అడుగడుగున గుడి.. జాగేశ్వరుడి సన్నిధి

ABN , First Publish Date - 2021-05-28T05:30:00+05:30 IST

దేవభూమిగా ప్రఖ్యాతి చెందిన ఉత్తరాఖండ్‌లో ఒక ప్రాచీన క్షేత్రం జాగేశ్వర్‌ ధామ్‌. నిజానికిది సుమారు 124 గుడులు ఒకే చోట నెలకొన్న అపురూపమైన ప్రదేశం. హిమాలయాల్లో... దట్టమైన అడవులు చుట్టూ ఆవరించి ఉన్న లోయలో...

అడుగడుగున గుడి.. జాగేశ్వరుడి సన్నిధి

దేవభూమిగా ప్రఖ్యాతి చెందిన ఉత్తరాఖండ్‌లో ఒక ప్రాచీన క్షేత్రం జాగేశ్వర్‌ ధామ్‌. నిజానికిది సుమారు 124 గుడులు ఒకే చోట నెలకొన్న అపురూపమైన ప్రదేశం. హిమాలయాల్లో... దట్టమైన అడవులు చుట్టూ ఆవరించి ఉన్న లోయలో, సముద్ర మట్టానికి 6,135 అడుగులు లేదా 1,870 మీటర్ల ఎత్తులో ఈ ఆలయ సముదాయం ఉంది. 


దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసిన అనంతరం మహా శివుడు ధ్యానంలో నిమగ్నమైన ప్రదేశం ఇదేననీ, ఆయనను సప్త ఋషులు పూజించి ఇక్కడ ఆలయాలు నిర్మించారనీ స్థలపురాణం చెబుతోంది. ధ్యాన నిమగ్నుడై, అఖండ తేజస్సుతో ప్రకాశిస్తున్న శివుణ్ణి ఇక్కడకు దగ్గరలోని గ్రామాల మహిళలు రోజూ దర్శించి, కొలిచేవారనీ, ఆ మహిళలను అనుమానించి, వారి భర్తలు ఆ ప్రాంతానికి రాగా... శివుడు బాలుడి రూపంలో వారికి దర్శనమిచ్చాడనీ పేర్కొంటోంది. జాగేశ్వర ప్రధాన మందిరంలో స్వామిని బాల శివుడిగా కొలుస్తారు. ఈ ఆలయ సముదాయంలోనే వృద్ధ శివుడి గుడి కూడా ఉంది. జాగేశ్వర స్వామి దేవేరి పుష్ఠీ దేవి. మహా మృత్యుంజయ మంత్రం జన్మస్థలం జాగేశ్వరమనీ, ఆ మంత్రంలో ప్రస్తావితమైన పుష్ఠివర్థనుడు జాగేశ్వరుడనీ చెబుతారు. శ్రీరాముడి కుమారులైన లవకుశులు ఇక్కడ యజ్ఞం చేశారనీ, దాన్ని తిలకించడానికి ప్రధాన దేవతలందరినీ ఆహ్వానించారనీ, పవిత్రమైన ఈ ప్రదేశంలో ఆ దేవతలు కొలువు తీరడంతో వారికి ఆలయాలు ఏర్పడ్డాయనీ మరో కథ. ఆదిశంకరులు కేదార్‌నాథ్‌ వెళుతూ, మార్గ మధ్యంలో ఉన్న జాగేశ్వర్‌లో ఆగి, అక్కడ ఆలయాలను పునరుద్ధరించారని స్థానిక గాథల ద్వారా తెలుస్తోంది. జాగేశ్వరుణ్ణి యోగీశ్వరుడనీ, నాగేశ్వరుడనీ పిలుస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఎనిమిదోదైన దారుకావనం ఇదేనన్న అభిప్రాయం ఉంది. ద్వారక ప్రాంతంలోని నాగేశ్వరుణ్ణి దారుకావన జ్యోతిర్లింగంగా పూజిస్తారు. అయితే, ద్వారక దగ్గర దారుకావనాలు (దేవదారు అడవులు) లేవనీ... 

‘హిమాద్రేరుత్తరే పార్శ్వే దేవదారువనం పరమపావనం శంకరస్థానం తత్రత్సర్వే శివార్చితః’ అనే ప్రాచీన శ్లోకం ప్రకారం... నిజమైన దారుకావనం ఇదేననీ, జాగేశ్వరుడే నాగేశ్వరుడనీ వాదన ఉంది. 




జాగేశ్వర ధామ్‌లోని దాదాపు 124 ఆలయాల ఈ సముదాయం జటాగంగ నదీ తీరంలో ఉంది. శివుడి జటాఝూటం నుంచి వెలువడిన నీటి పాయ ఈ నదిగా మారిందంటారు. స్వర్గారోహణకు బయలుదేరిన పాండవులు తమ పితృదేవతలకు ఈ నదీ తీరంలో పిండ ప్రదానాలు చేశారని స్థానిక విశ్వాసం. సమీప గ్రామాల ప్రజలు ఇప్పటికీ ఈ నదీ తీరంలో ఉత్తర క్రియలు నిర్వహిస్తూ ఉంటారు. 

జాగేశ్వర్‌లోని ఆలయాలన్నిటిలో అతి పురాతనమైనదీ, పెద్దదీ మహా మృత్యుంజయ మందిరం. జాగేశ్వర జ్యోతిర్లింగ ఆలయంతో పాటు పుష్ఠీ దేవి, కేదారేశ్వరుడు, తాండేశ్వరుడు, కుబేరుడు, లక్ష్మి, చండిక, లకులిష, నవగ్రహాలు, దక్షిణముఖ హనుమంతుడు, నవ దుర్గ మందిరాలు ప్రధానమైనవి. మొదట్లో కలపతో చేసిన ఈ ఆలయాలు కాలక్రమేణా శిథిలమయ్యాయనీ, ఆ తరువాత శిలా మందిరాలు నిర్మించారనీ చెబుతారు. ఇక్కడి ఆలయాలు క్రీస్తు శకం 7 నుంచి 12వ శతాబ్దం మధ్యన నిర్మించినట్టు శాసనాలు తదితర ఆధారాలున్నాయి. ఉత్తరాఖండ్‌ రాష్ట్రం అల్మోరాకు సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాగేశ్వర్‌ ధామ్‌ను వారసత్వ సంపదగా పురావస్తు శాఖ ప్రకటించి, సంరక్షిస్తోంది. 


Updated Date - 2021-05-28T05:30:00+05:30 IST