పిల్ల చాడీలు.. కోరి పేచీలు!

ABN , First Publish Date - 2020-10-13T08:03:26+05:30 IST

జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక పాత పథకాలు అనేకం రద్దు చేశారు. కొన్ని పాత పథకాలకే కొత్తగా మార్పులు చేసి, కొత్త పేర్లు పెట్టారు.

పిల్ల చాడీలు.. కోరి పేచీలు!

‘న్యాయం’గా చూస్తే!

అక్కసు, ఆక్రోశంతోనే హైకోర్టు జడ్జిలపై ఫిర్యాదులు!

లేఖలోని అంశాలు చూసి న్యాయవర్గాల్లో విస్మయం

బిహార్‌లోనూ నిక్కచ్చిగా వ్యవహరించిన జస్టిస్‌ రాకేశ్‌

సహ న్యాయమూర్తులపైనే విచారణకు ఆదేశం

పలు అంశాల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు

ఇప్పుడు ఆయనపైనా జగన్‌ సర్కారు ఫిర్యాదు

చంద్రబాబు ‘నో’ అన్న న్యాయమూర్తిపైనా ఆక్రోశమే

పాత లెక్కలతో కొత్తగా జస్టిస్‌ సత్యనారాయణపై లేఖ?

వైసీపీ పెద్దల వ్యవహారంపై విస్తృతంగా చర్చ


జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక పాత పథకాలు అనేకం రద్దు చేశారు. కొన్ని పాత పథకాలకే కొత్తగా మార్పులు చేసి, కొత్త పేర్లు పెట్టారు. సరి కొత్తగా పలు పథకాలు ప్రవేశపెట్టారు. వీటిలో దేనినీ హైకోర్టు అడ్డుకోలేదు, తప్పు పట్టలేదు. కానీ, ఆయా పథకాల విషయంలో లోపాలున్నాయనో, తమకు అన్యాయం జరిగిందనో ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే మాత్రమే వాదనలు ఆలకించి, అందులోని మెరిట్స్‌ ఆధారంగా ఆయా అంశాలపై తీర్పులు చెప్పింది. ఉదాహరణకు... వితంతు పింఛనును హైకోర్టు తప్పు పట్టలేదు. కానీ, తమకు పింఛను ఇవ్వడంలేదంటూ కోర్టును ఆశ్రయించిన కేసులో ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించింది. ‘భర్త ఉండగా ఎవ్వరూ వితంతువుగా చెప్పుకోరు. ఎందరికో పింఛన్లు ఇస్తున్నారు.


వీరికీ ఇవ్వండి’ అని హైకోర్టు సూచించింది. అంతేతప్ప మొత్తం పథకాన్ని ఆపమనలేదు. కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాలకు రంగులు వేసుకుంటామంటే అడ్డుకోలేదు. నేషనల్‌ బిల్డింగ్‌ కోడ్‌కు విరుద్ధంగా రాజకీయ పార్టీ రంగులు వేయడాన్ని మాత్రమే తప్పు పట్టింది. ఇళ్ల పట్టాలకు భూసేకరణను అడ్డుకోలేదు. నిబంధనలకు విరుద్ధంగా దేవదాయ భూములు, ఆవ భూములు తీసుకోవడాన్ని మాత్రమే అడ్డుకుంది. అసలు విషయం ఇదికాగా... కోర్టు తమకు కళ్లెం వేస్తోందని, ఏ పథకాన్నీ అమలు చేయనివ్వడంలేదని ప్రభుత్వ పెద్దలు కలరింగ్‌ ఇవ్వడంపైనే అభ్యంతరం వ్యక్తమవుతోంది.


(అమరావతి - ఆంధ్రజ్యోతి):ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సుప్రీం కోర్టు జడ్జిలు, పలువురు హైకోర్టు న్యాయమూర్తులపై చేసిన ఫిర్యాదులు స్కూలు పిల్లల చాడీలను గుర్తుకు తెస్తున్నాయని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. బడిలో అల్లరి పిల్లాడు తరచూ పక్క పిల్లలపై ఎదురు ఫిర్యాదు చేసే తరహాలో... తమ  ప్రభుత్వం తీసుకున్న చట్ట విరుద్ధ నిర్ణయాలను తప్పుపట్టిన న్యాయమూర్తులపై ముఖ్యమంత్రి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజే)కి ఫిర్యాదు చేసినట్లుందని చెబుతున్నారు. తన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు, జత పరిచిన పత్రాల్లోని కేసులను పరిశీలిస్తే... కనీస పరిణతి, పరిజ్ఞానం ప్రదర్శించకుండా, డొల్లతనాన్ని చాటుకున్నట్లు తేలిపోయిందని ఒక న్యాయ నిపుణుడు వ్యాఖ్యానించారు.


‘‘ఫలానా కేసులో ఆ న్యాయమూర్తి నా ప్రభుత్వాన్ని కోపగించుకున్నారు. ఈ కేసులో నాకు అడ్డుపడ్డారు. ఇంకో కేసులో స్టే ఇచ్చారు. ఇంకో కేసులో నోటీసులు ఇచ్చారు’’ అంటూ జగన్‌ ఏకరువు పెట్టిన తీరు హాస్యాస్పదంగా ఉందని అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా నేర నేతల కేసులను సత్వరం పరిష్కరించాలన్న నేపథ్యంలోనే... స్వయంగా అనేక కేసులు ఎదుర్కొంటున్న జగన్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణను లక్ష్యంగా చేసుకున్నారని జాతీయ స్థాయిలో న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇక... హైకోర్టు జడ్జిల్లోనూ కొందరి మీద జగన్‌ బురదజల్లారు.


బిహార్‌ నుంచి వచ్చినా...

జగన్‌ భారత ప్రధాన న్యాయమూర్తికి పంపిన లేఖలో కొన్ని ఆరోపణలు చేస్తూ.. వాటికి రుజువులంటూ ఒక అనుబంధ నోట్‌ను కూడా జతచేశారు. అందులో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌పై విమర్శలు గుప్పించారు. రాకేశ్‌ కుమార్‌ తమ ప్రభుత్వంపై గట్టిగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆక్రోశించారు. జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ బిహార్‌కు చెందిన వారు. వైసీపీ పెద్దలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారెవరితోనూ ఆయనకు ఎప్పుడూ, ఎక్కడా సంబంధాల్లేవు. పైగా జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌కు నిఖార్సైన న్యాయమూర్తిగా పేరుంది. ప్రభుత్వాలపై ఆయన సూటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు.


బిహార్‌లో జడ్జిగా పని చేస్తున్నప్పుడు అనేక కేసుల్లో  ప్రభుత్వాన్ని చీల్చి చెండాడారు. సహ న్యాయమూర్తులపై ఆరోపణలు వచ్చినా సహించలేదు. వారిపై విచారణకు ఆదేశించారు. ఇక... విచారణ సందర్భంగా న్యాయమూర్తులు వ్యాఖ్యలు చేయడం సర్వసాధారణం.  జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ ఇటీవలి కాలంలో కొన్ని కేసుల్లో ప్రభుత్వ, పోలీసుల వైఖరిని తప్పుపట్టారు. కోర్టు ఎన్నిసార్లు, ఎన్ని రకాలుగా చెప్పినా పోలీసు వైఖరిలో మార్పులేకపోవడం, న్యాయకోసం ఆశ్రయిస్తున్న బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో తీవ్ర వ్యాఖ్యలే చేశారు. బిహార్‌లో తాను పనిచేసినప్పుడు గమనించిన అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. ఫలానా అంశంలో తప్పులు జరుగుతున్నాయని కోర్టు ఎత్తిచూపినప్పుడు...  సరిదిద్దుకునే బదులు, ‘మాకే నీతులు చెబుతారా? మమ్మల్నే విమర్శిస్తారా!’ అని కోర్టులపై ప్రభుత్వం ఎదురుదాడికి దిగడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు.


చంద్రబాబు వ్యతిరేకించిన జడ్జిపైనా!

‘కరకట్టపై చంద్రబాబు నివసిస్తున్న లింగమనేని గెస్ట్‌హౌస్‌ కృష్ణా  వరదలో మునిగిపోతుంటే దాన్ని ఖాళీచేయాలని ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. దీనిపైనా హైకోర్టు స్టే ఇచ్చింది’’ అంటూ జగన్‌ తన ఫిర్యాదులో ఆక్రోశించారు. నిజానికి... ఈ అంశంపై మొదట స్టే ఇచ్చింది జస్టిస్‌ కొంగర విజయలక్ష్మి. ఆమెను హైకోర్టు జడ్జిగా ప్రతిపాదించేందుకు చంద్రబాబు వ్యతిరేకించారు. అయినప్పటికీ కేసులో ఉన్న అంశాలను పరిశీలించి ఆమె నిర్ణయం తీసుకున్నారే తప్ప... పాత విషయాలను పట్టించుకున్న దాఖలాలు లేవు. కేవలం కేసు, దానిలో ఉన్న మెరిట్‌ ఆధారంగానే స్టే ఇచ్చారు. ఆ తర్వాత ఆ కేసు వేరే జడ్జిల ముందుకు  వెళ్లింది. అక్కడా స్టే కొనసాగుతోంది. దానిని కూడా జగన్‌ తన ‘అజెండా’ కోసం వాడుకోవడం గమనార్హం. అసలు విషయం ఏమిటంటే... ఈ గెస్ట్‌హౌ్‌సపై స్టే రావడానికి ముందే దానికి అటూ ఇటూ ఉన్న కొన్ని ఇతర భవనాల యజమానులు కూడా స్టే తెచ్చుకున్నారు. ఆ విషయాన్ని సీఎం తన లేఖలో దాచిపెట్టారు. 


నోటీసు ఇస్తే ఘోరం, నేరం!

కేసులలో ప్రతివాదులకు న్యాయస్థానాలు నోటీసులు జారీ చేయడం సర్వ సాధారణం. కానీ... ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వడమే తప్పు అనేలా జగన్‌ సీజేకు ఫిర్యాదు చేశారు. ఆయన తన లేఖలో టెలిఫోన్‌ ట్యాపింగ్‌ కేసును కూడా ప్రస్తావించారు. ‘ఆంధ్రజ్యోతి’లో ఈ కథనం వచ్చాక ఒక పిల్‌ దాఖలైందని, దాని ఆధారంగా ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారని సీఎం తన లేఖలో వాపోయారు. నోటీసు ఇవ్వడం తప్పెలా అవుతుందో, అది ప్రభుత్వానికి అప్రదిష్ట ఎలా అయిందో సీనియర్‌ న్యాయవాదులకు  సైతం అంతుచిక్కడం లేదు. వాస్తవానికి ఈ కేసులో రాష్ట్ర హైకోర్టు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. ఏ తరహా విచారణకూ ఆదేశించలేదు. కేవలం పిల్‌కు సంబంధించిన అంశాలపై ప్రతివాదులకు నోటీసులు మాత్రమే జారీ చేసింది. దీనికే ప్రభుత్వం ఉలిక్కిపడడం ఎందుకనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. 


రంగుల కల చెదిరిందనా? 

‘కుదరదు. ఇది తప్పు’ అని తెలిసినప్పటికీ... రాష్ట్ర ప్రభుత్వం పంతాలకు పోయి కొన్ని నిర్ణయాలు తీసుకుంది. అందులో ముఖ్యమైనవి... ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడం, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌ కుమార్‌ను అర్ధంతరంగా తొలగించడం. ఈ రెండు నిర్ణయాల్లో ప్రభుత్వం చట్టాలను, న్యాయ సూత్రాలను ఉల్లంఘించింది. ఫలితంగా కోర్టుల్లో వ్యతిరేక తీర్పులు వచ్చాయి. సర్కారు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ అక్కసుతోనే జడ్జిలపైనా, న్యాయ వ్యవస్థపైనా ప్రభుత్వం విరుచుకుపడుతోందన్న ఆరోపణలు  వినిపిస్తున్నాయి. నిమ్మగడ్డ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత దూకుడుగా వెళ్లిందనే  వాదనలున్నాయి. ఆయన తనకు భద్రత కావాలంటూ రాసిన లేఖ ఎక్కడి నుంచో వచ్చిందంటూ దీనిపై సీఐడీ విచారణ మొదలుపెట్టింది.


‘ఆ లేఖ నేనే రాశాను’ అని ఆయనే స్వయంగా అంగీకరించినప్పటికీ... ఎస్‌ఈసీ అధికారులను తీసుకెళ్లి తాము ‘ఆశించిన’ సమాధానం రాబట్టేలా ఒత్తిడి తీసుకొచ్చారు. తన కార్యాలయ సిబ్బందిని వేధిస్తున్నారని, కంప్యూటర్‌ హార్డ్‌ డిస్కులను తీసుకెళ్లారని, లేఖ రాసింది తానే అని తెలిపినా పట్టించుకోకుండా పెట్టిన కేసును కొట్టివేయాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తదుపరి చర్యలపై స్టే ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జగన్‌ తన ఫిర్యాదులో దీనిని కూడా తప్పు పట్టారు.


ఈనాటి ఈ కోపం ఏనాటిదో!

వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వలేదనే కక్ష

జస్టిస్‌ సత్యనారాయణ మూర్తిపై ఊహాజనిత ఆరోపణలు

ముఖ్యమంత్రి జగన్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సత్యనారాయణ మూర్తిపైనా ఫిర్యాదు చేశారు. దీనిపై న్యాయవర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ఉమ్మడి హైకోర్టు నుంచీ న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్‌ సత్యనారాయణ మూర్తిపై పాత సంగతులు మనసులో ఉంచుకునే... కొత్తగా ఊహాజనిత ఆరోపణలు చేశారని భావిస్తున్నారు. అక్రమాస్తుల కేసుల్లో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలన్న వైఎస్‌ జగన్‌ పిటిషన్లను అప్పట్లో జస్టిస్‌ సత్యనారాయణ మూర్తి కొట్టివేశారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కుదరని, స్వయంగా హాజరు కావాలని 2016లో సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. ఆ తర్వాత 2017 ఆగస్టు 31న జస్టిస్‌ సత్యనారాయణ మూర్తి ఇదే తరహా తీర్పు వెలువరించారు. కేసు తీవ్రతను బట్టి ఆ క్వాష్‌ పిటిషన్‌ను కొట్టేశారు. ఆ కక్ష మనసులో పెట్టుకొనే ఆయనపై సుప్రీం కోర్టు సీజేకు జగన్‌ ఫిర్యాదు చేశారని న్యాయవర్గాలు పేర్కొంటున్నాయి.

Updated Date - 2020-10-13T08:03:26+05:30 IST