జేఏసీ.. జానారెడ్డి యాక్షన్‌ కమిటీ!

ABN , First Publish Date - 2021-04-11T08:00:44+05:30 IST

రాష్ట్రంలో ఎలక్షన్లను కలెక్షన్లుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎంపీ రేవంత్‌రెడ్డి విమర్శించారు.

జేఏసీ.. జానారెడ్డి యాక్షన్‌ కమిటీ!

  • దాంతోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది
  • ఎలక్షన్లను కలెక్షన్లుగా మార్చిన ఘనత కేసీఆర్‌దే: రేవంత్‌

పెద్దవూర, ఏప్రిల్‌ 10: రాష్ట్రంలో ఎలక్షన్లను కలెక్షన్లుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎంపీ రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ఒకసారి నాగార్జునసాగర్‌లో పర్యటించిన సీఎం కేసీఆర్‌.. టీఆర్‌ఎస్‌ ఓటమిని గ్రహించారన్నారు. అందుకే ఆయన రెండోసారి నియోజకవర్గానికి వస్తున్నారని చెప్పారు. పెద్దవూర మండలం పులిచర్లలో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఏపీలో ఎమ్మెల్యేలు చనిపోతే వారి కుటుంబసభ్యుల్లో ఒకరిని ఎమ్మెల్యేగా ఎంపిక చేసే సంప్రదాయాన్ని తుంగలో తొక్కింది టీఆర్‌ఎస్సేనని విమర్శించారు. పలు సర్వేలు చేసి, జానారెడ్డి మీద ఎవరూ గెలవరని గ్రహించిన తర్వాతే నోముల భగత్‌కు టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇచ్చారని చెప్పారు. చిన్నపరెడ్డి, గుత్తా, కోటిరెడ్డి పేర్లను పరిశీలించిన తర్వాత భగత్‌కు టికెట్‌ ఇచ్చి అవమానించారని తెలిపారు. ఇందుకు సీఎం కేసీఆర్‌ క్షమాపణలు చెప్పి సాగర్‌లో పర్యటించాలన్నారు. నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని చెబుతున్న కేసీఆర్‌.. నామినేషన్‌ వేసి ప్రచారం చేయకుండా ఉందామన్న జానారెడ్డి సవాల్‌ను ఎందుకు స్వీకరించలేదో చెప్పాలని ప్రశ్నించారు. జేఏసీ అంటే జానారెడ్డి యాక్షన్‌ కమిటీ అని, ఆ కమిటీతోనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందని చెప్పారు. జానారెడ్డి సమైక్య రాష్ట్రానికి సీఎం అయ్యే అవకాశాన్ని కూడా వదులుకుని, తెలంగాణ సాధనకు కష్టపడ్డారని తెలిపారు. తెలంగాణ సమాజాన్ని కాపాడేందుకు జానారెడ్డికి ఓటేసి గెలిపించాలని ఆయన కోరారు.

Updated Date - 2021-04-11T08:00:44+05:30 IST