Abn logo
Mar 2 2021 @ 02:59AM

అప్పుడు.. ఇప్పుడు!

నాడు విశాఖలో రన్‌వేపై జగన్‌ బైఠాయింపు

రిపబ్లిక్‌డే రోజున ‘హోదా’ కోసం ఆందోళన

అదే రోజు పెట్టుబడిదారుల సదస్సు

అడ్డుకున్న పోలీసులకు బెదిరింపులు

నేడు అధికారులపై మాటతూలని బాబు

నిబంధనలను గుర్తుచేస్తూనే ఆగ్రహం


(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి)

తిరుపతి విమానాశ్రయం లాంజ్‌లో పది గంటలపాటు నేలపై కూర్చుని నిరసన తెలిపిన నేటి విపక్ష నేత, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు!


సుమారు నాలుగేళ్ల క్రితం... విశాఖపట్నం విమానాశ్రయం రన్‌వేపై బైఠాయించి నిరసన తెలిపిన నాటి విపక్షనేత, నేటి ముఖ్యమంత్రి జగన్‌!


‘లెక్క తేల్చేశారు. అప్పుడు జగన్‌ను అడ్డుకున్నందుకు, ఇప్పుడు ప్రతీకారం తీర్చుకున్నారు’... అంటూ సోషల్‌ మీడియాలో నాటి, నేటి ఫొటోలను పక్కపక్కన పెట్టి షేర్‌ చేశారు. నాడు జరిగిన సంఘటనను నేటి ఘటనతో పోల్చారు. నిజానికి... అప్పుడు జగన్‌ నిరసనకు దిగిన సందర్భం, సమయం, ఆ రోజు ప్రాధాన్యం పూర్తిగా వేరు. ఇప్పుడు జరిగింది వేరు. ఆరోజున విశాఖలో ఏం జరిగిందో గుర్తుకు తెచ్చుకుంటే... 


అది 2017 జనవరి 26...

గణతంత్ర దినోత్సవం. దీంతోపాటు... విశాఖలో అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు మొదలవుతోంది. దేశ, విదేశాల నుంచి అతిథులు వస్తున్నారు. దాంతో విశాఖ విమానాశ్రయంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సరిగ్గా అదే రోజున, అదే విశాఖలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ భారీ ఆందోళన చేయనున్నట్లు నాటి విపక్ష నేత జగన్‌ ప్రకటించారు.  సదస్సు నిర్వహిస్తున్న ప్రాంతానికి సమీపంలోనే, బీచ్‌రోడ్డులో కొవ్వొత్తుల ర్యాలీ జరపాలని నిర్ణయించారు. ఇందుకోసం జగన్‌ తమ పార్టీ నేతలైన విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి తదితరులతో జనవరి 26వ తేదీ ఉదయం హైదరాబాద్‌ నుంచి విమానంలో విశాఖ వచ్చారు. పెట్టుబడిదారుల సదస్సు జరుగుతున్న సమయంలో ఆందోళన చేయడానికి రావడంతో పోలీసు అధికారులు జగన్‌ను అడ్డుకున్నారు.


నగరంలోకి రానీయకుండా రన్‌వే దగ్గరే ఆపేసి వెనక్కి వెళ్లిపోవాలని సూచించారు. ఇందుకు జగన్‌ నిరాకరించారు. పార్టీ నేతలతో కలిసి రన్‌ వేపైనే కొద్దిసేపు బైఠాయించారు. ఆ తర్వాత విమానాశ్రయంలోకి కదిలారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై విరుచుకుపడ్డారు. ‘మీరు కాబోయే సీఎంని టచ్‌ చేస్తున్నారు. రెండేళ్లలో సీఎంను అవుతా. మీ అందరినీ గుర్తు పెట్టుకుంటా. ఎవరినీ  వదిలిపెట్టను’ అంటూ వేలు చూపించి హెచ్చరించారు.


‘ఎలా బిహేవ్‌ చేయాలో తెలియని వారు పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో ఎలా ఉన్నారయ్యా?’ అని మండిపడ్డారు. ‘డొమెస్టిక్‌ ఎరైవల్స్‌ని లాంజ్‌లోకి పంపించరా? ఏయ్‌ డోర్‌ ఓపెన్‌ చేయించవయ్యా! పంపించకపోతే... ఆ బోర్డు పీకిపారేయండి’ అంటూ ఆగ్రహోదగ్రుడయ్యారు. పెద్ద పెద్ద కేకలు వేస్తూ పోలీసుల మీదకు వెళ్లి  దాడి చేసినంత పనిచేశారు. పోలీసు అధికారులను నానా మాటలు అంటూ... తాను అధికారంలోకి వస్తే అందరి పని పడతానని హెచ్చరించారు. ఆ తర్వాత పోలీసులు జగన్‌ను మరో విమానాశ్రయంలో విశాఖ నుంచి తిప్పి పంపించారు. ఇదీ అప్పుడు విశాఖలో జరిగింది!


నేడు... మాట జారని చంద్రబాబు

సోమవారం అకారణంగా తనను అడ్డుకున్నప్పటికీ... చివరికి కలెక్టర్‌, ఎస్పీలను కలిసేందుకూ అంగీకరించనప్పటికీ చంద్రబాబు అధికారులపై మాట తూలలేదు. ఆగ్రహంగా మాట్లాడారే తప్ప... దూషణలకు దిగలేదు. నియమ నిబంధనల గురించి ప్రశ్నించడమే తప్ప... పోలీసు అధికారులను బెదిరించడం, హెచ్చరించడం చేయలేదు. దీంతో అప్పటి జగన్‌ ప్రవర్తన, నేటి చంద్రబాబు తీరుపై అధికార వర్గాల్లోనూ చర్చ జరిగింది.

Advertisement
Advertisement
Advertisement