వైసీపీ పాలనలో జర్నలిస్టులకు అన్యాయం: ఐవీ సుబ్బారావు

ABN , First Publish Date - 2021-08-17T23:02:55+05:30 IST

వైసీపీ పాలనలో జర్నలిస్టులకు అడుగడుగునా అన్యాయం జరుగుతుందని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు అన్నారు.

వైసీపీ పాలనలో జర్నలిస్టులకు అన్యాయం: ఐవీ సుబ్బారావు

ప్రకాశం: వైసీపీ పాలనలో జర్నలిస్టులకు అడుగడుగునా అన్యాయం జరుగుతుందని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క జర్నలిస్టుల సమస్యా పరిష్కారం కాలేదన్నారు. కరోనాతో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.  సీఎం జగన్ జీఓ కూడా విడుదల చేసినా ఇంత వరకూ అమలు కాలేదన్నారు. ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవాన్ని సావధాన దినంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో జర్నలిస్టులు సంబంధిత ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులను, అధికారులకు కలసి వినతి పత్రాలు సమర్పించారని చెప్పారు. కరోనాతో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా విడుదల కోసం గత ఆరు నెలలుగా పలువురు బాధ్యులను కలసినా స్పందించలేదని చెప్పారు. 


ఎక్స్‌గ్రేషియా కాకుండా మరో ప్రత్యామ్నాయం ఇచ్చేందుకు చూస్తున్నామని ఇప్పుడు చెప్పటం సరైంది కాదన్నారు. పలువురు అర్హులైన జర్నలిస్టులకు ఇంత వరకూ అక్రిడిటేషన్లు ఇవ్వలేదని మండిపడ్డారు. చిన్నపత్రికలకు వివిధ కారణాలతో అక్రిడిటేషన్లు నిలిపి వేశారన్నారు. అక్రిడిటేషన్ కమిటీల్లో జర్నలిస్టు సంఘాలను తొలగించారన్నారు. జర్నలిస్టుల హౌస్ సైట్స్ విషయంలో కూడా స్పష్టత లేదన్నారు. సీఎం జగన్ జర్నలిస్టుల సమస్యలపై సమీక్ష నిర్వహించి తక్షణమే పరిష్కరించకపోతే సామూహిక నిరాహార దీక్షలకు సిద్ధమవుతామని ఐవీ సుబ్బారావు హెచ్చరించారు.

Updated Date - 2021-08-17T23:02:55+05:30 IST