జగన్ ఏడాది మిథ్యా పాలన

ABN , First Publish Date - 2020-05-31T05:48:57+05:30 IST

వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఏడాది కాలాన్ని పూర్తి చేసుకున్నది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పాలన మిథ్యగా మారింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సాధించిన అభివృద్ధిని చెరిపేయడమే లక్ష్యంగా వైసీపీ పాలన సాగింది...

జగన్ ఏడాది మిథ్యా పాలన

ముఖ్యమంత్రి  జగన్ గారూ,  ఏడాది పాలనలో   మీరు దాదాపు 67 సార్లు  హైకోర్టు చేత మొట్టికాయలు తిన్నారు.   ఇది మీకు గానీ, రాష్ట్రానికి  గానీ   ప్రతిష్ఠాకరమేనా? హైకోర్టు తీర్పులను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇకనైనా రాజ్యాంగ   విహితంగా  సుపరిపాలన  అందించాలి. 


వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఏడాది కాలాన్ని పూర్తి చేసుకున్నది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పాలన మిథ్యగా మారింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సాధించిన అభివృద్ధిని చెరిపేయడమే లక్ష్యంగా వైసీపీ పాలన సాగింది. ప్రజావేదిక కూల్చడం, ప్రతిపక్షంలో ఉంటూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలపై మాటమార్చడం, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దింపడంతో సరిపోయింది. రాజధాని అమరావతి నిర్మాణాన్ని, పోలవరం ప్రాజెక్టును నిలిపివేశారు. తద్వారా రాష్ట్ర అభివృద్ధి కుంటుపడడానికి ముఖ్యమంత్రి జగన్ కారకులయ్యారు. పలు పథకాల రద్దుతో ప్రజాసంక్షేమానికి తిలోదకాలిచ్చారు.


మరి ఏడాదికాలంలోనే ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత మిన్నంటడంతో ఆశ్చర్యమేముంది? పేదలకు పట్టెడన్నం పెట్టే అన్న క్యాంటీన్లు మూసివేశారు. వేల ఎకరాలకు నీరందించే పోలవరం ప్రాజెక్టు పనులను నిలిపివేసి, రివర్స్ టెండరింగ్ పిలవడం తుగ్లక్ చర్యను సూచిస్తోంది. విద్యుత్ పిపిఏ లను రద్దు చేయడం-కోర్టు మొట్టికాయలు వేయించుకోవటం మొదలై అనేక విషయల్లో కోర్టులు తప్పుపట్టడం సర్వసాధారణమైంది.పేదవారైన క్రైస్తవ, ముస్లిం, హిందువులకు అందించే క్రిస్మస్ కానుక,రంజాన్ తోఫా, సంక్రాంతి సంబరాలను రద్దు చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల నిధులను నిర్వీర్యం చేయడంలో జగన్ తన తండ్రి రాజశేఖర్ రెడ్డి తరహాలో వ్యవహరిస్తున్నారు. వేరే పథకాల నిధులను అమ్మ ఒడికి తరలించారు. ఉమ్మడిగా ఉన్న ఎస్సీ కార్పొరేషన్ ను విభజించి మూడు- మాదిగ,మాల,రెల్లి- కార్పొరేషన్లుగా కాకుండా కో ఆపరేటివ్ సొసైటీ గా ఏర్పాటు చేశారు. 


మూడు రాజధానులు ఏర్పాటుకు పూనుకున్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు ప్రశ్నిస్తే మహిళలు పిల్లలు అని కూడా లేకుండా నిర్బంధించి దాడి చేస్తున్నారు.రాజధాని భూములను పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇస్తానని ప్రచారం చేసి ఆందోళనకు తెరదీశారు. మూడు రాజధానుల బిల్లు శాసనమండలిలో పాస్ అవ్వలేదని శాసనమండలిని రద్దు చేయడానికి రాజ్యాంగవ్యతిరేక చర్యలకు సిద్ధమయ్యారు. ప్రభుత్వానికి సహకరించలేదని మండలి చైర్మన్ షరీఫ్ ను మత దూషణతో ముస్లింగా ఎలా పుట్టావు అని దూషించడం దారుణమైన విషయం. స్థానిక సంస్థల ఎన్నికల కోసం షెడ్యూల్ రిలీజ్ అయితే ప్రతిపక్షాన్ని లేకుండా చేయడం కోసం దాడులతో ఏకగ్రీవం చేసుకోవడానికి తెదేపా అభ్యర్థులపై దాడికి సిద్ధపడ్డారు. 


వైసీపీ ప్రభుత్వం వస్తే వృద్ధులకు, వితంతువులకు రూ.3000 పెన్షన్ ఇస్తానని చెప్పి రూ.3000 వరకు ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతామని మాట మార్చారు.ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని చెప్పి మాట మార్చారు. డ్వాక్రా మహిళల రుణాలు రద్దు చేస్తానని చెప్పి చేయకపోవడం వైసీపీకే చెల్లింది. మద్యపాన నిషేధం అమలుపరుస్తానని చెప్పి మద్యం తయారీ కంపెనీలతో పర్సంటేజీ మాట్లాడుకొని నాణ్యత లోపించిన బ్రాండ్లను అధిక ధరలకు అమ్ముతున్నారు. రాష్ట్ర,దేశ ప్రజలు కరోనా వలన ఇబ్బంది పడుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వెయ్యి రూపాయల కరువు భత్యం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని అబద్ధాలు చెప్పారు.


కరోనా వలన కేంద్రం ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా పేద ప్రజలు తినడానికి కూడు లేక ఉన్న సమయంలో మద్యం షాపులను తెరచి అధిక ధరలకు మద్యం అమ్ముతున్నారు! కరోనా నుండి ప్రజలను డాక్టర్లు కాపాడుతూ ఉంటే ఆ డాక్టర్లకు పిపిఈ కిట్లు ఇవ్వడం లేదని బహిర్గత పరచిన డాక్టర్ సుధాకర్ ని నిధుల నుండి సస్పెండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ గారూ, ఏడాది పాలనలో మీరు దాదాపు 67 సార్లు హైకోర్టు చేత మొట్టికాయలు (ప్రభుత్వ భవనాలకు పాలక పార్టీ రంగులు వేయడం, ప్రభుత్వ పాఠశాలలో నిర్బంధంగా ఇంగ్లీష్ మీడియం, డాక్టర్ సుధాకర్ ఘటనపై సిబిఐ ఎంక్వైరీ వేయడం,ఇంటెలిజెన్స్ చీఫ్ ఐ బి వెంకటేశ్వరరావుని తొలగించడం మొదలైన వ్యవహారాలలో) తిన్నారు. ఇది మీకు గానీ, రాష్ట్రానికి గానీ ప్రతిష్ఠాకరమేనా? 


రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టిన నేపధ్యంలో జగన్ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అర్హత కోల్పోయారు. హైకోర్టు తీర్పులను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇకనైనా రాజ్యాంగ బద్ధ, ప్రజాస్వామ్యయుతంగా పాలన అందించాలని, ప్రజా సంరక్షకుడిగా పాలన అందించాలని, రాక్షసపాలనకు స్వస్తిపలకాలని, అయిదుకోట్లప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని కోరుతున్నాం.

దేవతోటి నాగరాజు 

(ఎస్సీ ఎస్టీ డెవలప్‌మెంట్‌ కమిటీ మాజీ సభ్యుడు)

Updated Date - 2020-05-31T05:48:57+05:30 IST