వెక్కిరిస్తున్న వెలితి గిన్నె

ABN , First Publish Date - 2021-01-09T06:23:58+05:30 IST

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల అభ్యున్నతికి తోడ్పడం లేదు. అధికారంలోకి రాక ముందు ప్రజలకు వెండిగిన్నె చూపించిన వారు అధికారంలోకి వచ్చిన తరువాత పేదల ముందు వెలితి గిన్నెపెట్టారు...

వెక్కిరిస్తున్న వెలితి గిన్నె

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల అభ్యున్నతికి తోడ్పడం లేదు. అధికారంలోకి రాక ముందు ప్రజలకు వెండిగిన్నె చూపించిన వారు అధికారంలోకి వచ్చిన తరువాత పేదల ముందు వెలితి గిన్నెపెట్టారు. జగన్మోహన్ రెడ్డి ఆడిన ఓటు ఆటలో ఓటర్లే పరాజితులు!


వైసీపీ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అట్టహాసంగా ప్రారంభించింది. అయితే అమలు చేయ డంలో చతికిలపడింది. దృఢసంకల్పం కొరవడడంతో సంక్షేమం సంక్షోభంలో పడింది. మేడిపండు వంటి నవరత్నాలను ప్రజల ముందు పెట్టి మామిడిపండ్లుగా ఊదరకొడుతున్నారు. ఒక్క పథకం కూడా ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ఉపయోగపడేది కాదు. జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాల లక్ష్యం స్వార్థ రాజకీయమే గానీ పేదల అభ్యున్నతి ఎంతమాత్రం కాదు. బలహీనవర్గాలకు జగన్ ప్రభుత్వం చేసేది గోరంత, చెప్పుకునేది కొండంత! నవరత్నాలను మొదలుపెట్టిన దగ్గరనుంచే వాటి భారం తగ్గించుకోవడానికి సర్కార్ సాకులు వెతుకుతూనే ఉంది. నిధుల కొరత పేరుతో అనేక పథకాలపై నీళ్ళు చల్లుతున్నారు. లక్షల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఊరించారు  కానీ, ఖాళీల భర్తీకి ఎలాంటి కార్యాచరణ లేదు. నవ్యాంధ్రలో అభివృద్ధి అంతా నిరుద్యోగాభివృద్ధి మాత్రమే అనడంలో అతిశయోక్తి లేదు. అధికారంలోకి రావడానికి వెన్నుదన్నుగా నిలిచిన అన్నివర్గాల వారికి వెన్ను చూపారు. 


మానవవనరుల అభివృద్ధిలో విద్య ముఖ్యభూమిక పోషిస్తుంది. ఉదాహరణకు బడుగు బలహీన వర్గాల యువత కోసం ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వారికి ఎంతగానో తోడ్పడుతుంది. కానీ, ఆ పథకానికి జగన్ ప్రభుత్వం మంగళం పాడింది. దాంతో దానిపై ఆధార పడిన పేద విద్యార్థుల భవిష్యత్ అయోమయంలో పడింది. విద్యపై పెట్టే పెట్టుబడి సమాజ వికాసానికి, శాశ్వత అభివృద్ధికి ఉపయోగ పడుతుంది. సామాజిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, బీసీ సంక్షేమం, అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమం, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం ఇత్యాది పథ కాల ద్వారా అన్నివర్గాల ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం ఆదుకున్నది.


2014-–15 నుంచి 2018–-19 వరకు ఏటా 16 లక్షల మంది ఏస్సీ, ఎస్టీ, బీసీ, ఈబిసీ, కాపు, మైనార్టీ, దివ్యాంగ విద్యార్థులకు రూ. 12,833 కోట్లు ఖర్చుచేసింది. విదేశీ విద్య కోసం 4,528 మంది విద్యార్థులకు రూ. 3,777 కోట్లు ఆర్థిక సాయం అందించింది. ఎన్టీఆర్ విద్యోన్నతి ద్వారా సివిల్స్‌కు సన్నద్ధమయ్యే పేద విద్యార్థులకు రూ. 142 కోట్లు అందజేసింది. 2019లో పేదలకు అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఆకలి, అవసరాలు తీర్చని పథకాలతో ప్రజలను దారుణంగా దగా చేస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తెచ్చిన ఫీజ్ రీయింబర్స్‌మెంట్ పథకాన్ని జగన్ సర్కార్ రద్దు చేయడం దారుణం. చంద్రబాబు ప్రభుత్వం ఒక్కో విద్యార్థి విదేశాల్లో చదువుకునేందుకు రూ. 15 లక్షలు ఇచ్చి ప్రోత్సహించింది. ఈ ప్రభుత్వం దానికి మంగళం పాడింది. జగన్ పథకాలు ఎంత వంచనాత్మకమైనవో. అన్ని పథకాల ఖర్చు, అమలు తీరు చూస్తే అర్థమవుతుంది. పేదల ఇళ్ల నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో (2018–-19లో) రూ. 3,189 కోట్లు ఖర్చు చేస్తే, అదే వైసీపీ మొదటి ఏడాది పాలనలో కేవలం రూ. 963కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. బిసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటి సంక్షేమానికి 2018-–19లో చేసిన వ్యయం రూ. 6,149కోట్లు ఉంటే, దాన్ని 2019–-20లో రూ.3,382 కోట్లకు తగ్గించింది వైసీపీ ప్రభుత్వం.


సబ్ ప్లాన్ నిధుల వ్యయంలో ప్రస్తుత ప్రభుత్వం పెద్దఎత్తున కోతలు పెట్టింది. సాంఘిక సంక్షేమ రంగానికి 2019–-20 బడ్జెట్ అంచనాలు రూ. 75,465కోట్లు కాగా, రివైజ్డ్ అంచనాలను రూ.66,047కోట్లకు తగ్గించారు. ఇది మరింతగా కోతపడే అవకాశం లేకపోలేదు. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను నవరత్నాలలో కలిపేశారు. 2018–-19లో ఎస్సీ సబ్‌ప్లాన్‌కు గత ప్రభుత్వం రూ. 9,000 కోట్లు ఖర్చు చేయగా 2019-–2020లో జగన్ ప్రభుత్వం రూ. 4,370 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇందులో పింఛన్లు, అమ్మఒడి కింద ఖర్చు మినహాయిస్తే నికరంగా ఖర్చు చేసింది రూ. 3,373 కోట్లు మాత్రమే. బీసీ సబ్‌ప్లాన్‌కు రూ.15,800 కోట్లు ఖర్చు చేసినట్లు చూపించారు. ఇందులో పింఛన్లు, అమ్మఒడి కింద ఇచ్చిన ఖర్చు తీసేస్తే బీసీలకు నికరంగా ఖర్చు చేసింది రూ. 2,200 కోట్లు మాత్రమే. గత ప్రభుత్వం పింఛన్లతో సంబంధం లేకుండా బీసీ సబ్‌ప్లాన్‌కు రూ. 10,000 కోట్లు ఖర్చు చేసింది. అంకెల గారడీలతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను జగన్ సర్కార్ దగా చేస్తోంది. 


అన్నదాత సుఖీభవ పథకాన్ని రైతు భరోసాలో కలిపినట్లుగానే, అమ్మఒడిలో మరి కొన్ని పథకాలను కలిపేశారు. పసుపు-కుంకుమ, నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, పండుగ కానుకలు, పెళ్ళికానుకలు, విదేశీ విద్య, చంద్రన్న బీమా తదితర పథకాలను, ఆదరణ పథకాన్ని రద్దు చేశారు. కళాకారుల పింఛన్లు, డప్పు ఆర్టిస్టుల పింఛన్లు, ఎయిడ్స్ రోగుల పింఛన్లను కూడా తొలగించారు. అన్నివర్గాలకు ఇచ్చే పెన్షన్లు, అమ్మఒడి తదితర పథకాల నిధులను బిసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటి సంక్షేమంలో చూపించి దగా చేస్తున్నారు. ఉమ్మడి పథకాల్లోని నిధులనే భాగాలుగా విడదీసి సంక్షేమం పద్దులో చూపుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలనే కాకుండా కాపులు, బ్రాహ్మణులు ఇతరవర్గాల ప్రజలను కూడా దారుణంగా మోసం చేస్తున్నారు. కేంద్రప్రభుత్వ సంక్షేమ పథకాలను సైతం రాష్ట్ర పథకాల్లో కలిపేశారు.


పాత వాటికి ముందు వైఎస్సార్ పేరు చేర్చి కొత్త పథకాలుగా నమ్మిస్తున్నారు. బలహీనవర్గాల నుంచి ప్రత్యేకంగా ఎస్సీల నుంచి, అసైన్డ్ భూములను లాక్కున్నారు. గత ప్రభుత్వం కన్నా అత్యధిక నిధులు వ్యయం చేసి పేదలకు మంచి చేయాల్సింది పోయి, చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల వినియోగంలో మూడింట 2వంతులు కూడా ఖర్చుచేయలేక పోయారు. దాదాపు రూ.6వేల కోట్ల నరేగా నిధులు వాడుకోలేక పోవడం వల్ల పేదలు ఆ మేర పనులు కోల్పోయారు. ఆహార వస్తువుల ధరలు ఆకాశంలో విహరిస్తున్నాయి. పేద, మధ్య తరగతి ప్రజల జీవనం దుర్భరంగా మారింది. రైతాంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. తుఫానులు, వరదలు, అధిక వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని మాటల్లో, పత్రికా ప్రకటనల్లో తప్ప చేతల్లో ఆదుకున్నది లేదు.


మానవాభివృద్ధి సూచికల్లో ఇప్పటికే మనరాష్ట్రం 27వ స్థానంలో ఉంది. తలసరి ఆదాయం ప్రభావం జిఎస్‌డిపిపై గణనీయంగా ఉంటుంది. 2018–-19లో అంతకు ముందు సంవత్సరాల్లో ఉన్న రెండంకెల వృద్ధిరేటు 2019-–20లో ఒక అంకెకు పడిపోయింది. కన్జ్యూమర్ ప్రెస్ ఇండెక్స్ ద్రవ్యోల్బణం 6.5 శాతం వల్ల బలహీనవర్గాల కొనుగోలు శక్తి క్షీణించింది, పొదుపు శక్తి పతనమైంది. ఫలితంగా పేదరికం పెరిగింది; దీని ప్రభావం రాబోయే తరాలపై పడనుంది. కొద్దిమంది చేతుల్లోనే సంపద అంతా కేంద్రీకృతం కావడం వల్ల ధనిక పేద తారతమ్యాలు పెరగడంతోపాటుగా, అందరికీ సమాన అవకాశాలు మృగ్యమవుతాయి. ఈ పరిస్థితి సమాజంలో అశాంతికి దారితీస్తుంది. ఎన్నికల ముందు వివిధ వర్గాల ప్రజలకు బేషరతు హామీలు, పథకాలు ప్రకటించి అధికారంలోకి వచ్చాక అనేక నిబంధనలు విధించి వీలయినంత మేర లబ్ధిదారుల సంఖ్యను కుదించి ఆ మేరకు ఖర్చు తగ్గించుకున్నారు. ప్రతి పథకం అరకొరగా అమలవుతోందే తప్ప ఏ పథకం కడుపు నింపేది కాదు, అవసరం తీర్చేది కాదు. ప్రజలకు వెండిగిన్నె చూపించి అధికారంలోకి వచ్చాక ప్రజల ముందు వెలితి గిన్నె పెట్టారు. అధికారం కోసం జగన్మోహన్ ఆడిన ఓటు ఆటలో ఓడింది ఓటేసిన ప్రజలేనని చెప్పాలి.


నీరుకొండ ప్రసాద్

Updated Date - 2021-01-09T06:23:58+05:30 IST