ఉపసంహరణకు వేళాయె..

ABN , First Publish Date - 2021-03-02T07:19:12+05:30 IST

మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణకు సమయం ఆసన్నమైంది. ఈ ప్రక్రియ ముగిస్తే ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులెవరో తేటతెల్లమవుతుంది.

ఉపసంహరణకు వేళాయె..

- నేడు, రేపు విత్‌డ్రాలు - జిల్లావ్యాప్తంగా 2280 మంది అభ్యర్థులు

 - అధికార పార్టీలో అదే గుబులు

అనంతపురం కార్పొరేషన్‌, మార్చి1: మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణకు సమయం ఆసన్నమైంది. ఈ ప్రక్రియ ముగిస్తే ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులెవరో తేటతెల్లమవుతుంది. మంగళ, బుధవారాల్లో నామినేషన్ల విత్‌డ్రా ఉంటుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్‌ అధికారులను కలిసి అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎవరెవరు నామినేషన్లు విత్‌డ్రా చేసుకుంటారనే అంశంపైనే చర్చ సాగుతోంది. జిల్లాలో అనంతపురం కార్పొరేషన్‌, హిం దూపురం, ధర్మవరం, కదిరి, గుంతకల్లు, తాడిపత్రి, కళ్యాణదుర్గం, రాయదుర్గం, గుత్తి మున్సిపాలిటీలు మడకశిర, పుట్టపర్తి నగర పంచాయతీల్లో మొత్తం 2280 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నామినేషన్ల పరిశీలన అనంతర జాబితా ఇది. తాజాగా గతనెల 28న మృతిచెందిన స్థానాల్లో నామినేషన్లకు అవకాశమివ్వగా.. హిందూపురం, ధర్మవరం, కదిరి, పుట్టపర్తిలో ఒక్కో నామినేషన్‌ దాఖలయ్యాయి. పరిశీలన అనంతరం కూడా అవే ఉన్నాయి. అదనంగా నాలుగు జమయ్యాయి.

వైసీపీలో ఆందోళన

ఎన్నికల ఉపసంహరణ నేపథ్యంలో అధికార వైసీపీలో రెబల్స్‌ గుబులు పట్టుకుంది. ఇంకా అభ్యర్థులను ఖరారు చేయకపోవటంతో ఎవరెవరు పోటీలో ఉంటారో చెప్పలేని పరిస్థితి. జిల్లావ్యాప్తంగా 965 నామినేషన్లు ఆ పార్టీ అభ్యర్థులవే ఉన్నాయి. ఇందులో నగరపాలక సంస్థలో 192 ఉన్నాయి. దీంతో తాము నిలబడే డివిజన్లు/వార్డుల్లో సొంత పార్టీకి చెందిన వారితో సయోధ్య చేసే పనుల్లో బిజీగా ఉన్నారు. కొందరు ససేమిరా అంటుండటంతో ఏమి చేయాలో పాలుపోవటం లేదు. ఉపసంహరణకు గంటలే సమయం ఉండటంతో ఆందోళన చెందుతున్నారు. మరి ఈ రెండ్రోజుల్లో ఎవరెవరు ఉపసంహరణల కోసం వెళ్తారో చూడాలి.

Updated Date - 2021-03-02T07:19:12+05:30 IST