భారత టెకీలకు శుభవార్త.. ఆ సాకుతో వీసాల జారీ ఆపొద్దన్న అమెరికా కోర్టు..!

ABN , First Publish Date - 2021-10-07T23:42:42+05:30 IST

కరోనా సమయంలో ప్రయాణాలపై ఆంక్షలను సాకుగా చూపుతూ అమెరికా విదేశాంగ శాఖ వీసాల జారీ నిలిపిపేస్తే అది చట్టవిరుద్ధమేనని అమెరికా న్యాయస్థానం మంగళవారం నాడు తీర్పు వెలువరించింది.

భారత టెకీలకు శుభవార్త.. ఆ సాకుతో వీసాల జారీ ఆపొద్దన్న అమెరికా కోర్టు..!

వాషింగ్టన్: కరోనా సమయంలో ప్రయాణాలపై ఆంక్షలను సాకుగా చూపుతూ అమెరికా విదేశాంగ శాఖ వీసాల జారీ నిలిపిపేస్తే అది చట్టవిరుద్ధమేనని అమెరికా న్యాయస్థానం మంగళవారం నాడు తీర్పు వెలువరించింది. ఇమ్మిగ్రేషన్ న్యాయవాద సంస్థలు, పలువురు వ్యక్తులు, అమెరికా ఇమ్మిగ్రేషన్ లాయర్లు సంయుక్తంగా దాఖలు చేసిన ఓ పిటిషన్‌పై న్యాయమూర్తి ఈమేరకు తీర్పు వెలువరించారు. ప్రయాణ ఆంక్షల అడ్డుపెట్టుకుని అమెరికా విదేశాంగ శాఖ వీసాల జారీ నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ ఈ వ్యాజ్యం దాఖలైంది. 


కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు అప్పటి అధ్యక్షుడు ట్రంప్,  ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్.. అమెరికాకు విదేశీయులు రాకుండా ప్రయాణాలపై నిషేధం విధించారు. అమెరికా పౌరసత్వం, అమెరికాలో శాశ్వతనీవాసార్హత లేని వారెవ్వరూ దేశంలోకి అడుగుపెట్టకుండా నిషేధాజ్ఞలు జారీ చేశారు. అయితే..ఈ సాకుతో అమెరికా విదేశాంగ శాఖ వీసాల జారీ కూడా నిలిపివేస్తోందని అనేక మంది ఆరోపించారు. ఇక తాజా తీర్పుతో ఫెడరల్ జడ్జి జేమ్స్. ఈ. బోస్‌బర్గ్ ఈ దుస్సాంప్రదాయానికి చెక్ పెట్టారు. 


చైనా, ఇరాన్, భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, షెంజెన్ ప్రాంతం, బ్రిటన్ ఐర్లాండ్ సందర్శకులపై ఇప్పటికీ అమెరికా కొన్ని రకాల ఆంక్షలను కొనసాగిస్తోంది. ఇక..కరోనా సమయంలో తల్లిదండ్రుల సంరక్షణ కోసం స్వదేశానికి వెళ్లిన అనేక భారతీయులు మళ్లీ అమెరికాకు తిరిగెళ్లలేక నానా ఇబ్బందులూ పడ్డారని అమెరికా మీడియా కూడా గతంలో పలు కథనాలు ప్రచురించింది. 

Updated Date - 2021-10-07T23:42:42+05:30 IST