Abn logo
Sep 28 2021 @ 03:25AM

జగన్‌ ‘గ్రాఫ్‌’ తగ్గుతోంది

  • 15% పడిపోయినట్టు సర్వేలో వెల్లడి
  • వైసీపీలో షర్మిలకు అన్యాయం జరిగింది
  • పవన్‌ విమర్శలను సమర్థిస్తున్నా: రఘురామ


న్యూఢిల్లీ, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): ఏపీలో సీఎం జగన్‌రెడ్డి అనాలోచిత ప్రజావ్యతిరేక విధానాల వల్ల ఆయన పరిపాలనా గ్రాఫ్‌ క్రమంగా తగ్గుతోందని ఎంపీ రఘురామరాజు అన్నారు. ప్రస్తుతానికి జగన్‌ పరిపాలనా గ్రాఫ్‌ 15 శాతం తగ్గినట్లు తాను నిర్వహించిన ఒక సర్వేలో తేలిందన్నారు. సోమవారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. జగన్‌ హయాంలో ఏపీ అప్పులపాలైందని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాల వల్ల పార్టీకి ప్రజాదరణ తగ్గుతోందన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలను చూసి, వైసీపీ నేతలు వాపును చూసి బలుపు అనుకోవద్దని వ్యాఖ్యానించారు. జగన్‌ సోదరి షర్మిలకు వైసీపీలో అన్యాయం జరిగిందని, కానీ వెన్నుపోటన్న పెద్ద మాట చెప్పలేనని వ్యాఖ్యానించారు. ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే్‌లో షర్మిల చాలా వరకు నిజాలు చెప్పారనే భావిస్తున్నానన్నారు. రాజ్యసభ సభ్యత్వం కోసం జగనన్నను తాను అడగలేదని షర్మిల చెప్పారని, ఆమె తరఫున ఇంకెవరైనా అడిగి ఉంటారని అన్నారు. అప్పటి నుంచి వారిరువురి మధ్య విభేదాలు మొదలైనట్లు భావిస్తున్నానన్నారు.


2019 ఎన్నికలకు ముందు షర్మిల చేపట్టిన ప్రచార సభలకు, పాదయాత్రకు జగన్‌రెడ్డితో సమానంగా జనం ఆదరించి, హాజరయ్యేవారని అన్నారు. వైసీపీలో తనకు సభ్యత్వమే లేదని ఆమె చెప్పడం తనకు ఆశ్చర్యం కలిగిందన్నారు. జగనన్న అందర్నీ చెల్లెమ్మల్లా భావిస్తుంటారని అనుకుంటున్నప్పటికీ, ఒక చెల్లెమ్మ(సునీత) తన తండ్రిని కిరాతకంగా చంపేశారని గగ్గోలు పెడుతుంటే, మరో చెల్లెమ్మ(షర్మిల) పొరుగు రాష్ట్రంలో వేరే పార్టీ పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. దీంతో సొంత చెల్లెమ్మలను కూడా పట్టించుకోవడం లేదన్న విమర్శలు జగనన్నపై వస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఆస్తుల పంపకం తరహాలో ుఏపీ నీది.. తెలంగాణ నాది్‌ అన్నట్టుగా.. మీరు మీరు(జగన్‌, షర్మిల) రెండు రాష్ర్టాలను పంచుకున్నట్లుగా చర్యలున్నాయంటూ సోషల్‌ మీడియాలో రకరకాలుగా కామెంట్లు వచ్చాయని అన్నారు. కేసుల  నుంచి జగనన్న కడిగిన ముత్యంలా బయటకు వస్తారని షర్మిల స్పష్టంగా చెప్పకపోవడం పట్ల అనేక సందేహాలున్నాయన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తాజా గా చేసిన వ్యాఖ్యలను పూర్తిగా సమర్థిస్తున్నట్లు చెప్పారు. సినీ పరిశ్రమలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న పవన్‌.. ప్రభుత్వ జోక్యాన్ని నిరసించడంలో అర్థం ఉందన్నారు. సాగుచట్టాలకు వ్యతిరేకంగా నిర్వహించిన భారత్‌ బంద్‌ విషయంలో వైసీపీ ద్వంద్వ విధానం అనుసరిస్తున్నదన్నారు.