వివేకా హత్య రోజున.. అక్కడున్న వారంతా జగన్‌ సన్నిహితులే!

ABN , First Publish Date - 2021-04-09T08:51:21+05:30 IST

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి పులివెందులలో తన నివాసంలో హత్యకు గురైన తర్వాత అక్కడ ఉన్నవారందరూ జగన్‌రెడ్డి సన్నిహితులేనని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది...

వివేకా హత్య రోజున.. అక్కడున్న వారంతా జగన్‌ సన్నిహితులే!

  • సాక్ష్యాలను చెరిపేశారు..రక్తపు మరకలను కడిగించారు 
  • ఇప్పుడేమీ తెలియనట్లు నటిస్తున్నారు: వర్ల రామయ్య

అమరావతి, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి పులివెందులలో తన నివాసంలో హత్యకు గురైన తర్వాత అక్కడ ఉన్నవారందరూ జగన్‌రెడ్డి సన్నిహితులేనని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. సాక్ష్యాలను చెరిపివేయడం... హత్యను దాచిపెట్టే ప్రయత్నం చేసిందంతా వారేనని, ఇప్పుడు ఏమీ తెలియనట్లు అమాయకంగా నటిస్తున్నారని విమర్శించింది. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య గురువారమిక్కడ తమ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘వివేకా హత్య తర్వాత అక్కడ ఉన్న రక్తపు మరకలను జగన్‌రెడ్డి సన్నిహితులు కడిగించివేశారు. ఆధారం కనిపించకుండా ఉండేందుకు శవానికి కట్లు కట్టారు. జగన్‌రెడ్డి మామ గంగిరెడ్డి వచ్చి శవానికి కుట్లు వేశారు. ఠాగూర్‌ సినిమాలో మాదిరిగా మృతదేహానికి చికిత్స చేశారు. అక్కడకు వచ్చిన పోలీసులకు తాము చూసుకుంటామని చెప్పి పంపించేశారు. జగన్‌కు తెలియకుండా ఆయన మామ వచ్చి శవానికి కుట్లు వేస్తారా? సీబీఐ అధికారులు గంగిరెడ్డిని విచారించలేదు. హత్యలో ప్రధాన అనుమానితుడిగా కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి ఉన్నారు. ఆయన్ను సీబీఐ విచారించిందా? ఆయనకు లై డిటెక్టర్‌, నార్కో అనాలిసిస్‌ పరీక్షలు చేస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి. అవి జరగకుండా ముఖ్యమంత్రి అడ్డుపడుతున్నారు. అందుకే వివేకా కుమార్తె సునీత ఢిల్లీలో గడప గడపకూ న్యాయం కోసం తిరగాల్సి వస్తోంది. బలమైన శక్తులు ఈ కేసు విచారణకు అడ్డుపడుతున్నాయని ఆమె ఆరోపించారు. ఆ బలమైన శక్తి జగన్‌ మాత్రమే’ అని పేర్కొన్నారు.


సీబీఐ అధికారులు సీఎంను కూడా విచారించాలని డిమాండ్‌ చేశారు. నిజాలు బయటకు రావాలంటే ఇది తప్పదన్నారు. వివేకా హత్యపై విజయమ్మ పేరుతో విడుదలైన లేఖ రచయిత ముఖ్యమంత్రి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డేనని తెలిపారు. ఈ హత్య కేసులో దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి అనే అనుమానితుడు ముఖ్యమంత్రిని కలిశాడు. అనుమానితులు తనను ఎందుకు కలవాల్సి వస్తోందో జగన్‌రెడ్డి సమాధానం చెప్పాలని స్పష్టం చేశారు. తనకు బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ వచ్చాయని ఫిర్యాదు చేస్తే ఇంతవరకూ ఒక్క పోలీసు అధికారి కూడా దీనిపై తనతో మాట్లాడలేదని వర్ల అన్నారు. తాను బెదిరింపులకు భయపడే వాడిని కాదని, శుక్ర వారం ఉదయం పది గంటలకు విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లో నిలబడతానని.. ఆ కాల్స్‌ చేసిన వారు వచ్చి తనను చంపుకోవచ్చని వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-04-09T08:51:21+05:30 IST