అప్పుకోసం తప్పు!

ABN , First Publish Date - 2021-04-09T08:18:53+05:30 IST

ప్రజల నుంచి పన్నుల రూపంలో వచ్చే ఆదాయాన్ని ఖర్చుపెట్టేందుకు ఒక పద్ధతి ఉంటుంది. కానీ... వైఎస్‌ జగన్‌ సర్కారు దానిని తుంగలో తొక్కి, పన్ను ఆదాయాన్ని పక్కకు మళ్లించేందుకు ఒక కొత్త మార్గం కనుగొంది. అదే... ‘ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్‌ లిమిటెడ్‌’!...

అప్పుకోసం తప్పు!

  • రాష్ట్ర సర్కారు ఆర్థిక ఉల్లంఘన
  • మద్యం ఆదాయంతో ‘అభివృద్ధి కార్పొరేషన్‌’
  • దానిని హామీగా చూపించి 18వేల కోట్ల రుణం
  • ప్రజల పన్నులు మళ్లించడం చట్ట విరుద్ధం
  • పన్ను ఆదాయం సర్కారు ఖజానాకే వెళ్లాలి
  • తర్వాత ఆ మొత్తాన్ని ఖర్చు చేసుకోవాలి
  • కార్పొరేషన్‌కు గ్రాంటు ఇచ్చేందుకే వీలు
  • పన్నుల సొమ్ముతో సోకు కుదరదు

ఇది ఎక్కడా కనలేదు. ఎప్పుడూ వినలేదు! అప్పులు తెచ్చేందుకు అనుసరిస్తున్న సరికొత్త పంథా! ఒక పద్ధతిగా ఖర్చు పెట్టాల్సిన ప్రజల సొమ్ముతోనే అప్పుల సోకు చేసుకుంటున్న వింత వైఖరి! పార్లమెంటు చట్టాలకు విరుద్ధంగా జరుగుతున్న భారీ ఆర్థిక ఉల్లంఘన! అదేమిటో... ఎలా సాగుతోందో... మీరూ చూడండి!



(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ప్రజల నుంచి పన్నుల రూపంలో వచ్చే ఆదాయాన్ని ఖర్చుపెట్టేందుకు ఒక పద్ధతి ఉంటుంది. కానీ... వైఎస్‌ జగన్‌ సర్కారు దానిని తుంగలో తొక్కి, పన్ను ఆదాయాన్ని పక్కకు మళ్లించేందుకు ఒక కొత్త మార్గం కనుగొంది. అదే... ‘ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి  కార్పొరేషన్‌ లిమిటెడ్‌’! ఇది అచ్చంగా అప్పులు తెచ్చేందుకు సృష్టించిన సంస్థ! ఎడాపెడా తెచ్చుకునే అప్పులకు దీని ఆదాయాన్ని ‘గ్యారెంటీ’గా చూపించారు.  అసలు... ఈ సంస్థకు ఎలా ఆదాయం వస్తుందంటారా? దీనికోసం మద్యం అమ్మకాలపై అదనంగా 10 శాతం రిటైల్‌ ట్యాక్స్‌ విధించారు. ఆ మొత్తాన్ని నేరుగా కార్పొరేషన్‌ ఖాతాలో జమ చేస్తున్నారు. అలా ఈ సంస్థకు ఒక ‘ఆదాయాన్ని’ సృష్టించి, దానినే హామీగా చూపించి రూ.21,500 కోట్లు అప్పు తెచ్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో ఇప్పటికే రూ.18వేల కోట్లు అప్పు తెచ్చుకున్నారు.


పద్ధతి వదిలి... పక్కకు

పన్ను ఆదాయాన్ని ఎలా ఖర్చు చేయాలనే అంశంపై స్పష్టమైన నిబంధనలున్నాయి. పన్ను ఆదాయం రాష్ట్ర ఖజానాలోకి మాత్రమే చేరాలి. ఆ తర్వాతే ప్రభుత్వం ఆ నిధులను నిబంధనల మేరకు రాష్ట్రం కోసం ఖర్చు పెట్టాలి. ఒకవేళ కార్పొరేషన్‌కు ఇవ్వాలనుకుంటే ఖజానా నుంచి గ్రాంటు రూపంలో మాత్రమే ఇవ్వాలి. గ్రాంటు అంటే రెగ్యులర్‌గా ఉండే ఆదాయం కాదు.  అది ప్రభుత్వ ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. మొత్తంగా చూస్తే... ప్రభుత్వ కార్పొరేషన్లు సొంతంగా ఆదాయం సంపాదించుకోవచ్చు. లేదా, సొంతంగా అప్పులు తెచ్చుకోవచ్చు. అదీకాకపోతే... ప్రభుత్వమే గ్రాంటు రూపంలో కార్పొరేషన్‌కు నిధులు ఇవ్వొచ్చు. అంతేతప్ప... ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేసే పన్నులను నేరుగా ఒక కార్పొరేషన్‌ ఖాతాకు జమ చేయడం కుదరదు. ఇప్పుడు... ప్రభుత్వానికే బ్యాంకులు అప్పులు ఇచ్చేందుకు సాహసించడంలేదు. ‘‘తీసుకున్న అప్పు తిరిగి ఎలా చెల్లిస్తారు?’’ అని ప్రశ్నిస్తున్నాయి. దీనికి సమాధానంగానే ప్రభుత్వం ‘‘మద్యంపై అదనపు పన్ను విధించి, దాన్ని నేరుగా రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్‌కు జమ చేస్తాం. ఆ ఆదాయం స్థిరంగా వస్తుంది. దానిని హామీగా ఉంచుకుని అప్పు ఇవ్వండి’’ అంటూ బ్యాంకుల నుంచి వేల కోట్లు అప్పుగా తీసుకొచ్చారు.


ఇష్టారాజ్యం కుదిరేనా?

పన్ను కట్టేది ప్రజలు. అది వెళ్లాల్సింది ప్రభుత్వానికి. కానీ... అలాకాకుండా, మరో పక్షమైన ‘రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్‌’కు మళ్లిస్తున్నారు. ఒకరకంగా... ఇది ‘ఎస్ర్కో’ వంటి ఖాతా’లో జమ చేయడమే. ప్రభుత్వానికి చెందిన ప్రతి ప్రాజెక్టుకు, ఆదాయం వచ్చే శాఖలకు ఎస్ర్కో ఖాతాలు ఉంటాయి. సంబంధిత ఆదాయం తొలుత ఈ ఖాతాలోనే జమ అవుతుంది. మద్యంపై వచ్చే ఆదాయం కూడా ఎక్సైజ్‌ శాఖకు చెందిన ఎస్ర్కో ఖాతాలోనే జమ కావాలి. ఆ తర్వాత అది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు జమ అవుతుంది. కానీ... అలాకాకుండా, నేరుగా రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్‌ ఖాతాకు మళ్లిస్తున్నారు. ఇందుకు చట్టాలు అంగీకరించవని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు... జీఎస్టీ అమలు కోసం ఏర్పాటైన కౌన్సిల్‌కు పన్నులకు సంబంధించిన సవరణలు చేయడానికి, నిధులపై నిర్ణయాలు తీసుకోవడానికి తొలుత ఎలాంటి అధికారం ఉండేది కాదు. దానికి సంబంధించిన పన్ను చట్టాలకు పార్లమెంటు ఆమోదం పొందిన తర్వాతే జీఎస్టీ కౌన్సిల్‌కు కొన్ని అధికారాలు కట్టబెట్టారు. అలాంటిది రాష్ట్రస్థాయిలో పన్నులకు సంబంధించిన నిధులు రాష్ట్ర ఖజానాకు కాకుండా మరో కార్పొరేషన్‌ ఖాతా (ఎస్ర్కో)కు మళ్లించేందుకు అనుమతించే అధికారం (సోర్స్‌ ఆఫ్‌ పవర్‌) లేనేలేదు. అయినప్పటికీ దానిపై కేబినెట్‌ నిర్ణయం తీసుకోవడం, దానికి అనుగుణంగా అధికారులు జీవోలు ఇవ్వడం దారుణమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు చట్టవిరుద్ధంగా మళ్లిస్తున్న పన్నులే ‘రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్‌’కు ఆధారం. ప్రత్యేకంగా ఆస్తూలూ లేవు, ఇతర కార్యకలాపాలూ లేవు. ఇప్పుడు తెస్తున్న అప్పులను  ఐదేళ్ల తర్వాతో పదేళ్ల తర్వాతో తిరిగి చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ ప్రభుత్వం మారితే... పాత విధానాన్ని కొనసాగిస్తుందనే గ్యారంటీ ఉందా? ఇప్పుడున్న ప్రభుత్వమే దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పింది! అప్పుడు... ‘అభివృద్ధి కార్పొరేషన్‌’కు ఆదాయం ఎలా? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు! ఏ పెట్టుబడి కార్యకలాపాలు చూపించి వేల కోట్ల రుణాలు తెచ్చుకుంటున్నారని అకౌంటెంట్‌ జనరల్‌ ఇప్పటిదాకా ప్రశ్నించలేదు. భవిష్యత్తులో ప్రశ్నించే అవకాశం ఉంది. అప్పుడు ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి!


తీవ్ర ఆర్థిక ఉల్లంఘనే!

‘‘భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని గ్యారెంటీగా చూపించి ప్రస్తుత ప్రభుత్వం అప్పులు తీసుకోవడం కుదరదు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కార్పొరేషన్‌ను అచ్చంగా అప్పులు తెచ్చేందుకే సృష్టించారు. రిటైల్‌ ఎక్సైజ్‌ ఆదాయాన్ని చూపించి రూ.20వేల కోట్లు అప్పు తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే... తీవ్ర ఆర్థిక ఉల్లంఘన అవుతుంది’’

- ఐవైఆర్‌ కృష్ణారావు, మాజీ సీఎస్‌

Updated Date - 2021-04-09T08:18:53+05:30 IST