ఆయన వేధిస్తున్నాడు.. నాకు ప్రాణహాని ఉంది : జబర్దస్త్ వినోద్‌

ABN , First Publish Date - 2021-04-09T14:42:53+05:30 IST

తనకు ప్రాణహాని ఉందని, న్యాయం చేయాలని టీవీనటుడు, జబర్దస్త్ వినోద్‌ ఆవేదన వ్యక్తంచేశారు...

ఆయన వేధిస్తున్నాడు.. నాకు ప్రాణహాని ఉంది : జబర్దస్త్ వినోద్‌

హైదరాబాద్/అంబర్‌పేట : ఇంటి యజమాని తనను వేదింపులకు గురిచేస్తున్నాడని.. అతడి నుంచి తనకు ప్రాణహాని ఉందని, న్యాయం చేయాలని టీవీనటుడు, జబర్దస్త్ వినోద్‌ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు గురువారం అంబర్‌పేటలోని తూర్పుమండలం డీసీపీ రమేష్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వినోద్‌ మాట్లాడుతూ కాచిగూడలో తను ఉంటున్న ఇంటిని కొనేందుకు, ఇంటి యజమానితో రూ. 40 లక్షలకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నానని తెలిపారు. ఇందులో భాగంగా ఏడాది క్రితం రూ. 13.40 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించానన్నారు.


ప్రస్తుతం ఎక్కువ డబ్బులు ఇస్తేనే అగ్రిమెంట్‌ చేస్తానని ఇంటి యజమాని వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. అడ్వాన్స్‌గా ఇచ్చిన డబ్బులు ఇవ్వనంటూ బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయం గురించి అడగగా ఇంటి యజమాని దాడిచేశాడని, దీనిపై కాచిగూడ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశానని తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు విచారణలో ఉందన్నారు. గురువారం డీసీపీ కార్యాయం వద్ద జబర్దస్‌ వినోద్‌ కొంత హంగామా చేయగా.. డీసీపీ హెచ్చరించి పంపినట్లు తెలిసింది.

Updated Date - 2021-04-09T14:42:53+05:30 IST