పనసపొట్టుతో పసందైన రుచులు

ABN , First Publish Date - 2021-09-18T05:36:14+05:30 IST

షుగరు వ్యాధిని అదుపులో పెట్టడానికి ఆహార ద్రవ్యంగా ఉపయోగపడే కూరగాయల్లో పనస ముఖ్యమైంది. కొన్ని ప్రాంతాల్లో దీన్ని ’చెక్క‘ అని కూడా పిలుస్తారు...

పనసపొట్టుతో పసందైన రుచులు

షుగరు వ్యాధిని అదుపులో పెట్టడానికి ఆహార ద్రవ్యంగా ఉపయోగపడే కూరగాయల్లో పనస ముఖ్యమైంది. కొన్ని ప్రాంతాల్లో దీన్ని ’చెక్క‘ అని కూడా పిలుస్తారు. తమిళం, మళయాళంలో కూడా ఇదే పేరు ప్రసిద్ధి. పనస అనేది సంస్కృత పదం. పనస పండ్లజాతికీ కూరగాయల జాతికి రెండింటికీ చెందినది. కూరగాయగా పనసతో గోదావరి జిల్లాలవారికి పరిచయం ఎక్కువ. తక్కినవారికి తక్కువ. పనసపండు వచ్చినంతగా కూరగాయల మార్కెట్టుకు పనసకాయలు రావటం లేదు. వాడకం తక్కువ కావటమే ఇందుకు కారణం. తరచూ పనసకాయ కూర తినేవారికి షుగరు వ్యాధి భయం ఉండదు. ‘లఘు పిత్తహరం వృష్యం వాతఘ్నం దీపనం పాచనం పనస్య ఫలన్త్విదమ్‌’ అంటూ నలుడు పనసపొట్టుకూర గుణాలు అనేకం వివరించాడు. ‘‘ఇది తేలికగా అరుగుతుంది, వేడిని తగ్గిస్తుంది, లైంగిక సమర్థతని పెంచుతుంది, వాతదోషం పోగొడుతుంది, బలాన్నిస్తుంది, జీర్ణశక్తి నిస్తుంది, చక్కగా అరిగేలా చేస్తుంది, రుచిగా ఉంటుంది, మలమూత్రాలు చక్కగా అయ్యేలా చేస్తుంది, రక్తంలో దోషాలను పోగొడుతుంది. శరీరంలో ఎసిడిటీని తగ్గిస్తుంది’’ అని వివరించాడు.

లేత పనస పైన తోలు వలిచి లోపల కాయని సన్నని ముక్కలుగా తరుగుతారు. దీన్నే పనసపొట్టు అంటారు. అందుకు ప్రత్యేకమైన కత్తి, ప్రత్యేకమైన విధానాలున్నాయి. కొట్టిన పనసపొట్టు అప్పుడప్పుడూ మార్కెట్లోకి వస్తుంటుంది. పనసకాయతో 4 రకాలుగా కూరలు చేసుకునే విధానాలను పాకదర్పణం గ్రంథంలో నలమహారాజు వివరించాడు. ఈ నాలుగు రకాలూ ముఖ్యంగా వాతవ్యాధుల్ని షుగరు వ్యాధిని, స్థూలకాయాన్ని, తగ్గించి జీర్ణశక్తిని కాపాడతాయి.


పనసపొట్టు వేపుడు కూర 

బాగా లేత పనసకాయని ముక్కలుగా కొట్టిన  పనసపొట్టును ఒక పాత్రలోకి తీసుకుని పసుపు, ఇంగువ, ధనియాలపొడి ఆ పొట్టుతో కలిపి నీళ్లుపోసి ఉడికించాలి. ఉడికిన ఈ పనసపొట్టులో నీరంతా పిండి, వాటిలో పెద్ద ముక్కలు ఏమైనా ఉంటే చిన్నవిగా తరిగి ఒక పాత్రలోకి తీసుకోవాలి. అందులో మిరియాలపొడి, జీలకర్ర చేర్చి కొద్దిగా నెయ్యివేసి, పనసపొట్టు దోరగా వేగించి దింపుకోవాలి. చల్లారాక పచ్చకర్పూరం, కస్తూరి, కుంకుమపువ్వు, నిమ్మముక్కలు, మొగలి రేకులు ఇలాంటి పరిమళాలను చాలా స్వల్ప  మోతాదులో కలపాలి. ఈ కూర మొత్తాన్ని ఒక తెల్లని వస్త్రంలో మూటగట్టి, కాగుతున్న నేతిలో ఈ మూటని కాసేపు ఉడకనిచ్చి తీసేయాలి. ఇలా వండిన పనసపొట్టు వేపుడు కూర వేడి అన్నంలో తింటే చాలా బావుంటుంది.   


రెండవ విధానం: పనసపొట్టుని పైన చెప్పిన పద్ధతిలో ఇంగువ, పసుపు, ధనియాలపొడి వేసి ఉడికించి, నీటిని పిండిన తరువాత ఒక పాత్రలోకి తీసుకుని నెయ్యివేసి అందులో ఈ పనస పొట్టుని, మిరియాలపొడి, పసుపు, ధనియాలపొడి, జీలకర్రపొడి, ఇంగువ వగైరా సుగంధ ద్రవ్యాలను అలాగే, ఉడికించిన చింతపండు రసాన్ని, బెల్లం లేదా పంచదారనీ చేర్చి కొద్ది సేపు ఉడకనివ్వాలి. ఉప్పు, కారం, సుగంధ ద్రవ్యాలు ఏవి ఎంతెంత మోతాదులో కలుపుకోవాలో ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. ఇలా ఉడికిన కూరని పైన చెప్పిన పద్ధతిలో మూటగట్టి, ఆ మూటని కాగుతున్న నేతిలో ఉడకనిచ్చి తీసేయాలి. ఈ పనసపొట్టు పులుసుకూరలో కొద్దిగా ఆవపిండి కలిపి వండే అలవాటు తెలుగువారికి ఉంది.   


పనసపొట్టు పాయసం

పైన చెప్పినట్లే బాగా ఉడికించిన పనసపొట్టుని మిరియాలు, యాలకులు, నెయ్యి వేసి వేగించాలి. ఈ మొత్తాన్ని ఒక పాత్రలోకి తీసుకుని, కాచిన పాలు, కొబ్బరి తురుము, పంచదార, పచ్చకర్పూరం ఇతర పరిమళద్రవ్యాలు, జీడిపప్పు వగైరా కలిపి కొద్ది సేపు ఉడకనివ్వాలి. వేడి చల్లారకుండా భద్రపరచుకోవాలి. ఈ పాయసం అమితంగా చలువనిస్తుంది. పోషక విలువలను కలిగింది. పురుషుల్లో జీవకణాలు పెరిగేలా చేస్తుంది. బీపీ సమస్య ఉన్నవారికి, మూత్రవ్యాధులున్నవారికి మేలు చేస్తుంది. షుగరు వ్యాధి ఉన్నవారు కూడా పంచదార లేకుండా దీన్ని తీసుకోవచ్చు.


పనసపొట్టు చిక్కుడు గింజల తియ్యగూర

చిక్కుడు కాయ తొక్కలు వలిచేసి గింజలను మాత్రమే తీసుకుని, కడిగి, పనసపొట్టుతోపాటు పైన చెప్పిన పద్ధతిలో పసుపు వగైరా ద్రవ్యాలతో కలిపి ఉడికించి, నీరంతా పిండేయాలి. కొబ్బరి తురుము, కొద్దిగా పాలు, పిండివడియాలు, తెల్ల నువ్వులు వీటిని మెత్తగా నూరి, లేదా మిక్సీ పట్టాలి. అలాగే మిరియాలు, ఆవాలను కూడా మెత్తగా నూరి ఈ రెండింటిని పనసపొట్టు, చిక్కుడు గింజలతో కలిపి తగినన్ని పాలు పోసి ఈ మొత్తాన్ని ఉడకనివ్వాలి. స్టవ్‌ పైనుంచి దించిన తరువాత పచ్చకర్పూరం ఇతర సుగంధ ద్రవ్యాలను కలిపి వేడి చల్లారకుండా భద్రపరచుకోవాలి. పనసపొట్టు, చిక్కుడు గింజలు, పాలతో వండిన ఈ తియ్యగూర గుండె జబ్బులున్నవారికి బీపీ షుగరు ఉన్నవారికి మేలు చేస్తుంది. మనం మసాలా కూరలకు, అతిగా చింతపండు వేసిన పులుసుకూరలకు అలవాటు పడిపోయి ఇలాంటి తియ్యగూరలను మరిచిపోయాం. శ్రీనాథాదులు తియ్యగూరలను ప్రత్యేకంగా పేర్కొన్నారు. తియ్యగూర అంటే ఇలా ఉండాలి. తీపి కలపకుండా ఘాటు, పులుపు లేకుండా ఉంటుంది కాబట్టి ఇది ఏ మాత్రం హాని చేయదు. ఇలాంటి కూరలకు ఇప్పుడు మనం అలవాటు పడాలంటే ముందు మానసికంగా సిద్ధపడాలి. అతిగా ఉప్పు కారాలు లేని వంటకం కాబట్టి అన్ని వ్యాధుల్లోనూ తినదగినది. మంచి ప్రోటీన్‌ ఆహారం. 


‘‘బల్యం శుక్రపదం హంతి రక్తపిత్త క్షతక్షయాన్‌/ఆమం తదేవ విష్టంభి వాతలం తువరం లఘు’’ అని ఆయుర్వేద గ్రంథాల్లో పనస గురించి ఉంది. ఇది బలాన్నిస్తుంది. పురుషులలో వీర్యాన్ని, వీర్యకణాలను పెంచుతుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది. క్షీణింప చేసే వ్యాధుల్లో మేలు చేస్తుంది. గాయాలయిన వారికి, ఆపరేషన్లయిన వారికి ఇది మేలు చేస్తుంది. దీనికి గల వగరు రుచి వలన షుగరు వ్యాధిలోనూ, స్థూలకాయంలోనూ ఇది ఔషధంలా పనిచేస్తుంది. దీన్ని పరిమితంగానే తీసుకోవాలి. అతిగా తీసుకుంటే మలబద్ధకాన్ని కలిగిస్తుంది. వాతం చేస్తుంది.

Updated Date - 2021-09-18T05:36:14+05:30 IST