కౌశిక్‌రెడ్డికి జాక్‌పాట్‌!

ABN , First Publish Date - 2021-08-02T07:07:45+05:30 IST

పాడి కౌశిక్‌రెడ్డి జాక్‌పాట్‌ కొట్టారు..! కాంగ్రెస్‌ నుంచి బహిష్కరణకు గురై.. అధికార టీఆర్‌ఎ్‌సలో చేరిన పది రోజుల్లోనే ఆయనను ఎమ్మెల్సీ పదవి వరించింది.

కౌశిక్‌రెడ్డికి జాక్‌పాట్‌!

గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్‌ చేసిన కేబినెట్‌.. ఆమోదానికి సిఫారసు

హుజూరాబాద్‌ నేతను వరించిన అదృష్టం.. పార్టీలో చేరిన 10 రోజుల్లోనే పదవి

స్వల్ప వ్యవధిలో ఆ నియోజకవర్గానికి రెండు కీలక పదవులు

టీఆర్‌ఎస్‌ హుజూరాబాద్‌ అభ్యర్థిత్వంపై ఉత్కంఠ.. బీసీకి దక్కడం లాంఛనమే..!

రేసులో గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, పొనుగంటి మల్లయ్య, వకుళాభరణం


హైదరాబాద్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): పాడి కౌశిక్‌రెడ్డి జాక్‌పాట్‌ కొట్టారు..! కాంగ్రెస్‌ నుంచి బహిష్కరణకు గురై.. అధికార టీఆర్‌ఎ్‌సలో చేరిన పది రోజుల్లోనే ఆయనను ఎమ్మెల్సీ పదవి వరించింది. త్వరలో ఉప ఎన్నిక జరగనున్న హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నేత కావటం వల్లనే కౌశిక్‌రెడ్డికి ఈ అదృష్టం దక్కిం ది..! 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున హుజూరాబాద్‌ నుంచి పోటీ చేసిన కౌశిక్‌రెడ్డి, అప్పటి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఈటల రాజేందర్‌ చేతిలో ఓడిపోయారు. ఈ ఏడాది మే 2న భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో కేబినెట్‌ నుంచి బర్తర్‌ఫకు గురైన ఈటల, ఆ త ర్వాత టీఆర్‌ఎ్‌సను వీడారు. జూన్‌ 12న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ అయినప్పటి నుంచి ఈటలపై కౌశిక్‌రెడ్డి రాజకీయ ఆరోపణలు కొనసాగాయి. అదే సమయంలో మంత్రి కేటీఆర్‌తో కౌశిక్‌రెడ్డి ఒక ప్రైవేట్‌ కార్యక్రమంలో సన్నిహితంగా మెలిగిన ఫొటోలు బయటికి రావటం కలకలం సృష్టించింది.


కాంగ్రెస్‌ నేతగా ఉంటూ.. మంత్రి కేటీఆర్‌తో మంతనాలు సాగించటం వివాదాస్పదమైంది. ఆ తర్వాత కొద్ది రోజులకు హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తానేనంటూ ఆ యన నియోజకవర్గ పరిధిలోని ఓ వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడిన ఆడి యో బయటికి వచ్చింది. ఆ వెంటనే నాటకీయ పరిణామాల మధ్య కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్‌ నుంచి బహిష్కరణకు గురయ్యారు. తానే ఆ పార్టీ కి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అంతకుముందు హుజూరాబాద్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. కౌశిక్‌రెడ్డి తమ పార్టీలోకి వస్తారని, ఆయనే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి అవుతారనే సంకేతాలిచ్చారు. జూలై 21న కౌశిక్‌రెడ్డి.. సీఎం కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎ్‌సలో చేరారు. కాగా.. ఆదివారం సీఎం అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్‌.. గవర్నర్‌ కోటాలో ఖాళీగా ఒక ఎమ్మెల్సీ స్థానం భర్తీ కోసం పాడి కౌశిక్‌రెడ్డి పేరును ప్రతిపాదించింది. ఈమేరకు గవర్నర్‌ ఆమోదానికి సిఫారసు చేసింది. కేబినెట్‌ సిఫారసును గవర్నర్‌ ఆమోదించటం లాంఛనమే. కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీగా నామినేట్‌ అవ్వడమూ లాంఛనమే.! అయితే అనూహ్యంగా కౌశిక్‌రెడ్డికి పదవి దక్కటం టీఆర్‌ఎస్‌ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ పదవిపై పార్టీలో చాలా మంది ముఖ్య నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు వారంతా భర్తీ కావాల్సిన ఆరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలపై దృష్టి పెట్టారు.


హుజూరాబాద్‌కు రెండో పదవి..

హుజూరాబాద్‌ నియోజకవర్గానికి రోజుల వ్యవధిలో రెండు కీలకమైన పదవులు దక్కాయి. జూలై 21న సీఎం కేసీఆర్‌ ఇదే నియోజకవర్గానికి చెందిన బండా శ్రీనివా్‌సను ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించారు. ఇది రాష్ట్రస్థాయి నామినేటెడ్‌ పోస్టు. తాజాగా అదే నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎ్‌సలో చేరిన కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ పద వి కట్టబెట్టారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలోనే సీఎం కేసీఆర్‌ ఈ నిర్ణయాలు తీసుకున్నారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.


క్రికెట్‌ ఆటగాడు కూడా..!

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గం వీణవంకకు చెందిన 36 ఏళ్ల కౌశిక్‌రెడ్డి.. మంచి క్రికెట్‌ క్రీడాకారుడు. ఐసీసీ గుర్తింపు ఉండే భారత్‌-ఏ జట్టు తరఫున ఆడారు. కపిల్‌దేవ్‌ నిర్వహించిన ఇండియన్‌ క్రికెట్‌ లీగ్‌లో, దిలీప్‌, దేవ్‌ధర్‌, అండర్‌-16, అండర్‌-19 సౌత్‌జోన్‌, జోనల్‌ క్రికెట్‌ అకాడమీ, నేషనల్‌ క్రికెట్‌ ఆకాడమీల తరఫున ప్రముఖ టోర్నమెంటుల్లో మెరుపులు మెరిపించారు.


హుజూరాబాద్‌ అభ్యర్థి ఎవరు?

కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కటంతో హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో పోటీకి దిగే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎవరనే ఉత్కంఠకు తెర లేచింది. మారిన సమీకరణాల నేపథ్యంలో అక్కడ పార్టీ టికెట్‌ బీసీ సామాజిక వర్గానికి దక్కుతుందని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు అంచనా వేస్తున్నారు. అదే నియోజకవర్గానికి చెందిన టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, పార్టీ నేత పొనుగంటి మల్లయ్య(మున్నూరుకాపు), బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌ పేర్లు రేసులో ఉన్నాయి. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ ఈనెలాఖరులోగా వస్తుందనే అంచనాతోనే అక్కడ పైలెట్‌ ప్రాజెక్టుగా చేపట్టదల్చిన ‘దళిత బంధు’కు 16 నుంచి శ్రీకారం చుడుతున్నారు. ఈ మేరకు అక్కడ పార్టీ అభ్యర్థి పేరును కూడా కేసీఆర్‌ ప్రకటించే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు భావిస్తున్నారు.

Updated Date - 2021-08-02T07:07:45+05:30 IST