలైనవి) ప్రతి బెయిల్ దరఖాస్తును తీవ్రంగా వ్యతిరేకించడమే దీనికి కారణం.


అర్నాబ్ గోస్వామి కేసు చెప్పిన పాఠాలు ఏమిటి? ‘ఏ వ్యక్తికీ వైయక్తిక స్వేచ్ఛను ఒక్క రోజు కూడా నిరాకరించకూడద’ని సుప్రీంకోర్టు పేర్కొంది. బెయిల్ మంజూరు చేయడంపై దర్యాప్తు సంస్థల వ్యతిరేకతను న్యాయమూర్తులు ఇంకెంత మాత్రం సహించడం లేదు. బెయిల్ దరఖాస్తుదారుల వ్యక్తిగత స్వేచ్ఛను సంరక్షించేందుకు వారు మొగ్గుతున్నారు. ఇది నాకు ఎనలేని సంతోషాన్నిస్తోంది. ప్రముఖ కవి వరవరరావు విషయంలో వైద్యకారణాల ప్రాతిపాదికన బాంబే హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. షరతులతోనే అయిప్పటికీ ఆ 82 ఏళ్ళ కవికి బెయిల్ మంజూరు కావడం హర్షణీయం. దిశా రవి విషయంలో న్యాయమూర్తి ప్రజాస్వామ్య విశిష్టతను ఇలా నొక్కి చెప్పారు: ‘అభిప్రాయ భేదాలు, అనంగీకారాలు, భిన్న వైఖరులు, అసమ్మతి, ధిక్కారం మొదలైనవన్నీ రాజ్య విధానాలలో వస్తుగత వైఖరి, నిష్పాక్షికతను నింపేందుకు న్యాయబద్ధమైన ఉపకరణాలు’. 


పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను న్యాయస్థానాలు సమర్థిస్తున్నాయి. ద్వితీయ స్వాతంత్ర్య సంగ్రామం ప్రారంభమయినట్టుగా నేను భావిస్తున్నాను. విచారణ లేకుండా కారాగారాల్లో కునారిల్లుతున్న అసంఖ్యాక ఖైదీలు స్వేచ్ఛావాయువులను పీల్చుకునే శుభతరుణం తప్పక వస్తుంది.




పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2021-02-27T06:26:04+05:30 IST