జగన్ సర్కార్‌కు దెబ్బ మీద దెబ్బ

ABN , First Publish Date - 2020-05-22T23:16:16+05:30 IST

ఏపీ ప్రభుత్వానికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. శుక్రవారం ఒక్క రోజే ప్రభుత్వానికి ముచ్చటగా మూడు సార్లు హైకోర్టులో ఆశాభంగం కల్గింది. వైసీపీని చిక్కుల్లో పడేసేలా హైకోర్టు తీర్పులు

జగన్ సర్కార్‌కు దెబ్బ మీద దెబ్బ

అమరావతి: ఏపీ ప్రభుత్వానికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. శుక్రవారం ఒక్క రోజే ప్రభుత్వానికి ముచ్చటగా మూడు సార్లు హైకోర్టులో ఆశాభంగం కల్గింది. వైసీపీని చిక్కుల్లో పడేసేలా హైకోర్టు తీర్పులు ఉన్నాయని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. చట్టాలను వక్రీకరిస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు జగన్ సర్కార్‌కు శాపాలవుతున్నాయని చెబుతున్నారు. ఇప్పటికే అనేక సార్లు ప్రభుత్వానికి హైకోర్టు చీవాట్లు పెట్టింది. అంతేకాదు కీలక తీర్పులిచ్చి... బాధితులకు హైకోర్టు అండగా నిలుస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 64 అంశాల్లో జగన్‌కు కోర్టు మొట్టికాయలు వేసిందని టీడీపీ నేతలు చెబుతున్నారు. 


శుక్రవారం ఉదయం పంచాయతీ కార్యాలయాలకు రంగులపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 623 జీవోను హైకోర్టు రద్దు చేసింది. సుప్రీం, హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా జీవో ఎందుకు ఇచ్చారో వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. సుప్రీం కోర్టు, హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా పంచాయతీ కార్యాలయలకు రంగుల వేయడం కోసం మరో జీవో ఇవ్వడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర పంచయతీ రాజ్ సెక్రెటరీతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. 


ఇక ఏబీ వెంకటేశ్వర రావు కేసులో కీలక తీర్పు ఇచ్చింది. టీడీపీ ప్రభుత్వంలో వెంకటేశ్వరరావు విజయవాడ కమిషనర్‌గా, ఇంటెలిజెన్స్ ఛీప్‌గా పనిచేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 8న వైసీపీ ప్రభుత్వం వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ విధించింది. ఆయన నిబంధనలు అతిక్రమించి నిర్ణయాలు తీసుకున్నారని ప్రభుత్వం విధుల్లో నుంచి తొలగించింది. ఆ తర్వాత ఆయన సస్పెన్షన్‌ను ప్రభుత్వం కొనసాగించింది. ఈ నేపథ్యంలోనే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్)ను వెంకటేశ్వరరావు ఆశ్రయించారు. సస్పెన్షన్‌కు సంబంధించి హైదరాబాద్‌లో ఉన్న క్యాట్‌... రాష్ట్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశాయని వెంకటేశ్వరరావుకు ఆదేశాలు జారీ చేసింది. క్యాట్ నుంచి ఉత్తర్వులు తీసుకున్న వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై నాలుగువారాల పాటు హైకోర్టు విచారణ జరిపింది.  కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గత వారం ప్రభుత్వం అఫడవిట్‌ను కోర్టులో దాఖలు చేసింది. ఈ కేసును విచారించిన కోర్టు వెంకటేశ్వరరావుపై హైకోర్టు సస్పెన్షన్ ఎత్తివేసింది. క్యాట్ ఆర్డర్‌ను కూడా న్యాయస్థానం పక్కనపెట్టింది. వెంకటేశ్వరరావు రిట్ పిటీషన్‌ను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం కీలక ఆదేశాలిచ్చింది. అలాగే సస్పెన్షన్ కాలం నాటి జీతభత్యాలను చెల్లించాలని హైకోర్టు స్పష్టం చేసింది.


అంతకుముందు డాక్టర్ సుధాకర్‌ వ్యవహారంపై హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. విశాఖ పోలీసులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని సీబీఐను ఆదేశించింది. 8 వారాల్లోగా విచారణ పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాల్లో తెలిపింది. సుధాకర్‌ శరీరంపై గాయాలున్న విషయం మేజిస్ట్రేట్‌ నివేదికలో ఉందని, ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో గాయాల ఊసే లేదని ధర్మాసనం పేర్కొంది. ప్రభుత్వ నివేదికను నమ్మడం లేదని... దీని వెనుక భారీ కుట్ర ఉందని భావిస్తున్నామని, ఈ కారణాలతో సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నట్టు తెలిపింది. 








Updated Date - 2020-05-22T23:16:16+05:30 IST