కేసుల దడతోనే ఫిర్యాదు ‘కుట్ర’

ABN , First Publish Date - 2020-10-13T08:06:54+05:30 IST

ఏపీ సర్కారు తప్పుడు ఉద్దేశాలతోనే న్యాయ వ్యవస్థపై బురద జల్లుతోందని...

కేసుల దడతోనే  ఫిర్యాదు ‘కుట్ర’

విచారణ వేగవంతంతో వణుకు

సుప్రీం మార్గదర్శకాలతో ‘పరేషాన్‌’

అందుకే జస్టిస్‌ రమణపై ఆరోపణలు

జగన్‌ది కోర్టు ధిక్కారమే: నిపుణులు

జాతీయ పత్రికల్లోనే ప్రత్యేక కథనాలు


(న్యూఢిల్లీ - ఆంధ్రజ్యోతి): ఏపీ సర్కారు తప్పుడు ఉద్దేశాలతోనే న్యాయ వ్యవస్థపై బురద జల్లుతోందని... న్యాయమూర్తులపై ఆరోపణలు ఇందులో భాగమేనని జాతీయ స్థాయిలో పలువురు న్యాయ నిపుణులు తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి జగన్‌ కచ్చితంగా కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని సీనియర్‌ న్యాయవాదులను ఉటంకిస్తూ పలు జాతీయ పత్రికలు ప్రత్యేక కథనాలను ప్రచురించాయి. దేశ వ్యాప్తంగా నేరచరితులైన ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ ఏడాదిలోపు ముగించాలని జస్టిస్‌ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయించిన సమయంలోనే... స్వయంగా కేసులు ఎదుర్కొంటున్న జగన్‌, అదే న్యాయమూర్తిపై బురదజల్లేందుకు ప్రయత్నించడాన్ని కొందరు సీనియర్‌ న్యాయవాదులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘‘ఈ వ్యవహార శైలిని మొగ్గలోనే తుంచేయకపోతే భవిష్యత్తులో కేసులు ఎదుర్కొనే ప్రతి నాయకుడూ జడ్జిలపై లేనిపోని ఆరోపణలు చేసి న్యాయ వ్యవస్థనే భ్రష్టుపట్టిస్తారు’’ అని పేర్కొన్నారు. ఈ అంశంపై వివిధ పత్రికలు సోమవారం ప్రచురించిన ప్రత్యేక కథనాల్లోని ముఖ్యాంశాలివి... 


రాజకీయ అజెండాతోనే!..డాక్టర్‌ జీవీ రావు, సీనియర్‌ న్యాయవాది

‘‘త్వరలో ప్రధాన న్యాయమూర్తి కానున్న ఒక వ్యక్తిపై ఏ ముఖ్యమంత్రీ ఇంత అసాఽధారణమైన రీతిలో లేఖ రాయలేదు. జగన్‌ అనవసరమైన వివాదాన్ని లేవనెత్తారు. మీడియా ముందు న్యాయమూర్తులపై ఆరోపణలు చేయడం రాజకీయ అజెండాగా కనిపిస్తోంది. తనపై క్రిమినల్‌, అవినీతి ఆరోపణలు ఉన్న ఒక ముఖ్యమంత్రే ఇలాంటి బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారంటే, కచ్చితంగా కుతంత్రంతో  వ్యవహరిస్తున్నారని స్పష్టమవుతోంది. ఇలాంటి దురుద్దేశపూరిత ప్రయత్నాలను మొగ్గలోనే తుంచేయాలి. 


శిక్ష పడక తప్పదు!..ఉత్సవ్‌ బన్సల్‌, సీనియర్‌ న్యాయవాది

‘‘వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి  సీబీఐ, ఈడీ కేసుల్లో శిక్షపడక తప్పదు. ఒక సాధారణ దొంగలాగా న్యాయమూర్తిని, ధర్మాసనాన్ని నిందిస్తున్నారు.


జస్టిస్‌ రమణ కుమార్తెలు తప్పు చేయలేదు: టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా

రాష్ట్ర విభజన తర్వాత అమరావతి రాజధాని అవుతుందని ప్రచారం జరగడంతో వేలాదిమందితోపాటు జస్టిస్‌ రమణ కుమార్తెలు కూడా స్థానికంగా ఒక ప్రాపర్టీ డీలర్‌ నుంచి భూమి కొన్నారని తమ పరిశీలనలో తేలిందని ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’  ఢిల్లీ నుంచి ఒక కథనం ప్రచురించింది. తాము అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించామని ఆ పత్రిక తెలిపింది. ‘‘ఆ ప్రాంతంలో రాజధాని వస్తుందన్న ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. 2014లోనే కేంద్రమంత్రి పనబాక లక్ష్మి అమరావతి రాజధాని ప్రతిపాదన ముందుకు తెచ్చారు. తెలుగుదేశం నుంచి వచ్చిన సమాచారం ప్రకారమే జస్టిస్‌ రమణ కుమార్తెలు ఆ భూమిని కొన్నారన్న వాదనలో పస లేదు.


2015 జూన్‌లోనే ఆ భూమి కొనుగోలు చేశారు’’ అని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినిధి ధనుంజయ మహాపాత్ర తన కథనంలో తెలిపారు. నేర చరితులపై కేసుల విచారణను వేగవంతం చేసేందుకు జస్టిస్‌ రమణ బెంచ్‌ ప్రయత్నిస్తుందనే... జగన్మోహన్‌ రెడ్డి ఆందోళన చెంది ఉండవచ్చునని ఈ కథనంలో అభిప్రాయపడ్డారు. ‘‘నిజానికి ఈ కేసు చాలా రోజులుగా సాగుతోంది. దీనిని జస్టిస్‌ గొగోయ్‌ జస్టిస్‌ బాబ్డేకు అప్పగించారు. అయితే, ఈ కేసులో జస్టిస్‌ బాబ్డే కుమార్తెలు వాదిస్తుండటంతో యాదృచ్ఛికంగానే అది జస్టిస్‌ రమణ బెంచ్‌కు వెళ్లింది’’ అని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కథనం వెల్లడించింది.


జగన్‌కు శిక్ష తప్పదు!.. అశ్వనీ కుమార్‌ ఉపాధ్యాయ, నేర నేతలపై సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసిన ప్రముఖ న్యాయవాది

‘‘ఇది న్యాయవ్యవస్థను, ఉన్నత న్యాయస్థానాన్ని బ్లాక్‌ మెయిల్‌ చేసేందుకు చేస్తున్న ప్రయత్నం. నేరచరితులపై కేసును విచారిస్తున్నందువల్లే జస్టిస్‌ ఎన్వీ రమణపై బురదచల్లేందుకు జగన్‌ ప్రయత్నించారు. ప్రధాన న్యాయమూర్తికి తాను రాసిన లేఖ వివరాలను బయటపెడితే జస్టిస్‌ రమణ ఈ కేసును వదిలిపెడతారని, మరొకరు విచారిస్తారని జగన్‌ భావిస్తున్నట్లు కనపడుతోంది. దేశమంతటా మొత్తం ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఉన్న కేసులను ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు విచారిస్తాయి. దేశంలో ఏ ఎమ్మెల్యే, ఎంపీ ఆందోళన చెందకున్నా... కేవలం జగన్‌ మాత్రమే ఎందుకు పరేషాన్‌ అవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఆయన ఇలా లేఖ రాయడం కోర్టు ధిక్కారం కిందకు వస్తుంది. కోర్టు తదుపరి విచారణలో ఈ విషయం లేవనెత్తుతాను. జగన్‌ చేసిన పాపాలకు ఫలితం అనుభవించక తప్పదు. ఆయన ఆంధ్రప్రదేశ్‌ను దోపిడీ చేశారు. ఎన్ని కుతంత్రాలు పన్నినా ఆయనకు తగిన శిక్ష పడుతుంది’’


విచారణ వేగంతోనే.. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌

తనపై సీబీఐ, ఈడీ కేసుల్లో విచారణ వేగవంతంగా జరుగుతున్న నేపథ్యంలోనే జగన్మోహన్‌ రెడ్డి... జస్టిస్‌ రమణకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసినట్లు స్పష్టమవుతోందని ‘ద ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌’ మొదటి పేజీలో కథనాన్ని ప్రచురించింది. జగన్‌, విజయసాయి రెడ్డి ప్రభృతులపై కేసుల విచారణ సాగుతున్న తీరును, సుప్రీంకోర్టు దేశ వ్యాప్తంగా నేరచరితులపై విచారణను వేగవంతం చేయడాన్ని ఈ పత్రిక గుర్తుచేసింది. ఈనెల 9వ తేదీన సంబంధిత కేసులో ప్రొసీడింగ్స్‌ పునరుద్ధరించిన మరుసటిరోజునే జగన్‌ ముఖ్య సలహాదారు ప్రెస్‌మీట్‌ పెట్టడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది.


జస్టిస్‌ రమణ శైలి వేలెత్తి చూపేలా లేదు: టెలిగ్రాఫ్‌

‘‘నేర చరితులైన ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ వేగవంతం చేయాలని జస్టిస్‌ రమణ ఆధ్వర్యంలోని బెంచ్‌ అన్ని హైకోర్టులను ఆదేశించింది.  అందుకే జగన్‌  ఆయనను లక్ష్యం చేసుకున్నారని న్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి’’ అని కోల్‌కతా నుంచి వెలువడే ‘టెలిగ్రాఫ్‌’ పత్రిక మరో కథనాన్ని ప్రచురించింది. నిజానికి ఈ అంశం 2017 నుంచి పెండింగ్‌ లో ఉన్నదని తెలిపింది. జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే 16 నెలలు జైలులో ఉండి బెయిల్‌పై బయటకు వచ్చారని, ఆయన స్వయంగా ఆదాయానికి మించిన ఆస్తులు,  అవినీతి నిరోధక చట్టాల కింద పలు కేసులు ఎదుర్కొంటున్నారని ‘టెలిగ్రాఫ్‌’ తెలిపింది. ‘‘హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు విచారణ ముగిసే దశలో ఉన్న సమయంలో ఈ లేఖ రాయడం గమనార్హం.  ఈ కేసుల్లో శిక్ష పడితే ఆయనకు రాజకీయ భవిష్యత్తు చాలాకాలం లేకుండా పోతుంది. తన శిక్షాకాలం తర్వాతి నుంచి ఏడేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలుండదు’’ అని గుర్తు చేసింది. గత ఆరేళ్లుగా ప్రధాన న్యాయమూర్తులుగా పదవీ బాధ్యతలు చేపట్టే వారిపై ఇలా బురదచల్లేందుకు పద్ధతి ప్రకారం ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది.


‘‘జస్టిస్‌ రమణ తన బాధ్యతలను నెరవేర్చే క్రమంలో ఎలాంటి సందేహాస్పద శైలికి ఆస్కారం ఇవ్వలేదని పలువురు న్యాయమూర్తులు మా పత్రికకు తెలిపారు. జస్టిస్‌ రమణ కుమార్తెలు భూమిని కొనుగోలు చేయడంలో ఎలాంటి తప్పు లేదని  సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తుల్లో ఒకరు చెప్పారు. దేశంలో అందరు పౌరుల మాదిరిగానే... న్యాయమూర్తుల పిల్లలకు కూడా భూమిని కొనుగోలు చేసే హక్కు ఉంది. అది నేరమెలా అవుతుందని ఆయన ప్రశ్నించారు’’ అని టెలిగ్రాఫ్‌ వెల్లడించింది. ఇక... న్యాయవ్యవస్థ గురించి బహిరంగంగా వెల్లడించడం కోర్టు ధిక్కారం కిందే వస్తుందని ‘ది వైర్‌’ వ్యాఖ్యానించింది. ప్రశాంత్‌ భూషణ్‌ ట్వీట్లే కోర్టు ధిక్కారమైనప్పుడు జగన్‌ చేసిన తీవ్రమైన వ్యాఖ్యలు కూడా కోర్టు ధిక్కారమే అవుతాయని తెలిపింది.

Updated Date - 2020-10-13T08:06:54+05:30 IST