అమీ తుమీ

ABN , First Publish Date - 2021-03-28T09:44:13+05:30 IST

తొలి వన్డేలో జరిగిన తప్పులను సరిదిద్దుకుంటూ శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ విరుచుకుపడిన తీరుకు భారత జట్టు బెంబేలెత్తింది. 337 పరుగుల ఛేదనను సైతం ఆ జట్టు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా 39 బంతులుండగానే పూర్తి చేసింది...

అమీ తుమీ

  • సిరీస్‌ కోసం భారత్‌-ఇంగ్లండ్‌     
  • చివరి వన్డే నేడు     
  • మ 1.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో..

టీ20 సిరీస్‌ మాదిరే వన్డేల్లోనూ ఫలితం తేలేందుకు ఆఖరి మ్యాచ్‌ వరకు ఎదురుచూడాల్సి వచ్చింది. చెరో మ్యాచ్‌ నెగ్గి నువ్వా.. నేనా అనే రీతిలో ఉన్న భారత్‌, ఇంగ్లండ్‌ జట్లు నేడు జరిగే రసవత్తర పోరులో తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఇరు జట్లలో బ్యాట్స్‌మెన్‌ అద్భుత ఫామ్‌లో ఉండడంతో పరుగులు పోటెత్తుతున్నాయి. అయితే బౌలింగ్‌లో బలహీనంగా కనిపిస్తున్న టీమిండియాలో మార్పులు తప్పవు. పక్కా వ్యూహంతో కోహ్లీ సేన ఈసారీ చివరి పంచ్‌ తమదే కావాలన్న కసితో బరిలోకి దిగుతోంది.


పుణె: తొలి వన్డేలో జరిగిన తప్పులను సరిదిద్దుకుంటూ శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ విరుచుకుపడిన తీరుకు భారత జట్టు బెంబేలెత్తింది. 337 పరుగుల ఛేదనను సైతం ఆ జట్టు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా 39 బంతులుండగానే పూర్తి చేసింది. వారి జోరుకు భారత్‌ 400 పరుగులు చేసినా సరిపోయేది కాదేమో అనిపించింది. బెయిర్‌స్టో, స్టోక్స్‌ ప్రతాపానికి బౌలర్లు పూర్తిగా లయ తప్పారు. దీంతో ఆదివారం ఆఖరిదైన మూడో వన్డేలో భారత జట్టులో మార్పులు కనిపించనున్నాయి. ముఖ్యంగా స్పిన్నర్‌ కుల్దీప్‌ తొలి మ్యాచ్‌లో 64, రెండో మ్యాచ్‌లో 84 పరుగులు సమర్పించుకోగా.. క్రునాల్‌ సైతం ఆరు ఓవర్లలోనే 72 రన్స్‌ ఇచ్చాడు. దీంతో వీరి స్థానాల్లో చాహల్‌, సుందర్‌లను ఆడించే అవకాశం ఉంది. పేసర్లు భువనేశ్వర్‌, ప్రసిద్ధ్‌ మాత్రం రాణిస్తున్నారు. పని ఒత్తిడి పడకుండా హార్దిక్‌ బౌలింగ్‌కు దూరంగా ఉన్నాడు. బ్యాటింగ్‌ విభాగంలో పెద్దగా లోపాలు కనిపించడం లేదు. వరుసగా రెండు వన్డేల్లో 300+ స్కోర్లు నమోదయ్యాయి. కానీ జట్టు తమ వ్యూహాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆరంభంలో నెమ్మదిగా.. చివరి 15 ఓవర్లలో వేగంగా ఆడడం ఇక కుదరదు. ధోనీ హయాంలో ఇది పనిచేసిందేమో కానీ ఇంగ్లండ్‌లాంటి ప్రపంచ చాంపియన్‌పై ఆరంభం నుంచే దూకుడు చూపాల్సిందే. అందుకే ఓపెనర్లు రోహిత్‌, ధవన్‌ ప్రారంభ ఓవర్ల నుంచే దంచి కొట్టాలి. దీంతో మధ్య ఓవర్లలో రాహుల్‌, పంత్‌, హార్దిక్‌ స్వేచ్ఛగా ఆడే వీలుంటుంది.


జోరు మీదున్నారు..: ఇంగ్లండ్‌ టాపార్డర్‌లో రాయ్‌, బెయిర్‌స్టో, స్టోక్స్‌ ఎంతటి లక్ష్యాన్ని అయినా ఛేదించేలా కనిపిస్తున్నారు. వరుసగా రెండు వికెట్లకు సెంచరీ భాగస్వామ్యాలు ఏర్పరిచి సిరీ్‌సలో తమ జట్టును సజీవంగా ఉంచారు. తొలి 15 ఓవర్లలో ఓపెనర్లు వీలైనంత వేగంగా ఆడుతూ బౌలర్లపై ఒత్తిడి పెరిగేలా చేస్తున్నారు. మధ్య ఓవర్లలో కాస్త నిదానంగా ఆడినా రన్‌రేట్‌పై ప్రభావం పడడంలేదు. తాత్కాలిక కెప్టెన్‌ బట్లర్‌ కూడా బ్యాట్‌ ఝుళిపిస్తే ఈ మ్యాచ్‌లోనూ భారత్‌కు కష్టాలు తప్పవు. లివింగ్‌స్టోన్‌, మలాన్‌కు ఇంకా పూర్తి స్థాయిలో ఆడే అవకాశం రాలేదు. బౌలింగ్‌లో స్పిన్‌ బలహీనంగా ఉన్నా పేసర్లు మాత్రం కట్టుదిట్టమైన బంతులతో రాణిస్తున్నారు. పేసర్‌ టామ్‌ కర్రాన్‌ స్థానంలో మార్క్‌ వుడ్‌ ఆడే అవకాశం ఉంది.


జట్లు (అంచనా)

భారత్‌: రోహిత్‌, ధవన్‌, కోహ్లీ (కెప్టెన్‌), రాహుల్‌, పంత్‌, హార్దిక్‌, క్రునాల్‌/సుందర్‌, భువనేశ్వర్‌,  శార్దూల్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, కుల్దీ్‌ప యాదవ్‌ /చాహల్‌.

ఇంగ్లండ్‌:  జేసన్‌ రాయ్‌, బెయిర్‌స్టో, స్టోక్స్‌, బట్లర్‌ (కెప్టెన్‌), మలాన్‌, లివింగ్‌స్టోన్‌, మొయిన్‌ అలీ, సామ్‌ కర్రాన్‌, రషీద్‌, టోప్లే, వుడ్‌.


పిచ్‌

ఇరు జట్ల నుంచి పేసర్లకు ఆరంభంలో పట్టు దొరుకుతోంది. కానీ మ్యాచ్‌ సాగే కొద్దీ పరుగుల వరద పారనుంది. ఆదివారం కూడా భారీ స్కోర్లు నమోదయ్యే చాన్సుంది.

Updated Date - 2021-03-28T09:44:13+05:30 IST