Abn logo
Jan 16 2021 @ 23:25PM

జగన్‌రెడ్డి రాక్షస పాలనకు తిరుపతి ఉపఎన్నికతో విముక్తి కావాలి..

పేదోళ్ల స్కీముల్లో స్కాములు చేస్తున్నారు

సజ్జల స్ర్కిప్ట్‌, జగన్‌ డైరెక్షన్‌లో డీజీపీ నడక

తిరుపతి పార్లమెంట్‌ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌ 


నెల్లూరు, జనవరి 16 (ఆంధ్రజ్యోతి) : ఏపీలో జగన్‌రెడ్డి రాక్షస పాలనకు తిరుపతి ఉప ఎన్నికతో విముక్తి కావాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. శనివారం తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికపై ముఖ్య నేతలు, నాయకులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 20 నెలల జగన్‌ నేతృత్వంలోని వైసీపీ పాలనకు ఈ ఉపఎన్నిక గుణపాఠంగా నిలవాలన్నారు. ప్రజల్లోనూ జగన్‌ ప్రభుత్వంపై వ్యతిరేఖత బాగా పెరిగిందన్నారు. ఇటీవల ఆలయాలపై కక్షపూరితంగా చేస్తున్న దాడులను ప్రజలు తెలుసుకుంటున్నారని చెప్పారు. క్రిష్టియన్‌ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌ హిందువుల ఆచారాలు, సిద్ధాంతాలపై ఉద్దేశపూర్వకంగా చేయిస్తున్న దాడులను ప్రజానీకం గమనిస్తుందని  అన్నారు. ఆలయాలపై 150 దాడులు జరిగే వరకు ఉదాసీనంగా వ్యవహరించిన జగన్‌ సర్కారు, వాటిని ప్రశ్నించిన టీడీపీ నాయకులు 17 మంది, బీజేపీ నాయకులు  నలుగురిపై అక్రమ కేసులు పెట్టిందన్నారు. వీటన్నింటిని తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రజల వద్దకు తీసుకెళ్లి ఓటు అనే ఆయుధం ద్వారా జగన్‌రెడ్డికి బుద్ధిచెప్పాలన్నారు. పేదలకు అనేక స్కీములు పెట్టి అందులో భారీగా స్కాములకు పాల్పడుతున్న వైసీపీ ముఠాల అంతుచూడాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు.  రూ. 1.50 లక్షల కోట్లు అప్పులు చేసి ఏపీని ఆర్థికంగా ఎదగలేని దుస్థితిని తీసుకెళ్లారన్నారు.  సజ్జల స్ర్కిప్ట్‌, జగన్‌ డైరెక్షన్‌లో రాష్ట్ర డీజీపీ పని చేయడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి దౌర్భాగ్య దుస్థితి ఏ రాష్ట్రంలోనూ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ వర్ధంతి అనంతరం పార్లమెంట్‌ నియోజకవర్గంలోని అన్నీ ప్రాంతాలలో ప్రచారం ఉదృతం చేయాలని పిలుపుని చ్చారు.  కార్యక్రమంలో జిల్లాకు చెందిన తిరుపతి పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు పాశం సునీల్‌కుమార్‌, నెలవల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement